ఐటీ నిపుణులకు ఇదిగో లక్ష కోట్ల సెక్టార్
ఏ క్షణాన కంపెనీలు ఎలాంటి పిడుగు లాంటి వార్తను తమ చెవిన వేయనున్నాయోనని ఆందోళన చెందుతున్న ఐటీ నిపుణులకు ఓ అపూర్వ అవకాశం మార్కెట్లోకి వచ్చేసింది.
ఏ క్షణాన కంపెనీలు ఎలాంటి పిడుగు లాంటి వార్తను తమ చెవిన వేయనున్నాయోనని ఆందోళన చెందుతున్న ఐటీ నిపుణులకు ఓ అపూర్వ అవకాశం మార్కెట్లోకి వచ్చేసింది. ఐటీ పరిశ్రమలో భారీ ఎత్తున్న ఉద్యోగవకాశాలు కల్పించడానికి బిగ్ డేటా అనాలిటిక్స్ రంగంలోకి వచ్చేసిందని ఇండస్ట్రి నిపుణులు చెప్పారు. వచ్చే 2025 కల్లా ఈ రంగం ఎనిమిదింతల వృద్ధి సాధించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉన్న బిగ్ డేటా అనాలిటిక్స్ రంగం వృద్ధి వచ్చే ఏళ్లలో 16 బిలియన్ డాలర్లకు(రూ.లక్ష కోట్లకు) ఎగయనుందని ఇండస్ట్రి నిపుణులు తెలిపారు. ప్రస్తుతం బిగ్ డేటా అనాలిటిక్స్‌లో భారత్, ప్రపంచంలో టాప్10లో ఉన్నట్టు తెలిసింది. వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో భారత్‌ను టాప్-3లో నిలపాలని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ టార్గెట్‌గా పెట్టుకుంది.
బిగ్‌డేటా అనాలిటిక్స్‌లో ఎనిమిది స్పెషలైజేషన్స్‌లో ఎక్కువగా వృద్ధి ఉన్నట్టు నాస్కామ్ గుర్తించింది. అవి బిజినెస్ అనాలిస్టులు, సొల్యుషన్ అర్కిటెక్ట్స్, డేటా ఇంటిగ్రేటర్లు, డేటా ఆర్కిటెక్ట్స్, డేటా అనాలిస్టులు, డేటా సైంటిస్టులుగా నాస్కామ్ పేర్కొంది. నాస్కామ్ ప్రకారం అనాలిటిక్స్ ఎగుమతుల మార్కెట్ 2017లో కనీసం 20 శాతం వృద్ది సాధించనున్నట్టు వెల్లడైంది. ఇది మొత్తం ఐటీ ఎగుమతుల కంటే కూడా అత్యధికమని నాస్కామ్ పేర్కొంది. భారీ ఎత్తున్న వృద్ధి ఉద్యోగవకాశాలను కూడా ఈ రంగం సృష్టించనుందని అనాలిటిక్స్ ఇండియా మేగజీన్ అధ్యయనం తెలిపింది. గత ఏడాది కాలంలో దీనిలో ఉద్యోగాల రెండింతలయ్యాయని వెల్లడించింది. ప్రస్తుతం 50వేల పొజిషన్లు అనాలిటిక్స్‌కు సంబంధించినవే ఉన్నాయని అనాలిటిక్స్ అండ్ డేటా సైన్సు ఇండియా జాబ్స్ స్టడీ 2017 అంచనావేసింది.