భారత్‌పై ఎఫ్‌ఐఐల గురి..! | FII inflows slowing, tough times ahead for Dalal Street? | Sakshi
Sakshi News home page

భారత్‌పై ఎఫ్‌ఐఐల గురి..!

Published Fri, Aug 8 2014 2:37 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

భారత్‌పై ఎఫ్‌ఐఐల గురి..! - Sakshi

భారత్‌పై ఎఫ్‌ఐఐల గురి..!

భారత్ స్టాక్ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు మునుపెన్నడూ లేనంత ఆమితాసక్తితో ఉన్నారా? డాలర్ల సునామీని సృష్టించనున్నారా? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)తో నిర్వహించిన సమావేశాల్లో భారత్‌పై అత్యంత బులిష్ ధోరణి వ్యక్తమైంది. జపాన్, సింగపూర్, అమెరికా, యూరప్‌లలో నిర్వహించిన రోడ్ షోలలో సుమారు 300కు పైగా ఇన్వెస్టర్లతో 85 సమావేశాలను నిర్వహించినట్లు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.

 అందరినోటా భారత్ స్టాక్ మార్కెట్‌పై అత్యంత ఆశావహ దృక్పథం... రానున్న కాలంలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్న వ్యాఖ్యలే వినిపించినట్లు వెల్లడించింది. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రిధమ్ దేశాయ్ సహ రూపకల్పనలో ఈ నివేదిక విడుదలైంది. చాలావరకూ ఎఫ్‌ఐఐలు మార్కెట్లో ఏదైనా కరెక్షన్(దిద్దుబాటు) చోటుచేసుకుంటే కొనుగోళ్లు జరిపేందుకు రెడీగా నిధులను పక్కనబెట్టినట్లు నివేదికలో పేర్కొంది. హెడ్జ్ ఫండ్స్ అయితే, తాము కొనుగోళ్లతో ముందుకెళ్తున్నట్లు చెప్పడం విశేషం. మొత్తంమీద చూస్తే ఇప్పటికే రోజుకో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్న దేశీ మార్కెట్లు ఎఫ్‌ఐఐల నిధుల జోరుతో ఇంకెంత ఉన్నత శిఖరాలను అందుకుంటాయో వేచి చూడాల్సిందే.

 నిధుల వరద...
 దేశీ మార్కెట్లోకి ఎఫ్‌ఐఐలు భారీగా డాలర్ల వరదను పారిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ(ఆగస్టు 1 నాటికి) భారత్ స్టాక్స్‌లో నికరంగా 11.9 బిలియన్ డాలర్లను(దాదాపు రూ.71,500 కోట్లు) కుమ్మరించినట్లు సెబీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక డెట్ మార్కెట్లో(బాండ్‌లలో) మరింత దూకుడుగా 14.25 బిలియన్ డాలర్లను(సుమారు రూ.85,900 కోట్లు) నికరంగా వెచ్చించారు. ఒక్క జూలైలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా స్టాక్స్‌లో 2.18 బిలియన్ డాలర్లు(రూ.13,200 కోట్లు), డెట్ మార్కెట్లో 3.83 బిలియన్ డాలర్ల(రూ.23,000 కోట్లు) చొప్పున పెట్టుబడి పెట్టడం గమనార్హం.

 ఆర్థిక వ్యవస్థ, కంపెనీల రాబడులు..
 గడచిన రెండు నెలలుగా వృద్ధి, ద్రవ్యోల్బణం రెండూ సరైన దిశలోనే వెళ్తున్నాయి. తక్షణ ప్రాతిపదికన కాకుండా.. రానున్న కాలంలో ఈ ధోరణి ఇలాగే కొనసాగితే గనుక ఇన్వెస్టర్లకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వచ్చే 4-8 త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిలో స్థిరమైన రికవరీకి చాన్స్ ఉంది. కంపెనీల రాబడులు క్రమేపీ పుంజుకునే అవకాశాలున్నాయి. వచ్చే మూ డేళ్లూ కంపెనీల లాభాలు చక్రీయగతిన(సీఏజీఆర్) సగటున 18% పైనే వృద్దిని సాధించవచ్చని అంచనా.

 ద్రవ్యోల్బణం రిస్క్‌లు..
 ద్రవ్యోల్బణానికి వర్షాలు, అంతర్జాతీయ ముడిచమురు ధరలే ప్రధాన రిస్కులుగా నిలవనున్నాయి(ఇప్పటికే వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆహార ధరలకు రెక్కలొస్తాయన్న భయం నెలకొంది. దీనికితోడు, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ, ఇరాక్ అంతర్యుద్ధం  క్రూడ్ రేట్లను ఎగదోయొచ్చనే ఆందోళనలూ ఎక్కువవుతున్నాయి). రిటైల్ ద్రవ్యోల్బణం తమ లక్ష్యాలకు అనుగుణంగా దిగొస్తే వడ్డీరేట్లను తగ్గిస్తామని ఇప్పటికే ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

 ద్రవ్యలోటు కట్టడి ఇతరత్రా చర్యలు కొనసాగితే.. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం ముందే సాకారం కావచ్చు. తాజా పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ ధరల కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా వదిలేసిన సంగతి తెలిసిందే. ఎస్‌ఎల్‌ఆర్‌ను మాత్రం అర శాతం తగ్గించింది.

 సంస్కరణలపై..
 మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు నిర్మాణాత్మక సంస్కరణల దిశగా మంచి ఆరంభమే చేసింది. ప్రతిపాదిత కార్మిక సంస్కరణలు.. రక్షణ, బీమా, రైల్వే ఇన్‌ఫ్రాలోకి ఎఫ్‌డీఐల అనుమతి, పరిమితుల పెంపు, ప్రాజెక్టులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్యలు ఇందులో చాలా ప్రధానమైనవి. ప్రభుత్వ వ్యయం, సబ్సిడీల భారాన్ని తగ్గించుకునేదిశగా ఇంకా చర్యలు జోరందుకోవాల్సి ఉంది. అయితే, వర్షపాతం కొరత, అల్పాదాయ వర్గాలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత వంటి పరిమితులు కేంద్రానికి  ఉన్నాయి.

 కేంద్ర బడ్జెట్..
 2014-15 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ధేశించిన ద్రవ్యలోటు లక్ష్యం(ఈ ఏడాది జీడీపీలో 4.1 శాతం) చాలా ప్రతిష్టాత్మకమైనదే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు, సబ్సిడీల కోత, డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ(ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయం)పై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారిస్తారు. అయితే, మొత్తంమీద బడ్జెట్‌లో ప్రకటించిన కొన్ని చర్యలపై ఎఫ్‌ఐఐలు చాలా సానుకూలంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement