సాక్షి, న్యూఢిల్లీ : బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపడుతున్న మోదీ సర్కార్ ఈ తరహా ఆస్తులపై నిర్థిష్ట సమాచారం అందించిన వారికి కోటి రూపాయల రివార్డు స్కీమ్‌ను ప్రకటించింది. నిర్ధేశిత రూపంలో బినామీ ఆస్తులపై ఐటీ విభాగంలో సంబంధిత అధికారులకు ఎవరైనా నిర్థిష్ట సమాచారం అందచేయవచ్చు. బినామీ లావాదేవీల సమాచారం అందించిన వారికి ఇచ్చే రివార్డు పథకానికి ఎంపికయ్యేందుకు ఎవరైనా బినామీ ఆస్తులపై ఐటీ విభాగంలోని బినామీ నిరోధక యూనిట్లకు చెందిన సంయుక్త, అదనపు కమీషనర్లకు నిర్ధేశిత రూపంలో సమాచారం అందచేయాల్సి ఉంటుంది.
ఈ సమాచారం బినామీ ఆస్తుల లావాదేవీల సవరణ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు అనువైనదిగా ఉండాలి. బినామీ ఆస్తుల వెలికితీతకు దారితీసే సమాచారం అందించే విదేశీయులూ రివార్డు స్కీమ్‌కు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.
బినామీ ఆస్తులు, కంపెనీలు, లావాదేవీలపై నిరంతర నిఘా ఉంటుందని, బినామీ లావాదేవీలపై సమాచారం అందచేసిన వారికి రివార్డు పథకం ప్రవేశపెడతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో ఈ రివార్డ్ స్కీమ్‌ను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment