పబ్లిక్ ఇష్యూలు ఊరిస్తాయ్..!
• ప్రాస్పెక్టస్ చూశాకే పెట్టుబడి పెట్టాలి
• రికమండేషన్లపై ఆధారపడితే అంతే గతి
• రిస్కుల నుంచి అప్పుల వరకూ అన్నీ ప్రాస్పెక్టస్‌లో
• ఐపీవో రంగు తేల్చటానికి కొన్ని అంశాలు చాలు..
• ధర సహేతుకమా? భవిష్యత్తు బంగారమేనా? కూడా చెప్పొచ్చు
ఐపీవో మార్కెట్ మంచి జోరుమీద ఉంది. పేరున్న కంపెనీ, వినూత్న వ్యాపారంతో కూడిన కంపెనీ ఇష్యూ అయితే ఇన్వెస్టర్ల నుంచి ఎన్నో రెట్ల స్పందన ఉంటోంది. లిస్టింగ్‌తోనే మదుపరులను మురిపించి స్వల్ప కాలంలోనే మంచి రిటర్నులందించిన ఐపీవోలు గత రెండేళ్లలో రెండంకెల స్థాయిలో ఉన్నాయి కూడా. కాకపోతే అదే సమయంలో ఇన్వెస్టర్లను నష్టాల పాల్జేసిన ఇష్యూలూ ఉన్నాయ్. నిజానికి ఏ కంపెనీ ఐపీవోకైనా దరఖాస్తు చేసే ముందు... చాలా అంశాలు చూడాలి. ఇవన్నీ వదిలేసి రికమండేషన్లపై ఆధారపడడం అన్ని వేళలా మంచిది కాదు. అందుకే... ఐపీవో నుంచి మంచి ఫలితాలను రాబట్టుకునేందుకు అనుసరించాలన్సిన సూత్రాలేంటో చూద్దాం.
ఐపీవోకు వచ్చే ప్రతి కంపెనీ విధిగా సమగ్ర వివరాలతో కూడిన పత్రాన్ని (ప్రాస్పెక్టస్) ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచాలి. చాలా మందికి ఐపీవోలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న ఆసక్తి ఈ ప్రాస్పెక్టస్‌ను చూసేందుకుండదు. నిజానికి ఈ ప్రాస్పెక్టస్ కూడా అంత సరళంగా ఏమీ ఉండదు. 500–600 పేజీలుంటుంది. అయినప్పటికీ కొన్ని కీలక అంశాలను స్పృశించడం ద్వారా ఆ ఐపీవోలో ఇన్వెస్ట్ చేయాలా, వద్దా అన్న నిర్ణయానికి సులభంగానే రావచ్చు.
ఇంటర్నల్ రిస్క్స్..
కొత్తగా నిధుల సేకరణకు ఐపీవోకు వస్తున్న కంపెనీ లు తమ వ్యాపారం, సవాళ్ల విషయంలో వాస్తవాలను పూసగుచ్చినట్టు వివరించాల్సి ఉంటుంది. ఈ అంశా న్ని సెబీ సైతం పరిశీలనగా చూస్తుంది. అందుకే ఐపీవోకు వచ్చే కంపెనీలు తమ వ్యాపారానికి పొంచి ఉన్న సవాళ్లు, ప్రతి రిస్క్‌ను ‘రిస్క్ ఫ్యాక్టర్స్’ కాలమ్‌లో సాధ్యమైనంత వివరంగా ఇస్తాయి. కంపెనీ అంతర్గత సవాళ్లు (ఇంటర్నల్ రిస్క్స్) అనేవి ఆ కంపెనీకి మాత్రమే పరిమితం. వెలుపలి సవాళ్లు అనేవి సాధారణమైనవి.
ఇటీవల ముగిసిన వరుణ్ బెవరేజెస్ ఐపీవో గుర్తుండే ఉంటుంది. ఈ కంపెనీ తన ప్రాస్పెక్టస్ చిట్టాలో అంతర్గత సవాళ్లను చాలా స్పష్టంగా పేర్కొంది. పెప్సీకో ఇండియాకు వరుణ్ బెవరేజెస్ దేశీయ తయారీ భాగస్వామి. పెప్సీకో ఇండియాతో వరుణ్ బెవరేజెస్‌కు ఉన్న అనుబంధం 17 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితం. అలాగే, ఈ ఒప్పందం కాల వ్యవధి కూడా పదేళ్ల వరకే. అంటే 2022తో పూర్తవుతుంది. పైగా ఈ ఫ్రాంచైజీ ఒప్పందం వరుణ్ బెవరేజెస్ సొంతం కాదు. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కులు పెప్సీకో ఇండియాకు ఉన్నాయి. వీటన్నిం టినీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే మదుపరులు చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసు కోవాలి. అందుకేనేమో వరుణ్ బెవరేజెస్ ఐపీవోకు స్పందన అం తంత మాత్రంగానే వచ్చింది.
అధిక ధరలో ఉందా..?
