రెగ్యులర్ ప్లానుల్లోనే అధిక డివిడెండ్‌లు ఎందుకు? | Regular planullone high dividends | Sakshi
Sakshi News home page

రెగ్యులర్ ప్లానుల్లోనే అధిక డివిడెండ్‌లు ఎందుకు?

Published Mon, Oct 17 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

రెగ్యులర్ ప్లానుల్లోనే అధిక డివిడెండ్‌లు ఎందుకు?

రెగ్యులర్ ప్లానుల్లోనే అధిక డివిడెండ్‌లు ఎందుకు?

 నేను కొద్దికాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్ ప్లాన్‌ల్లో, డెరైక్ట్ ప్లాన్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే డెరైక్ట్ ప్లాన్‌ల్లో కంటే రెగ్యులర్ ప్లాన్‌ల్లోనే అధికంగా డివిడెండ్‌లు లభిస్తున్నాయి. దీనికి కారణమేమిటి?
 
 - సుధారాణి, సికింద్రాబాద్
 మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్‌లు ఎప్పటినుంచో ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కానీ డెరైక్ట్ ప్లాన్‌లు 2013 నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఇక రెగ్యులర్ ప్లాన్‌లు దీర్ఘకాలం నుంచి ఉన్నందున వాటి కార్పస్‌లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలం అమల్లో ఉన్నందున అధిక డివిడెండ్‌లు ఇస్తాయి. ఇక 2013 నుంచే డెరైక్ట్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటి లాభాలు తక్కువగా వుండొచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో లాభాలు వుండకపోవొచ్చు కూడా. రెగ్యులర్ ప్లాన్‌లతో పోల్చితే తక్కువగా ఉంటాయి. గతంలో మ్యూచువల్ ఫండ్స్ తమ పూర్వపు రిజర్వ్‌ల నుంచి కూడా డివిడెండ్‌లను చెల్లించేవి. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ తమ తమ పోర్ట్‌ఫోలియోల్లో ఆర్జించిన వాస్తవిక లాభాల నుంచే డివిడెండ్‌లు చెల్లించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, 2010 మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల రెగ్యులర్ ప్లాన్‌ల డివిడెండ్‌లు  కూడా అంతకు ముందు నుంచి పోలిస్తే, తగ్గాయి.
 
 నేను ఇటీవలే సొంత వ్యాపారం ప్రారంభించాను. ఖర్చులు పోను పొదుపు చేయడానికి రూ.30,000 వరకూ మిగులుతున్నాయి. ఈ  మొత్తాన్ని 4-5 మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఏ తరహా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు? ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీలో ఇన్వెస్ట్ చేయమంటారా? లేకుంటే అన్ని ఫండ్‌ల సిప్‌లకు ఒకే తేదీన ఇన్వెస్ట్ చేయమంటారా?     
 
  - వేణు, విజయవాడ
 దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు వస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక  సిప్‌ల నిర్వహణకు ఇదే సరైన పద్ధతి అంటూ ఏదీ లేదు.  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి నెలవారీ సిప్‌ల్లో ఏ తేదీల్లో ఇన్వెస్ట్ చేసినా మీకు వచ్చే రాబడుల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందుకని ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమీ ఉండవు. పైగా వేర్వేరు తేదీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. అందుకని ఒకే తేదీన అన్ని సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. ఇక సాధారణంగా నెల మొదట్లో వేతనాలు రావడం, వ్యాపారం ఎక్కువగా జరగడం జరుగుతుంది. కాబట్టి నెల మొదటి వారంలో సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సముచితంగా ఉంటుంది.
 
  నేను ఇటీవలనే ఒక మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు కదా ! మూడేళ్లు దాటిన తర్వాత ఈ యూనిట్లన్నింటినీ  ఉపసంహరించుకోవచ్చా? ఏడాది దాటి, మూడేళ్లలోపు ఈ యూనిట్లను ఉపసంహరించుకుంటే ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?     
 
 - రాజు, విశాఖపట్టణం
 ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. అయితే ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రతి సిప్ కాలపరిమితి మూడేళ్లు దాటిన తర్వాతనే వాటిని ఉపసంహరించుకోవడానికి వీలవుతుంది. మీ విషయంలో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించి మూడేళ్లయింది. కాబట్టి మీరు మొదటి సిప్ యూనిట్లను మాత్రమే రిడీమ్ చేసుకునే వీలుంటుంది. ఇలా ప్రతి సిప్‌కు మూడేళ్లు దాటిన తర్వాతనే మీరు వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్ వంటి  పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాక్‌ఇన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు మూడేళ్లలోపు, ఏడాది దాటిన తర్వాత రిడీమ్ చేసుకోలేరు. మూడేళ్లు దాటిన తర్వాతనే వీటిని ఉపసంహరించుకునే వీలు ఉంటుంది.
 
 ఎస్‌బీఐ ఫార్మా, ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌ల్లో గత కొంత కాలంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏమైనా పన్ను మినహాయింపులు ఉన్నాయా? ఏ మేరకు పన్ను మినహాయింపులు పొందవచ్ఛు?             
 
 - అనంత్, బెంగళూరు
 అన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను మినహాయింపులు లభించవు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ  ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి. వీటికి మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రెండు ఫండ్స్-ఎస్‌బీఐ ఫార్మా, ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌లు-ఈ కేటగిరి కిందకు రావు కాబట్టి, మీకు ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు. పన్ను మినహాయింపులు లభించాలంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో ఇన్వెస్ట్ చేయాలి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా పొందవచ్చు. పిల్లల చదువు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement