డివిడెండ్ అంటే?
ఫైనాన్షియల్ బేసిక్స్..
మీరు ఇన్వెస్ట్ చేసిన/చేస్తున్న కంపెనీ/మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు వచ్చిన లాభాల్లో మీ వాటానే డివిడెండ్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ లాభాలు వచ్చిన ప్రతి కంపెనీ/ ఫండ్ డివిడెండ్లను ప్రకటించదు. చాలా వరకు కంపెనీలు వాటి వాటాదారులు/స్టాక్‌హోల్డర్స్ సంతృప్తి కోసం, ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి డివిడెండ్‌లను ఇస్తూ ఉంటాయి. డివిడెండ్ అనేది క్యాష్ రూపంలోగానీ, స్టాక్స్ రూపంలోగానీ ఉండొచ్చు.
స్టాక్స్ రూపంలో డివిడెండ్ ఇస్తే.. ఇక్కడ పన్ను బాధలు ఉండవు. అలాగే లిక్విడిటీ, మూలధన సమస్యలు తక్షణం ఉత్పన్నం కావు. క్యాష్ డివిడెండ్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. కంపెనీ స్టాక్ డివిడెండ్‌ను ప్రకటిస్తే.. అందులో ఇది వరకే స్టాక్స్‌ను కలిగిన షేర్‌హోల్డర్లకు మాత్రమే అదనపు షేర్లు వస్తాయి. క్యాష్ డివిడెండ్ విషయానికి వస్తే..
ఇక్కడ కంపెనీ తన లాభాల్లో కొంత వాటాను నగదు రూపంలో స్టాక్‌హోల్డర్లకు అందజేస్తుంది. ఇక్కడ డివిడెండ్ రూపంలో క్యాష్‌ను పొందినవారు దానిపై కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు సాధారణంగా వాటి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భాల్లో డివిడెండ్‌లను ఇస్తూ ఉంటాయి.