రెగ్యులర్‌ నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌కు మారడం ఎలా? | dheerendra kumar advice's for investments and startups | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌కు మారడం ఎలా?

Published Mon, Dec 12 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

రెగ్యులర్‌  నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌కు మారడం ఎలా?

రెగ్యులర్‌ నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌కు మారడం ఎలా?

నేను కొన్ని మ్యూచువల్‌  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. వీటిల్లో కొన్ని డైరెక్ట్‌ ప్లాన్‌లు ఉన్నాయి. మరికొన్ని రెగ్యులర్‌  ప్లాన్‌లు ఉన్నాయి. కొన్ని రెగ్యులర్‌  ప్లాన్‌లను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఎలా మార్చుకోవాలి?అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు ఈ రెగ్యులర్‌  ప్లాన్‌ను డైరెక్ట్‌ ప్లాన్‌గా మార్చుకోవడానికి వీలు కల్పిస్తున్నాయా? ఇలా మార్చుకోవడానికి ఏమైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? రెగ్యులర్‌ ప్లాన్‌లను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చుకుంటే ఏమైనా పన్ను భారం ఉంటుందా? వీరేందర్,  విశాఖపట్టణం
రెగ్యులర్‌  ప్లాన్‌లను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చుకోవచ్చు. అన్ని మ్యూచువల్‌  ఫండ్‌ కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తులను నింపి సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు సమర్పించాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న స్కీమ్‌ పేరు పక్కన డైరెక్ట్‌ అని స్పష్టంగా రాయాలి. ఏఆర్‌ఎన్‌(యాంఫీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌) కోడ్‌ను కూడా రాయడం మర్చిపోకండి. మీ దరఖాస్తును పరిశీలించి మీ రెగ్యులర్‌  ప్లాన్‌లను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చడానికి సదరు మ్యూచువల్‌  ఫండ్‌  సంస్థకు కనీసం పది రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ నుంచి మీకు వచ్చే స్టేట్‌మెంట్‌లో మీ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌ పేరు పక్కన డైరెక్ట్‌ప్లాన్‌ అని ఉంటుంది. మీ ప్లాన్‌ రెగ్యులర్‌ నుంచి డైరెక్ట్‌కు మారిందనడానికి ఇదే నిర్ధారణ.

అన్ని మ్యూచువల్‌  ఫండ్‌  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా  మార్చుకోవచ్చు. ఈటీఎఫ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌), లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉన్న ఇతర స్కీమ్‌లకు ఆ లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పూర్తయిన తర్వాతనే డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చుకునే వీలు ఉంటుంది. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌ను రెగ్యులర్‌  ప్లాన్‌ నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌లకు మార్చడానికి ప్రస్తుతం ఏ మ్యూచువల్‌ ఫండ్‌ ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ను వసూలు చేయడం లేదు.

ఎందుకైనా మంచిది మీరు మార్చాలనుకుంటున్న స్కీమ్‌లకు సంబంధించిన మ్యూచువల్‌  ఫండ్‌  సంస్థ ఏవైనా చార్జీలు వసూలు చేస్తుందో లేదో స్పష్టంగా తెలుసుకోండి. రెగ్యులర్‌ ప్లాన్‌ నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌లకు మారడమనేది మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. అందుకని, ఇలా మారేటప్పుడు మీపై ఏమైనా మూలధన లాభాల పన్నులు పడతాయేమో అనే విషయం కూడా చెక్‌ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రస్తుతం ఏదైనా రెగ్యులర్‌ ప్లాన్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే, ఈ సిప్‌ను ఆపేయాలి. డైరెక్ట్‌ ప్లాన్‌లో కొత్త సిప్‌ను ప్రారంభించాలి.

