ఇంటర్నెట్ కోసం ఫేస్‌బుక్ గిఫ్ట్..! | Facebook Gift for Internet ..! | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ కోసం ఫేస్‌బుక్ గిఫ్ట్..!

Published Tue, Oct 21 2014 10:45 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఇంటర్నెట్ కోసం ఫేస్‌బుక్ గిఫ్ట్..! - Sakshi

ఇంటర్నెట్ కోసం ఫేస్‌బుక్ గిఫ్ట్..!

గూగుల్ ప్రతి సెకనుకూ 40 వేల సెర్చ్ క్వెరీలను హ్యాండిల్‌చేస్తోంది. ఇదే సెకనులో ఫేస్‌బుక్‌లో 40 వేల లైక్‌లు, కామెంట్లు నమోదవుతున్నాయి. ఇంతే సమయంలో యూట్యూబ్‌లోకి రెండు గంటల నిడివితో ఉండే వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 293 కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంది... ఈ గణాంకాలు ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఇవన్నీ కాయిన్‌కు ఒకవైపు మాత్రమే. ఈ రోజుకీ ప్రపంచంలో ఎంతో మందికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. వారి సంఖ్యవందల కోట్లలో ఉంది! ఒకవైపు 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేస్తున్నా... కొన్ని ప్రాంతాల్లో మాత్రం తొలితరం ఇంటర్నెట్ సేవలు కూడా లేవు. ఈ పరిస్థితిని చూసి చలించిపోతున్నాడు ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ఆయన ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. సామాజిక, సాంకేతిక ప్రయోజనాలతో కూడిన ఈ వ్యవహారం జుకర్‌బర్గ్ ఇమేజ్‌ను రెట్టింపు చేస్తోంది. టెక్నాలజీ రంగంలో ఆసక్తిని రేపుతోంది.
 
ఆప్టికల్ ఫైబర్... ప్రపంచ గతిని మార్చింది. ఇంటర్నెట్ ఇంత విస్తృతం అయ్యిందంటే అది ఆప్టికల్ ఫైబర్ అందించిన సౌకర్యం. సుదూర ప్రాంతాలకు ఉత్తమ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ సిగ్నల్స్ పాస్ చేయగల ఆప్టికల్ ఫైబర్ ప్రపంచ గతిని మారుస్తోంది, మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. మరి ఈ విషయంలో మానవాళి ఆప్టికల్‌ఫైబర్‌కు కృతజ్ఞతతో ఉండాలి. అయితే... ఎంతసేపూ ఆప్టికల్ పైబర్ మీదే ఆధారపడితే... విస్తరణ వేగం తగ్గుతుంది.. ఇంటర్నెట్‌ను విస్తృతం చేయాలి.. ఆ సౌకర్యాన్ని ఎక్కువమందికి అందించాలి... ఈ ప్రపంచంలో బతుకుతున్నవారందరికీ ఇంటర్నెట్ ఒక ప్రాథమిక హక్కు కావాలి. మరి అలా చేయాలంటే ఆఫ్లికల్ ఫైబర్, వెబ్ కేబుల్స్, లైన్‌ల మీద ఆధారపడితే అంత సులభంగా సాధ్యం కాదు. అందుకే ఈ వ్యవహారాన్ని కొత్తరకంగా ముందుకు తీసుకెళ్లాలని ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ భావిస్తున్నాడు. అందుకు వారు డ్రోన్స్ మీద ఆధారపడాలని భావిస్తున్నారు. గాల్లో విహరిస్తూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే డ్రోన్స్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉంది ఫేస్‌బుక్ యాజమాన్యం.
 
ఎలా పనిచేస్తాయి?!
ఒక్క మాటలో చెప్పాలంటే వైఫై హాట్‌స్పాట్స్‌లాగా పనిచేస్తాయి. కొన్ని వేల అడుగుల పైన విహరిస్తూ శాటిలైట్‌నుంచిసిగ్నల్స్ తీసుకొని కొన్ని కిలోమీటర్లపరిధిలోని కంప్యూటర్ సర్వర్‌లకు ఇవి ఇంటర్నెట్‌ను వడ్డిస్తాయి. వీటి వల్ల తొలి ఉపయోగం ఏమిటంటే... కేబుళ్ల అవసరం తీరిపోతుంది! వీధి వీధిలోనూ కేబుల్ పూడ్చడం, లేక స్తంభాలకు తగిలించడం, ఇంటింటికీ నెట్ కేబుల్ కనెక్షన్ ఇవ్వడం... ఈ అవసరాలన్నింటికీ ప్రత్యామ్నాయం ఈ డ్రోన్స్!
 
