
ఫేస్‌బుక్ డేటా చోరి వ్యవహారంతో సంచలనం కలిగించే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫేస్‌బుక్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్నామని ఒప్పుకున్న జుకర్‌బర్గ్, రెండు రోజుల పాటు అమెరికన్ సెనేట్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెనేట్ సభ్యుల జరిపిన విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ ప్రధాన వ్యాపారం ప్రకటనలనేనని, ప్రకటనల ద్వారా ఫేస్‌బుక్ నగదు సంపాదిస్తుందని, యూజర్లు నగదు చెల్లించకుండా తామెలా సర్వీసులను అందించగలమని మార్క్ జుకర్‌బర్గ్ ప్రశ్నించడంతో, వాట్సాప్ యూజర్లు ఆందోళన పడ్డారు. ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్ ఇప్పటి వరకు ఉచితంగానే సర్వీసులు అందిస్తోంది. అంటే ఇప్పటి వరకైతే వాట్సాప్‌కు ఎలాంటి యాడ్స్ లేవు. కానీ భవిష్యత్తులో వాట్సాప్‌కు కూడా వ్యాపార ప్రకటనలే తమ ప్రధాన రెవెన్యూలు అని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పకనే చెప్పేశారు. దీంతో ఇక ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్‌ను ఎంతో కాలం ఉచితంగా అందించరు అని అర్థమౌతోందని టెక్ విశ్లేషకులంటున్నారు.
వాట్సాప్ నుంచి కూడా లాభాలు ఆర్జించడానికి, దీనిని కూడా యాడ్స్ వైపు మరలిస్తారని తెలుస్తోంది. ఒకవేళ వాట్సాప్‌లోకి యాడ్స్ రావడం మొదలు పెడితే, మీ బాయ్‌ఫ్రెండ్‌లకు పంపిన మెసేజ్‌లతో సహా మొత్తం డేటాన్నంతటినీ లోతుగా స్కాన్ చేయడం ఫేస్‌బుక్ ప్రారంభిస్తుందట. వాట్సాప్ చాట్‌లన్నీ ఎన్‌క్రిప్టెడ్ అని ఓ వైపు కంపెనీ చెబుతున్నప్పటికీ, ఫేస్‌బుక్ యూజర్ల డేటా అంతటిన్నీ స్కాన్ చేస్తూ అడ్వర్‌టైజింగ్ సర్వీసులను ఫేస్‌బుక్ అందిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వాట్సాప్ యూజర్లు కాస్త జాగ్రత్తతో వ్యవహరించాలని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ జనవరి నుంచే ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫామ్‌పై వాట్సాప్ బటన్‌ను అందించడం ప్రారంభించింది.
బిజినెస్ సర్వీసులను అందించడానికి ఈ వాట్సాప్ బటన్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై యాడ్‌చేసింది. వాట్సాప్ ఫర్ బిజినెసెస్ అనే ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. మరోవైపు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం కోసం ఫేస్‌బుక్‌తో వాట్సాప్ యూజర్ల డేటాను షేర్ చేస్తున్నామని అంతకముందే ఈ కంపెనీ ప్రకటించింది. దీనిపై పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు దేశాల్లో దీనిని నిరాకరిస్తూనే ఉన్నారు. వాట్సాప్ దీని కోసం తన ప్రైవసీ పాలసీని కూడా మార్చేసింది. ఈ పరిణామాలన్నింటిన్నీ చూసుకుంటూ.. జుకర్‌బర్గ్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే, త్వరలోనే వాట్సాప్‌లోకి కూడా యాడ్స్ వచ్చేసి, యూజర్ల డేటా స్కాన్ చేయడం తథ్యమని వెల్లడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment