
ఆర్‌కామ్.. ఉచిత ఫేస్‌బుక్
- మరో 30కిపైగా ఇతర సమాచార వెబ్‌సైట్లు కూడా...
- ఇరు కంపెనీల భాగస్వామ్యంతో అందుబాటులోకి...
ముంబై: టెలికం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) వినియోగదారులకు ఇక సామాజిక నెట్‌వర్క్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా మరో 30కి పైగా సమాచార ఆధారిత వెబ్‌సైట్లను కూడా ఎలాంటి ఇంటర్నెట్ చార్జీలూ లేకుండా వాడుకోవచ్చు. ఈ సేవలను అందించేందుకుగాను ఆర్‌కామ్‌తో ఫేస్‌బుక్ జట్టుకట్టింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదార్ల మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో ఫేస్‌బుక్‌ను మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభించింది.
అంతేకాకుండా.. ఆసియాలో తొలిసారిగా భారతీయ మొబైల్ ఫోన్ యూజర్లకు ఈ కొత్త ఇంటర్నెట్.ఆర్గ్ యాప్‌ను వినియోగంలోకి తీసుకొస్తుండటం గమనార్హం.కాగా, ఈ ఒప్పందం ప్రకారం ఫేస్‌బుక్, ఆర్‌కామ్ యూజర్లు వాతావరణానికి సంబంధించిన వార్తలు-సమాచారం, ఉద్యోగాలు, ప్రభుత్వ సేవలు, ఆరోగ్యం ఇతరత్రా అంశాలకు సంబంధించిన 33 వెబ్‌సైట్లకు ఎలాంటి డేటా(నెట్) చార్జీలూ లేకుండా కనెక్ట్‌కావచ్చు. భారత్‌లో 70 శాతం మందికి ఇంకా ఇంటర్నెట్ అందుబాటులో లేదని.. ఫేస్‌బుక్‌తో కలిపి ఈ ఉచిత సేవలను అందించడం ద్వారా మరింత మందికి ఇంటర్నెట్‌ను చేరువచేస్తున్నామని ఆర్‌కామ్ సీఈఓ(కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు.
ఉచిత వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్‌తోపాటు ఓఎల్‌ఎక్స్, క్లియర్‌ట్రిప్, టైమ్స్‌జాబ్స్, బాబాజాబ్, ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. ఈ సేవలను ముందుగా ముంబై, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్(ఏపీ, తెలంగాణ), చెన్నై, తమిళనాడు, కేరళల్లో ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. 90 రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఉచిత సర్వీసులను అందిస్తామన్నారు. ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉన్న దేశాల్లో ఉచితంగా ఇంటర్నెట్ (బేసిక్ సర్వీసులు) అందించేందుకుగాను ఫేస్‌బుక్ ఈ ఇంటర్నెట్.ఆర్గ్‌ను ప్రారంభించింది. ఆర్‌కామ్ కస్టమర్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇంటర్నెట్.ఆర్గ్ వెబ్‌సైట్ ద్వారా లేదా ఇంటర్నెట్.ఆర్గ్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఎలాంటి డేటా చార్జీలూ లేకుండానే ఆయా వెబ్‌సైట్లను వాడుకోవచ్చు.
ఇంటర్నెట్ అనుసంధానానికి భారత్ కీలకం: జుకర్‌బర్గ్
ప్రపంచమంతా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలంటే భారత్ కీలకమని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ‘భారత్‌లోని 120 కోట్ల మంది జనాభాలో 94.4 కోట్ల మందికి ఫోన్‌లు ఉన్నాయి. కానీ, 100 కోట్ల మందికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. ముందుగా ప్రాథమిక(బేసిక్) సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. రానున్న కాలంలో విప్లవాత్మకమైన మార్పులకు ఆస్కారం ఉందనేది నా నమ్మకం’ జుకర్‌బర్గ్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.