ఫలితాలు, ఎఫ్‌ఐఐలపైనే దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారంలో కీలకమైన ఆర్థిక గణాంకాలేవీ వెలువడే అవకాశం లేనందున త దుపరి త్రైమాసిక ఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టిపెట్టే అవకాశమున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, లుపిన్, గ్లెన్‌మార్క్ ఫార్మా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ కన్జూమర్, ర్యాన్‌బాక్సీ ఉన్నాయి. కాగా, ఫలితాలతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల తీరును కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని తెలిపారు.
గత కొన్ని నెలలుగా ర్యాలీ బాటలో సాగిన దేశీ మార్కెట్లు ప్రస్తుతం కొంతమేర వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సార్వత్రిక ఎన్నికలు ఒక కారణంగా, వివిధ దిగ్గజాల మిశ్రమ ఫలితాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ నెల 16న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రస్తుతం వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారని చెప్పారు.
ఇదే తీరు కొనసాగవచ్చు
మార్కెట్లలో గత వారం కనిపించిన అమ్మకాల ధోరణి ఈ వారం కూడా కొనసాగవచ్చునని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అంచనా వేశారు. అయితే అంతర్గతంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉన్నదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం మార్కెట్లు వేచిచూస్తున్నాయని వివరించారు. గత కొద్ది వారాల్లో వచ్చిన పటిష్ట ర్యాలీ కారణంగా గరిష్ట స్థాయిలవద్ద కొంతమేర స్థిరీకరణ జరిగే అవకాశముందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిధి సరస్వత్ పేర్కొన్నారు.
నిఫ్టీ 6,500-6,850
రానున్న రోజుల్లో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 6,500-6,850 పాయింట్ల మధ్య కదిలే అవకాశమున్నదని సరస్వత్ అంచనా వే శారు. ఎన్నికల ఫలితాలు మార్కెట్లను భారీ ఒడిదుడుకులకు లోనుచేస్తాయని చెప్పారు. మొత్తంగా ట్రెండ్ సానుకూలంగానే ఉన్నదని, కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తారని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ అంశాలవైపు చూస్తే... యూఎస్ ఉద్యోగ గణాంకాలు సోమవారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపవచ్చునని అత్యధిక శాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో కొత్తగా 2,88,000 ఉద్యోగాలు జతకాగా, నిరుద్యోగ రేటు 6.3%కు తగ్గింది.
ఏప్రిల్‌లో రూ. 9,000 కోట్లు దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులివి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు, ఫలితంగా సంస్కరణలు వేగమందుకుంటాయన్న ఆశలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఏప్రిల్ నెలలోనూ ఎఫ్‌ఐఐలు దేశీ స్టాక్స్‌లో 160 కోట్ల డాలర్లు (రూ. 9,600 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. తద్వారా వరుసగా ఎనిమిదో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. గత ఆగస్ట్‌లో ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 5,923 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాక ప్రతీ నెల నికరంగా ఇన్వెస్ట్ చేస్తూనే రావడం విశేషం! కాగా, ఏప్రిల్‌లో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 9,185 కోట్ల అమ్మకాలు చేపట్టారు.