
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి లభించిన రూ.656 కోట్ల మూలధనానికి సరిపడా షేర్లు జారీ చేయాలంటూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. గడిచిన కొన్నేళ్లుగా ఈక్విటీకి ప్రతిగా కేంద్రం ఈ నిధులు అందిస్తూ వచ్చింది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు షేర్లను బైబ్యాక్ చేసే అంశంపై చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఏఏఐ కార్పొరేటీకరణపై కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ అధికారులు సమావేశమయ్యారు. పెట్టుబడికి ప్రతిగా ఏఏఐ షేర్లు జారీ చేసే అంశంపై కేంద్రం న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. షేర్ల జారీ పూర్తయితే ఏఏఐని కంపెనీల చట్టం కింద ప్రత్యేక సంస్థగా మార్చేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. ప్రస్తుతం 100 శాతం ప్రభుత్వ అధీనంలోని చట్టబద్ధ సంస్థగా ఏఏఐ ఉంది. తాజాగా, ప్రత్యేక కంపెనీగా మార్చిన తర్వాత ఏఏఐలో వాటాల విక్రయం, షేర్ల బైబ్యాక్ లేదా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టింగ్ చేసే అంశాలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు..
నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల విలీనం ద్వారా 1995 ఏప్రిల్ 1న పార్లమెంటు చట్టం ద్వారా ఏఏఐ ఏర్పాటు అయ్యింది. ప్రస్తుతం ఇది 100 శాతం ప్రభుత్వ అదీనంలోని చట్టబద్ధ కార్పొరేషన్‌గా ఉంది. 2017–17లో వచ్చిన రూ. 2,800 కోట్ల లాభాలు మొత్తం కేంద్రానికి డివిడెండ్‌గా బదలాయించింది. ఏఏఐ దేశీయం గా పౌర విమానయాన మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 125 విమానాశ్రయాలు ఏఏఐ నిర్వహణలో ఉన్నాయి. వీటిలో 18 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 7 కస్టమ్స్ ఎయిర్‌పోర్టులు, 78 దేశీ య విమానాశ్రయాలు మొదలైనవి ఉన్నాయి.