ఉపయోగం ఎంత?!
ఒక్కో డ్రోన్ ద్వారా దాదాపు 21,562 మీటర్ల పరిధిలోని ప్రాంతానికి ఇంటర్నెట్ సిగ్నల్స్ అందించవచ్చునని అంచనా. అంటే దాదాపు 21 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతానికి వైఫై ద్వారా సిగ్నల్స్ అందించవచ్చు. జనావాసాల పరిధిని ఎంచుకొని డ్రోన్స్‌ను లాంచ్‌చేస్తే అక్కడ నాలుగో తరం ఇంటర్నెట్ సేవలను అందించినట్టే కదా! కేబుల్స్, ఫోల్స్, వాటి ఏర్పాటుకు పట్టే సమయం.. అంతా ఆదానే కదా! ల్యాండ్‌ఫోన్ల స్థానంలో సెల్‌పోన్‌లు వచ్చి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఏ విధంగా మార్చేశాయో డ్రోన్స్ కూడా ఇంటర్నెట్ కమ్యూనికేషన్‌ను అదే విధంగా మార్చేయగలవు.
 
డ్రోన్సే ఎందుకు... టవర్‌లు చాలు కదా!

టెలికమ్యూనికేషన్ వ్యవస్థతో పోల్చినప్పుడు సెల్ టవర్‌లలాగా ఇంటర్నెట్ కోసం కూడా టవర్లను కూడా ఏర్పాటు చేసేస్తే చాలు కదా... దాని ద్వారా ఇంటర్నెట్‌ను ప్రొవైడ్‌చేయవచ్చు కదా... అనే ఐడియా సులభంగానే వస్తుంది. అయితే డ్రోన్స్ చాలా సౌకర్యాలు ఉంటాయి. టవర్స్ కన్నా చాలా ఎత్తులో విహరిస్తాయి. శాటిలైట్ నుంచి సిగ్నల్స్‌ను సులువుగా అందుకొంటాయి. అలాగే టవర్‌ను ఏర్పాటు చేయడం చాలా ప్రయాస. డ్రోన్ ను లాంచ్ చేయడం సులభం!
 
కొసరుమెరుపులూ ఉన్నాయి!
ఈ ఏడాది మార్చ్‌లో యూకేకు చెందిన ‘అసెంటా ఏరోస్పేస్’ వారు వైఫైహాట్ స్పాట్‌గా పనిచేయగల ఒక డ్రోన్‌ను డిజైన్ చేశారు. వారి ప్రయోగంపై ఫేస్‌బుక్ దృష్టిసారించింది. ఊరికే కాదు 20 మిలియన్ డాలర్ల సొమ్మును చెల్లించి ఆ ఐడియాపై హక్కులు సంపాదించింది. అభివృద్ధి విషయంలో భాగస్వామిగా మారింది. ఆ ప్రయోగం దాదాపుగా విజయవంతం అయ్యింది. ఫేస్‌బుక్ కొన్ని మార్పులు కూడా సూచించింది. డ్రోన్స్‌కు ప్రత్యేకంగా ఇంధనం అవసరం లేకుండా సౌరశక్తితోనే అవి పనిచే సేలా చూడాలనేది ఫేస్‌బుక్ చేసిన ఒక విలువైన ప్రతిపాదన. అలాగే ఈ ప్రాజెక్ట్ విషయంలో నాసా, అమెస్ రీసెర్చ్ సెంటర్‌ల సహయం తీసుకొంటున్నారు.

ఇంటర్నెట్ విస్తృతం అయితే లాభం ఫేస్‌బుక్‌కు మాత్రమే కాదు. అది అనేక రకాలుగా సాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికే అయితే ఫేస్‌బుక్ ఇంతలా కష్టపడనక్కర్లేదు. కాబట్టి దీంట్లో స్వార్థం పాలు తక్కువగా, సౌకర్యాన్ని అందించాలనే తపన ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ డ్రోన్స్‌ను ప్రపంచానికి ఫేస్‌బుక్ అందించే గిఫ్ట్ అనవచ్చు.

 - జీవన్ రెడ్డి.బి
 
మొదట అందుబాటులోకి వచ్చేది మనకే!
2015లో తొలి డ్రోన్ గాల్లోకి లేవాలి అనేది ఫేస్‌బుక్ లక్ష్యం. అదెక్కడో కాదు భారత్‌లోనే. ఇప్పటికే భారత ప్రభుత్వానికి, ఫేస్‌బుక్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొత్తం 21 వేల కోట్ల రూపాయలప్రాజెక్ట్‌పై ఇటీవల భారత్‌లో పర్యటించిన జుకర్‌బర్గ్ సైన్ చేసి వెళ్లారు. మొత్తం  రెండున్నర లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలనేది లక్ష్యాన్ని కలిగిన ఈ ప్రాజెక్ట్‌కు గానూ డబ్బు, సాంకేతిక సహాయం విషయంలో ఫేస్‌బుక్ ఒక చెయ్యివేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement