ఫీచర్ ఫోన్ కొంటే రిపేర్ ఫ్రీ
► సెల్‌కాన్ లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్
► త్వరలో 2,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్
► ప్రతి జిల్లాలోనూ సొంత సర్వీస్ సెంటర్
► సెల్‌కాన్ చైర్మన్, ఎండీ వై.గురు వెల్లడి
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘సెల్‌కాన్’ తాజాగా దేశంలో తొలిసారిగా వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లపై జీవితకాల వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్ బాగా అమ్ముడవుతున్న కొన్ని పాపులర్ హ్యాండ్‌సెట్లకే వర్తిస్తుందని, ఆ తర్వాత ఇతర ఫోన్లకు కూడా విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. ఆఫర్‌లో భాగంగా యూజర్లు వారి ఫోన్లను ఎన్ని సంవత్సరాల పాటైనా (జీవితాంతం) ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చు.
‘అన్ని ఫోన్లను దేశీయంగానే తయారు చేస్తున్నాం. నాణ్యతపై పూర్తిగా పట్టు సాధించాం. కంపెనీ వృద్ధికి కారణంగా నిలిచిన వినియోగదారులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. అందుకే ఈ జీవితకాల వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించాం’ అని సెల్‌కాన్ మొబైల్స్ చైర్మన్, ఎండీ వై.గురు తెలిపారు. శుక్రవారమిక్కడ లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన గురు... పలు ఇతర ఆఫర్లను కూడా ఆవిష్కరించారు. అలాగే డిసెంబర్ చివరి నాటికి నెలకు 10 లక్షల ఫోన్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. మొబైల్ హ్యాండ్‌సెట్లను స్థానికంగా విక్రయించడమే కాకుండా ఎగుమతి కూడా చేస్తున్నామన్నారు.
సిల్వర్ ఎడిషన్
కంపెనీ తాజాగా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పలు ఆఫర్లను ప్రకటించింది. అందులో సిల్వర్ ఎడిషన్ ఒకటి. ఇక్కడ సెల్‌కాన్ హ్యాండ్‌సెట్ కొన్న వారు వెండి నాణేన్ని ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ కొన్ని ఫోన్లకే వర్తిస్తుంది. రూ.899 పెట్టి ఫోన్ కొనుగోలు చేస్తే.. రెండో ఫోన్‌పై 50 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
పది రోజుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్
వచ్చే 10 రోజుల్లో రూ.2,999కే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెస్తున్నట్లు గురు ప్రకటించారు. ఇందులో 4 అంగుళాల డిస్‌ప్లే, అధిక బ్యాటరీ సామర్థ్యం, మూన్‌లైన్ సెల్పీ కెమెరా, 4జీ వంటి పలు ప్రత్యేకతలుంటాయని చెప్పారు. వచ్చేనెలలో డ్యూయెల్ రియర్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు కూడా వెల్లడించారు. వీటి ధర రూ.10,000లోపు ఉంటుందని తెలియజేశారు. టెల్కోలతో కలిసి పలు ఆఫర్లతో రూ.1,000లోపు ఫీచర్ ఫోన్లను తీసుకువస్తామన్నారు. ఇప్పటికే పలు టెలికం ఆపరేటర్లతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్ నేపథ్యంలో కంపెనీ ప్రతి జిల్లా కేంద్రంలోనూ సొంత సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ప్రస్తుతం సంస్థకు 1,400 వరకూ సర్వీస్ సెంటర్లున్నాయి.