ప్రపంచ ఆర్థిక సంస్థలు..భారత్ కృషిని గుర్తించడంలేదు
• ఆర్థిక సంస్కరణలపై అరుణ్‌జైట్లీ విశ్లేషణ
• ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సులో ప్రసంగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కృషి, ఫలితాలను ప్రపంచ ఆర్థిక సంస్థలు పూర్తిగా గుర్తించడం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. దేశంలో వ్యాపార కార్యకలాపాల మెరుగుదలకు భారత్ గడచిన రెండున్నర సంవత్సరాల్లో పలు చర్యలు తీసుకుందని తెలిపారు. ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సును ఉద్దేశించి గురువారం ఇక్కడ ఆర్థికమంత్రి ప్రసంగించారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేకపోరుునా, ఆయా సవాళ్లను ఎదుర్కొని భారత్ పనిచేస్తోందని వివరించారు.
‘‘ఆర్థికవృద్ధి బాటలో ఎన్నో చర్యలు తీసుకున్నాం. అరుుతే చేస్తున్న కృషికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల నుంచి పూర్తి స్థారుు గుర్తింపు లభించడం లేదు’’ అని జైట్లీ అన్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేని వ్యాపార నిర్వహణ విషయమై భారత్‌కు అంతర్జాతీయ బిజినెస్ ఇండెక్స్‌లో ప్రపంచబ్యాంక్ 130వ స్థానాన్ని ఇవ్వడం, వచ్చే రెండేళ్లూ భారత్ రేటింగ్‌ను పెంచేది లేదని గ్లోబల్ రేటింగ్ సంస్థ- స్టాండెర్డ్ అండ్ పూర్ (ఎస్‌అండ్‌పీ) స్పష్టం చేయడం నేపథ్యంలో జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తు తం ఎస్‌అండ్‌పీ లాంగ్‌టర్మ్‌కు సంబంధించి ‘బీబీబీ-’ రేటింగ్ ఇస్తుండగా, షార్ట్ టర్మ్‌గా ‘ఏ-3’ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ఇస్తోంది. ఇక మరో అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ దిగ్గజం- మూడీస్ కూడా వచ్చే రెండేళ్లలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి విముఖత వ్యక్తం చేసింది. జైట్లీ ఇంకేమన్నారంటే...
⇔ 2014 మేలో అధికారంలోకి రావడంతో మోదీ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టిన అంశం- నిర్ణయ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడం. తగిన సమయంలో అవసరమైన నిర్ణయాలను తీసుకోడానికి కేంద్రం ఎన్నడూ వెనకాడలేదు. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుంది.
⇔ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), దివాలా చట్ట సంస్కరణలు, సరళతర వ్యాపార నిర్వహణకు తగిన నిబంధనల సరళీకరణ వంటి అంశాలు ప్రభుత్వం తీసుకున్న చొరవల్లో కొన్ని.
ట్రంప్‌పై ఇలా...: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయంపై అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ, ‘‘ఒక పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన ఒక తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాల్సిందే’’ అని అన్నారు.
డిజిటల్ లాకర్స్‌పై వార్తలు సరికావు...
ప్రభుత్వ తదుపరి చర్య బ్యాంక్ లాకర్ల డిజిటలైజేషన్ అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు. ఇందులో ఎటువంటి నిజం లేదని అన్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలోనే బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసేలా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ ఒక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరణ ఇచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డంలో భాగంగా గురువారం రాత్రి నుంచే అన్ని ఏటీఎంల సేవల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.