గ్రాసరీ విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్ రీ–ఎంట్రీ
కంపెనీ మార్కెట్‌ప్లేస్ హెడ్ అనిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
గ్రాసరీ విభాగంలోకి ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రీ–ఎంట్రీ ఇవ్వబోతోంది. బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సేవలను పరీక్షిస్తోంది. ఆగస్టులో ఈ సేవలను ఆవిష్కరించే చాన్స్ ఉంది. గ్రాసరీ కోసం ప్రత్యేకంగా నియర్‌బై పేరుతో ఫ్లిప్‌కార్ట్ 2015 అక్టోబరులో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, సౌందర్య సాధనాలను సూపర్ మార్కెట్ల నుంచి సేకరించి కస్టమర్లకు డెలివరీ చేసేది.
వినియోగదార్ల నుంచి స్పందన అంతంతే ఉండటంతో కొన్ని నెలల్లోనే నియర్‌బై యాప్‌కు స్వస్తి పలికింది. రూ.3,900 కోట్ల ఆన్‌లైన్ ఫుడ్, గ్రాసరీ విపణిలో పోటీ కంపెనీ గతేడాది అమెజాన్ నౌ పేరుతో ప్రవేశించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సైతం తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. కొన్ని నెలల్లోనే ఈ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ హెడ్ అనిల్ గోటేటి మంగళవారమిక్కడ తెలిపారు. కంపెనీ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గ్రాసరీ రంగంలో విభిన్న తరహాలో సేవలు అందించేందుకు సిద్ధం అవుతున్నట్టు చెప్పారు.
ధరలు తగ్గుతాయి..: జీఎస్‌టీ రాకతో రానున్న రోజుల్లో రవాణా ఖర్చులతోపాటు ఉత్పత్తుల అంతిమ ధర కూడా తగ్గుతుందని అనిల్ వెల్లడించారు. జీఎస్‌టీ పూర్తి స్థాయిలో అమలైతే ఇది సాధ్యమని అన్నారు. నూతన పన్ను విధానంపై విక్రేతలకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. జూలై 1 తర్వాత అమ్మకాలు తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల సంఖ్య 10 కోట్లపైనే. దీనిని 50 కోట్ల స్థాయికి చేర్చేందుకు అంతర్గతంగా లక్ష్యాన్ని విధించుకున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 28 లక్షల మంది వినియోగదార్లు ఉన్నట్టు చెప్పారు. కంపెనీ అమ్మకాల పరంగా టాప్–6 నగరాల్లో హైదరాబాద్ నిలిచింది.