పబ్లిక్ ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేరు ధరను చాలా ఎక్కువగా నిర్ణయించారా? అన్నది తెలుసుకోవడం అవసరం. ముఖ విలువకు ఎన్ని రెట్లు అధికంగా నిర్ణయించారు? కంపెనీలో పెద్ద షేర్ హోల్డర్లుగా ఉన్న వారు లోగడ ఏ ధరకు కొనుగోలు చేశారన్న వివరాలు ఇందుకు కీలకంగా పరిగణించవచ్చు. గతంలో షేర్ల కొనుగోళ్ల వివరాలు ‘కేపిటల్ స్ట్రక్చర్’ అనే సెక్షన్‌లో ‘బిల్డ్ అప్ ఆఫ్ ప్రమోటర్ హోల్డింగ్స్’ అనే విభాగంలో ఉంటాయి.
ఇటీవలి ఐపీవోకు వచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాస్పెక్టస్‌లో ఆ కంపెనీ గతంలో ఇన్వెస్టర్లకు ఏ ధరకు షేర్లను కేటాయించిందన్న వివరాలను పేర్కొంది. 2015 డిసెంబర్, 2016 మార్చిలో అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు, సింగపూర్‌కు చెందిన టెమసెక్ హోల్డింగ్స్‌కు ఒక్కో షేరును రూ.226.30కు కేటాయించింది. తాజాగా ఐపీవోలో ఒక్కో షేరును రూ.334కు విక్రయించింది. అంటే ఈ ధరకంటే 33 శాతం తక్కువకే గతంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్టు అర్థమవుతోంది.
ఇష్యూ ధరకు ఆధారం...
ఇన్వెస్టర్ల చేతులు కాల్చిన ఐపీవోల గురించి కూడా తెలిసే ఉంటుంది. ఆయా కంపెనీలు వ్యాపార పరంగా సమస్యలు ఎదుర్కోవడం వల్లే ఇలా జరిగిందనుకోవడానికి లేదు. షేర్లను అధిక ధరలో కొనుగోలు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ప్రతి కంపెనీ తన ప్రాస్పెక్టస్‌లో ఇష్యూ ధర ఖరారుకు ఆధారంగా కొన్ని వివరాలు ఇస్తుంటాయి. కొన్ని సరళంగా ఇస్తే... మరికొన్ని చాంతాడంత సమాచారాన్ని ఇస్తాయి. ‘అందుకే బేసిస్ ఆఫ్ ఇష్యూ ప్రైస్’ విభాగాన్ని తప్పకుండా చూడాలి. అంత తీరిక లేకుంటే కనీసం ఇష్యూకు వస్తున్న కంపెనీ తాజా ఈపీఎస్ (ఒక్కో షేరు వారీ ఆర్జన) ఎంతుందన్నది, బుక్‌వేల్యూ వివరాలు తెలుసుకున్నా అంచనాకు రావచ్చు.
సంబంధిత రంగం గురించి కూడా
ఎక్కువ వృద్ధికి అవకాశమున్న బ్యాంకింగ్ వంటి రంగాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన శ్రమ ఉండదు. కానీ, పబ్లిక్ ఇష్యూకు వస్తున్న కంపెనీ పెద్దగా తెలియని రంగంలో పనిచేస్తుందనుకోండి. అప్పుడెలా..? ‘ఇండస్ట్రీ ఓవర్ వ్యూ’ సెక్షన్ ఈ విధమైన సందేహాలను తీర్చే విభాగం. కంపెనీ పనిచేస్తున్న రంగానికి సంబంధించి వృద్ధికి అవకాశాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఈ విభాగంలో ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలా? వద్దా అన్నది నిర్ణయించుకోవడానికి ఇది కీలకంగా ఉపకరిస్తుంది. ఇటీవల ఐపీవోకు వచ్చిన గ్రీన్ సిగ్నల్ బయో ఫార్మా ప్రాస్పెక్టస్ చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఈ కంపెనీ బీసీజీ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కోసం ప్రభుత్వం బీసీజీ వ్యాక్సిన్లను కేవలం రెండు కంపెనీల నుంచే సేకరిస్తుండగా... అందులో గ్రీన్‌సిగ్నల్ బయో ఫార్మా ఒకటి. మరొకటి సెరమ్ ఇనిస్టిట్యూట్. ప్రపంచ ఆరోగ్య సంస్థకు బీసీజీ టీకాల సరఫరాకు అర్హత సాధించిన కంపెనీల్లోనూ గ్రీన్ సిగ్నల్ కూడా ఒకటని కంపెనీ ఐపీవో పత్రాల్లో పేర్కొంది.
మర్చంట్ బ్యాంకర్ ట్రాక్ రికార్డు
చివరగా మర్చంట్ బ్యాంకర్ల ట్రాక్ రికార్డు కూడా ఐపీవో ఇన్వెస్ట్‌మెంట్‌కు కీలకమైనది. ‘అదర్ రెగ్యులేటరీ డిస్‌క్లోజర్స్’ అనే విభాగంలో మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ఉంటుంది. సదరు మర్చంట్ బ్యాంకర్ అంతకుముందు ఏడాది కాలంలో నిర్వహించిన ఐపీవోల షేర్ల ధరల పనితీరు ఎలా ఉందన్న సమాచారం ఇక్కడ లభిస్తుంది.