నేను ప్రవాస భారతీయుడిని. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను క్యాన్‌ (కామన్‌ అకౌంట్‌ నంబర్‌) పొందవచ్చా ?ఎలా దరఖాస్తు చేయాలి? సంబంధిత వివరాలను తెలపండి?  సురేశ్, ఈ మెయిల్‌ ద్వారా
ప్రవాస భారతీయ ఇన్వెస్టర్లు కూడా క్యాన్‌ (కామన్‌ అకౌంట్‌ నంబర్‌) కోసం నమోదు చేసుకోవచ్చు. నివాసిత ఇన్వెస్టర్లు క్యాన్‌ కోసం ఎలా దరఖాస్తు చేస్తారో, మీరు కూడా అలాగే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి. క్యాన్‌  నమోదు దరఖాస్తు పత్రాన్ని నింపి మ్యూచువల్‌ ఫండ్‌ యుటిలిటిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎంఎఫ్‌యూఐ)కు చెందిన పాయింట్స్‌ ఆఫ్‌ సర్వీస్‌(పీఓఎస్‌)గానీ,  ఎంఎఫ్‌యూఐ సంబంధిత డిస్ట్రిబ్యూటర్‌కు గానీ, లేదా ఎంఎఫ్‌యూఐలో సభ్యత్వం ఉన్న ఏదైనా మ్యూచువల్‌  ఫండ్‌ కంపెనీ బ్రాంచీలో కానీ సమర్పించాలి.

ఎంఎఫ్‌యూ వెబ్‌సైట్‌ నుంచి క్యాన్‌ దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లకు సంబంధించి లావాదేవీలు జరపడానికి ఒక కామన్‌  ప్లాట్‌ఫామ్‌ను ఎంఎఫ్‌యూఐ అందిస్తోంది. క్యాన్‌ను ఉపయోగించి ఈ కామన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్‌ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఒకే రిఫరెన్స్‌గా క్యాన్‌ను ఇన్వెస్టర్‌కు కేటాయిస్తారు. క్యాన్‌ను ఉపయోగించి వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లకు సంబంధించి బహుళ లావాదేవీలను ఇన్వెస్టర్లు క్యాన్‌ ద్వారా ఒకే దరఖాస్తు/ చెల్లింపుద్వారా జరపవచ్చు.

ప్రస్తుతం గిల్ట్‌ఫండ్స్‌ మంచి పనితీరును కనబరుస్తున్నాయని మిత్రులు చెబుతున్నారు. డెట్‌ ఫండ్స్‌ కన్నా వీటి పనితీరు బావుందని వారంటున్నా రు. వడ్డీరేట్లు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గిల్ట్‌ ఫం డ్స్‌ మంచి సాధనాలని నేను భావిస్తున్నాను. నా నిర్ణయం సరైనదేనా?  ఇక్బాల్, హైదరాబాద్‌
గిల్ట్‌ ఫండ్స్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడతాయి. ఇవి దీర్ఘకాల మెచ్యూరిటీ సాధనాలు. వడ్డీరేట్ల మార్పుల ప్రభావం ఈ ఫండ్స్‌పై ఉంటుంది. వడ్డీరేట్లు పడిపోతున్నప్పుడు మంచి రాబడులను ఇస్తాయి. అలాగే వడ్డీరేట్లు పెరుగుతున్నప్పుడు తక్కువ రాబడులనిస్తాయి. రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గిపోతాయనే అంచనాలు బాగా ఉన్నాయి. ఈ అంచనాలు ఆధారంగానే పలువురు ప్రస్తుతం ఈ ఫండ్స్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. మీరు ఒకవేళ ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌చేస్తే, వడ్డీరేట్లు పెరగడం మొదలవుతుందనుకున్నప్పుడు వీటి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వడ్డీరేట్లు పెరగడం, తగ్గడం– ఈ విషయాలపై మీకు తగిన అవగాహన,. అంచనాలు ఉంటేనే గిల్ట్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా అంచనా వేయడం కష్టమన్న ఉద్దేశంతో పలువురు రిటైల్‌ ఇన్వెస్టర్లు డెట్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తారనే విషయాన్ని మరచిపోకండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement