
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూన్‌లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, అదే సమయంలో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగి.. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయికి ఎగియడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇది 16.86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక గతేడాది జూన్‌లో ఇది 12.96 బిలియన్ డాలర్లు.
కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌లో దిగుమతులు 21.31 శాతం పెరిగాయి. 44.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చూసుకుంటే ఎగుమతులు 14.21 శాతం, దిగుమతులు 13.49 శాతం పెరిగాయి. ఎగుమతుల విలువ 82.47 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 127.41 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం మీద వాణిజ్య లోటు 44.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
జూన్‌లో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, వజ్రాభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. చమురు దిగుమతులు 56.61 శాతం ఎగిసి 12.73 బిలియన్ డాలర్లుగా ఉండగా, పసిడి దిగుమతులు మాత్రం 3 శాతం క్షీణించి 2.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కాగా టెక్స్‌టైల్స్, లెదర్, మెరైన్ ఉత్పత్తులు, పౌల్ట్రీ, జీడిపప్పు, బియ్యం, కాఫీ తదితర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి మందగించింది.