అదనపు ఆదాయం కోసం..
వివిధ వస్తువుల, సేవల ధరలు రాకెట్‌లా దూసుకుపోతూ, సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో నెలా నెలా వచ్చే జీతం గానీ, వ్యాపారంలో వచ్చే లాభం కానీ సరిపోని పరిస్థితులే చాలా మందివి.
ఆర్థిక లక్ష్యాల సాధనకే కాక ఇతరత్రా ఖర్చులకు కూడా ఒక్క జీతం/వ్యాపార రాబడే కాకుండా మరో అదనపు ఆదాయం తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితులు నేడు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరైన పెట్టుబడుల ద్వారా అదనపు ఆదాయం పొందే వివిధ మార్గాల వివరాలు...
ఈక్విటీ డివిడెండ్‌లు: లాభాలు బాగా వచ్చినప్పుడు ఒక కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఆ లాభాల్లో కొంత భాగాన్ని డివిడెండ్‌గా పంచుతుంది. మీరు కనుక ఆ కంపెనీ స్టాక్స్ కొంటే, డివిడెండ్ల రూపంలో మీకు అదనపు ఆదాయం లభిస్తుంది.
కొన్ని కంపెనీలు డివిడెండ్‌ను మూడు నెలలకొకసారి ఇస్తే, కొన్ని ఆరు నెలలు, మరికొన్ని ఏడాదికొకసారి చొప్పున ఇస్తాయి. ఒక్కోసారి లాభాలు బాగా వచ్చి, కంపెనీ మిగులు నగదు నిల్వలు బాగా పెరిగిపోయాయనుకోండి. ఈ కంపెనీ వాటిని బోనస్ షేర్ల రూపంలో ఇన్వెస్టర్లకు పంచుతుంది. ఇక ఈ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు ఉండవు.
డాగ్ స్టాక్స్: అధిక డివిడెండ్ ఈల్డ్ ఉన్న షేర్లను డాగ్ స్టాక్స్ అంటారు. కంపెనీ షేర్ ధరను డివిడెండ్‌తో భాగిస్తే వచ్చేదే డివిడెండ్ ఈల్డ్. నిరంతరం అధిక డివిడెండ్ ఈల్డ్ ఉన్న షేర్లను కొనుగోలు చేస్తే ప్రయోజనం. క్రమం తప్పకుండా డివిడెండ్ల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్ డివిడెండ్స్: ఏడాదికి ఇంత చొప్పున డివిడెండ్ చెల్లించే ఆప్షన్ కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఉంది. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఈ తరహా ఆదాయం ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే ఇవి తప్పని సరిగా వస్తాయన్న గ్యారంటీ లేదు.
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్: చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్‌లో భాగంగా నిర్థారిత మొత్తానికి మ్యూచువల్ ఫండ్ యూనిట్లను నెలకొకసారో, మూడు నెలలకొకసారో విక్రయిస్తారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)కి పూర్తి భిన్నమైనది ఇది.అయితే మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసిన ఏడాది తర్వాతే ఈ ఎస్‌డబ్ల్యూపీని అనుసరించాలి. అలా చేస్తే ఎలాంటి ఎగ్జిట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరముండదు.
ఎంఎఫ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్‌లు: సాధారణంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈక్విటీల్లో గానీ, బాండ్లు, కార్పొరేట్ డిబెంచర్ల వంటి స్థిరాదాయం ఇచ్చే వాటిల్లో గానీ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక కేవలం డెట్ స్కీమ్‌ల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్ క్రమం తప్పని ఆదాయాన్నిస్తాయి. ఈ ఆదాయం నెలకొకసారి గాని, మూడు నెలలకొకసారి గాని, లేదా ఆరు నెలల కొకసారి గాని ఉండొచ్చు. ఈక్విటీ స్కీమ్‌లతో పోల్చితే వీటిల్లో నష్టభయం కొంచెం తక్కువ.