సాక్షి, ముంబై: ముంబై భారీ వర్షాలలో స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేసిన అంశంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించాలని అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోరింది. వైరల్ వీడియోలో తమ డెలివరీ ఏజెంట్‌ను గుర్తించలేక పోయామని అతని ఆచూకీ కనిపెట్టిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామంటూ స్విగ్గీ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి.
స్విగ్గీమాన్ ఆన్ ఎ హార్స్ గురించి ఆచూకీ తెలిపిన వ్యక్తికి రూ. 5000 బహుమతి అంటూ స్విగ్గీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎందుకంటే అతని గురించి తెలుసుకోవాలని యావత్ దేశంతో పాటు తామూ కోరుకుంటున్నామని వెల్లడించింది. అంతేకాదు పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంబిస్తామని స్పష్టం చేసింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు లాంటివి తమ డెలివరీ వాహనాల్లో లేవని వివరణ ఇచ్చుకుంది. దీంతో కమెంట్ల వెల్లువ కురుస్తోంది.
దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రసారమైన హిందీ టీవీ సీరియల్‌లోని చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇతని గురించేనా వెతికేది అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘ఏ మ్యాన్ ఆఫ్ డ్రీమ్స్’ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు అసలు గుర్రం మీద డెలివరీ ఓకేనా? కాదా? అనే పోల్ నిర్వహించాలని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. కాగా ఇటీవల ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ డెలివరీ బ్యాగ్‌తో ఉన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment