
శాన్‌ఫ్రాన్సిస్కో : హ్యాకింగ్.. కొంతకాలంగా విపరీతంగా వినిపిస్తున్న పదం. ఇంటర్‌నెట్ టెక్నాలజీ ఎంత పెరిగిందో.. అంతేస్థాయిలో ప్రమాదాలు పెరిగాయి. వీటిని నిరోధించడంతో పాటు.. తన యూజర్లకు సెక్యూరిటీ పెంచేలా ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ (ముఖాన్ని గుర్తించడం) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఫీచర్ వల్ల యూజర్ల అకౌంట్‌ను ఇతరులు యాక్సిస్ చేయడం సాధ్యం కాదు. యూజర్లు.. తమ ఫేస్‌ను బయోమెట్రిక్ ద్వారా పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుంటే.. ఇతరలెవరూ.. దానిని హ్యాక్ చేయడం కానీ.. యాక్సిస్ చేయడం కానీ సాధ్యం కాదని ఫేస్‌బుక్ అధికారులు చెబుతున్నారు.
ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని ఫేస్‌బుక్ అధికారులు తెలిపారు. కొత్త ఫీచర్ వల్ల.. ఫేక్ అకౌంట్లను గుర్తించడంతో పాటు.. వేల సంఖ్యలో నిరుపయోగంగా ఉన్న అకౌంట్లను గుర్తించడం సాధ్యమవుతుందని ఫేస్‌బుక్ అధికారులు చెబుతున్నారు.
యూజర్ కాకుండా తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఆకౌంట్‌ను ఓపెన్ చేయాలనుకుంటే.. యూజర్ ముందుగానే సదరు వ్యక్తి ఫొటోను అప్‌లోడ్ చేసి ట్రస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో చేర్చాలని చెప్పారు. వారు అకౌంట్‌ను ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే.. మీ ఫోన్‌కు ఒక ఎటీపీ వస్తుంది.. మీరు దానిని అతనితో షేర్ చేసుకుంటే లాగిన్ అవ్వచ్చని అధికారులు తెలిపారు. కొత్త ఫీచర్ వల్ల నిరుపయోగంగా ఉన్న అకౌంట్లు, ఫేక్ ఐడీలను గుర్తించడం సాధ్యమవుతుందని.. అంతేకాక హ్యాకింగ్‌ను నిరోధించవచ్చని అధికారులు అంటున్నారు. అన్ని అనుకూలిస్తే.. ఈ కొత్త ఫీచర్ 2018 మే నాటికి యూజర్లకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.