సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ దిగ్గజం ఫేస్ బుక్ మరో సరికొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రాణదానంగా నిలిచే రక్తదానానికి ప్రోత్సహమిచ్చేలా ఒక అద్భుతమైన ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం ఫేస్‌బుక్ వినియోగదారుడు ఫేస్‌బుక్ లో రక్తదాతగా నమోదు కావచ్చు. ముందుగా ఢిల్లీ, హైదరాబాద్‌లోని ఈ సేవలను ప్రారంభిస్తోంది. తదుపరి కొన్ని వారాల్లో ఇతర నగరాలకు విస్తరించనుంది.
అక్టోబర్ 1 జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. ముందుగా న్యూస్‌ఫీడ్‌లో బ్లడ్ డోనర్‌గా రిజిస్టర్ చేసుకునేలా ఒక లింక్‌ను ఫేస్‌బుక్ జోడించనుంది. ఇందులో ఆసక్తి వున్నవారు సంబంధిత వివరాలతో నమోదు కావాల్సి ఉంటుంది. తద్వారా రక్తదాతలతో , రోగులు, హాస్పిటల్, రక్త బ్యాంకులు సులువుగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
భారత దేశంలో చాలా నగరాల్లో రక్తం కొరత చాలా ఉన్నట్టు తాము గుర్తించామని, అలాగే ఫేస్‌బుక్, వాట్సాప్ లో దీనికి సంబంధించి సందేశాలువిరివిగా షేర్ అవడం కూడా తాము గమనించామని అందుకే ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్ దక్షిణ ఆసియా ప్రోగ్రాం హెడ్ రితేష్ మెహతా పిటీఐకి తెలిపారు. దేశంలో రక్త దానం గురించి అవగాహన పెంచడమే తమ ఉద్దేశ్యమని ఫేస్‌బుక్ మేనేజర్(హెల్త్) హేమ బుద్దరాజు చెప్పారు. అలాగే ‘ఓన్లీ మి’ ఆప్షన్ ద్వారా యూజర్ గోప్యతను కాపాడతామని ఇది ఆండ్రాయిడ్, మొబైల్ వెబ్ లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా, రక్తం బ్యాంకులు, ఆసుపత్రులు, ఎన్‌జీఓలు, ఇతర పరిశ్రమ నిపుణులతో చర్చించినట్టు ఆమె పేర్కొన్నారు.