ఫ్లిప్‘కార్ట్’లోకి.. జబాంగ్ | Flipkart's Jabong buy to create an online fashion giant but will FDI rules ruin party? | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‘కార్ట్’లోకి.. జబాంగ్

Published Wed, Jul 27 2016 12:25 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‘కార్ట్’లోకి.. జబాంగ్ - Sakshi

ఫ్లిప్‘కార్ట్’లోకి.. జబాంగ్

డీల్ విలువ రూ. 470 కోట్లు...
అనుబంధ సంస్థ మింత్రా ద్వారా కొనుగోలు

 న్యూఢిల్లీ : దేశీ ఈ-కామర్స్ రంగంలో మరో కీలక డీల్‌కు దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెరతీసింది. ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ జబాంగ్‌ను చేజిక్కించకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. జబాంగ్‌ను నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్(జీఎఫ్‌జీ)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 7 కోట్ల డాలర్లు(దాదాపు రూ.470 కోట్లు). గతేడాది జబాంగ్ ఆదాయంలో ఈ మొత్తం సగం కావడం గమనార్హం. కాగా, ఈ డీల్‌తో భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ మరింతగా దూసుకెళ్లేందుకు దోహదం చేయనుంది.

ప్రధానంగా మహిళల ఫ్యాషన్ అపారెల్(దుస్తులు) వంటి విభాగాల్లో గట్టి పట్టున్న జబాంగ్‌ను దక్కించుకోవడం ద్వారా మింత్రా.. ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్‌లో సత్తా చాటేందుకు వీలవుతుంది. వివిధ రకాల అనుమతులకు లోబడి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తికావచ్చనేది అంచనా. కాగా, జబాంగ్ కొనుగోలు రేసులో మరో ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌తో పాటు ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ అబాఫ్ కూడా పోటీపడటం గమనార్హం.

 మింత్రాతో ఆరంభం...
2014లో మింత్రాను ఫ్లిప్‌కార్ట్ దాదాపు రూ.2,000 కోట్ల మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే. దేశీ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద ఒప్పందంగా కూడా ఇది నిలిచింది. జబాంగ్ కొనుగోలుతో మింత్రా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.5 కోట్ల మందికి చేరుకోనుంది. జబాంగ్ వద్ద 1,500 ఇంటర్నేషనల్ హై-స్ట్రీట్ బ్రాండ్స్, స్పోర్ట్స్ లేబుల్స్, ఇండియన్ ఎత్నిక్-డిజైనర్ లేబుల్స్ లిస్ట్ అయి ఉన్నాయి. 1,000కి పైగా సెల్టర్లు రిజిస్టర్ అయ్యారు. 2012 జబాంగ్ ఆరంభమైంది.

అయితే, ఈ సంస్థకు ప్రధాన ఇన్వెస్టర్ అయిన రాకెట్ ఇంటర్నెట్.. లాటిన్ అమెరికా, రష్యా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాల్లో ఉన్న మరో నాలుగు ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్లతో జబాంగ్‌ను విలీనం చేయడం ద్వారా జీఎఫ్‌జీని ఏర్పాటు చేసింది. స్వీడన్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కినెవిక్‌కు ఇప్పుడు జబాంగ్ మాతృ  సంస్థ జీఎఫ్‌జీలో అత్యధికంగా వాటా ఉంది.  ఈ ఏడాది మార్చితో ముగిసిన 12 నెలలకు జబాంగ్ నికర ఆదాయం 12.6 కోట్ల యూరోలుగా నమోదైంది. కాగా, ఈ ఏడాది(2016) తొలి త్రైమాసికంలో ఆదాయం 14% ఎగసి 3.26 కోట్ల యూరోలకు చేరింది.

విడి విడిగానే...
మింత్రా, జబాంగ్‌లను అనుసంధానించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని.. విడివిడిగానే ఇవి రెండూ కార్యకలాపాలను కొనసాగిస్తాయని మింత్రా సీఈఓ అనంత్ నారాయణ్ పేర్కొన్నారు. దీనికున్న 40 లక్షల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు, అనేక అంతర్జాతీయ బ్రాండ్‌ల నేపథ్యంలో రెండూ ఒకదానితో ఒకటి సమన్వయంతో ముందుకెళ్లాలనేది తమ ప్రణాళిక అని ఆయన చెప్పారు. కాగా, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) అంచనాల ప్రకారం దేశంలో ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం(ఈ-టైలింగ్) వార్షికంగా 57 శాతం వృద్ధిని సాధిస్తోంది. 2014 డిసెంబర్ నాటికి రూ.2,4046 కోట్లుగా ఉన్న మార్కెట్.. గతేడాది డిసెంబర్‌కు రూ.37,689 కోట్లకు ఎగబాకింది. ఈ ఏడాది చివరికల్లా ఇది రూ.72,639 కోట్లకు దూసుకెళ్తుందనేది ఐఏఎంఏఐ అంచనా.

భారత్ ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధికి ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు కీలకంగా నిలుస్తున్నాయి. ఈ విభాగాల్లో దూసుకెళ్లడమే మా లక్ష్యం. మింత్రా ద్వారా ఇప్పటికే తగినంత మార్కెట్‌ను సొంతం చేసుకున్నాం కూడా. దేశీ ఈ-కామర్స్ రంగంలో కీలక పరిణామాలకు అనుగుణంగా మా గ్రూప్ సాగిస్తున్న ప్రస్థానానికి జబాంగ్ కొనుగోలు నిదర్శనంగా నిలుస్తుంది. - బిన్నీ బన్సల్, ఫ్లిప్‌కార్ట్ సీఈఓ, సహవ్యవస్థాపకుడు

 జబాంగ్ విక్రయం తర్వాత మా కీలక ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్స్ వృద్ధిపై దృష్టిపెట్టనున్నాం. లామోడా, డాఫిటి, నమ్షి, ద ఐకానిక్, జలోరా ఆన్‌లైన్ స్టోర్స్‌కు 24 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వీటిని విస్తరించనున్నాం.
- లారెంజో గ్రాబూ, జీఎఫ్‌జీ చైర్మన్, కెనెవిక్ సీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement