వరస కడుతున్న విదేశీ కంపెనీలు | foreign bed companys competrion in market | Sakshi
Sakshi News home page

వరస కడుతున్న విదేశీ కంపెనీలు

Published Fri, Mar 25 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

వరస కడుతున్న విదేశీ కంపెనీలు

వరస కడుతున్న విదేశీ కంపెనీలు

ప్రీమియం ఉత్పత్తులతో ఎంట్రీ
గట్టిపోటీనిస్తున్న దేశీ బ్రాండ్లు
రూ.7 వేల కోట్లకు పరుపుల పరిశ్రమ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెర్టా, కింగ్ కోయిల్, ఎక్లిప్స్, స్ప్రింగ్ ఎయిర్, సిమ్మన్స్... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? విదేశీ ‘పరుపుల’ బ్రాండ్లు. పెరుగుతున్న టూరిజానికి తగ్గట్టుగా హోటళ్లు, రిసార్ట్‌లతో ఆతిథ్య రంగం మంచి జోష్‌మీద ఉండటం, ఇళ్లలోనూ ఖరీదైన పరుపుల వాడకం పెరుగుతుండటంతో దేశంలో అవకాశాల్ని అందిపుచ్చుకోవటానికి ఈ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకూ ఇక్కడి డీలర్లు నేరుగా విదేశాల నుంచి పరుపులను తెప్పించి విక్రయించేవారు. అయితే దిగుమతి పన్నులు ముడిపడి ఉండడంతో ఉత్పత్తులు ఖరీదు కావటం... డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో నేరుగా విదేశీ కంపెనీలే ఇండియాలో తయారీకి సై అంటున్నాయి. బెడ్డింగ్ సొల్యూషన్స్‌లో ఈ విదేశీ బ్రాండ్లకు దేశీ దిగ్గజాలు కర్లాన్, సెంచురీ, డ్యూరోఫ్లెక్స్, స్లీప్‌వెల్, గోద్రెజ్ ఇంటీరియో, స్ప్రింగ్ ఫిట్, పెప్స్, నీల్‌కమల్ వంటివి గట్టి పోటీనిస్తున్నాయి.

ఒకదాన్ని మించి ఒకటి: అంతర్జాతీయ కంపెనీల్లో 100 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. విక్రయాల పరంగా ప్రపంచ నంబర్ 1 కంపెనీ తమదేనని సీలీ చెబుతోంది. అట్లాంటాకు చెందిన సిమ్మన్స్ బెడ్డింగ్ కంపెనీకి 250 యూఎస్ పేటెంట్లు ఉన్నాయి. కంపెనీ 140 ఏళ్లకుపైగా ఈ రంగంలో ఉంది. 110 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కింగ్ కాయిల్ 80 దేశాల్లో అడుగు పెట్టింది. స్ప్రింగ్ ఎయిర్ ప్రపంచ టాప్-10 కంపెనీల్లో ఒకటి. సీలీ భారత్‌లో అత్యంత ఖరీదైన పరుపులను అమ్ముతోంది. సీలీ పరుపుల ధరలు భారతీయ రేంజ్‌లో రూ. 45,000 నుంచి రూ.1.2 లక్షల వరకు ఉన్నాయి. అంతర్జాతీయ రేంజ్‌లో రూ.లక్ష నుంచి రూ.11.5 లక్షల వరకు ఉన్నాయి. ఇక్కడి మార్కెట్ కోసమే ఇండియన్ రేంజ్‌ను ప్రవేశపెట్టడం విశేషం. హైదరాబాద్‌లో రూ.3 లక్షలు ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం పరుపులు అన్ని బ్రాండ్లవీ కలిపి నెలకు 10-12 యూనిట్లు అమ్ముడవుతున్నాయని సీలీ గ్యాలరీ ప్రమోటర్ శ్రీనివాసరావు తెలిపారు.

పోటీ పెరగటంతో నిలకడగా ధర...
గత రెండేళ్లుగా దేశీయ బ్రాండ్ల పరుపుల ధర పెరగలేదని రిపోస్ చెబుతోంది. మార్కెట్లో తీవ్రపోటీ ఉందని, విదేశీ దిగ్గజాలు కూడా నేరుగా మార్కెట్లోకి అడుగు పెడతున్నాయని తెలియజేసింది. పరుపుల ధర పెంచాల్సి వస్తే కంపెనీలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయని ఒక డీలర్ వెల్లడించారు. విదేశీ బ్రాండ్ల ఉత్పత్తుల ధర ఏటా 10 శాతం పెరుగుతోందని మరో డీలర్ తెలిపారు. భారత్‌లో పరుపుల మార్కెట్ విలువ సుమారు రూ.7,000 కోట్లుగా ఉన్నట్లు అంచనా. ఇందులో 15 శాతం వృద్ధి రేటుతో వ్యవస్థీకృత రంగం మూడింట ఒకవంతు కైవసం చేసుకుంది. మెట్రో నగరాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఎక్స్‌క్లూజివ్ షోరూంలు, డీలర్ నెట్‌వర్క్‌తో కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీల ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి.

ఉత్పత్తులూ ప్రత్యేకమే..
ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. నాణ్యమైన పరుపులను వాడాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు ప్రత్యేకతను చూపేందుకు నేచురల్ ప్రోడక్ట్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. అలోవెరా తాపడంతో యాక్సెసరీస్‌ను రిపోస్ మ్యాట్రెస్ తయారు చేస్తోంది. వెదురు, సహజ రబ్బరు, ఆర్గానిక్ కాటన్‌తోనూ ఉత్పత్తి చేస్తున్నట్టు రిపోస్ మ్యాట్రెస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వి.బాలాజీ చెప్పారు. భారత్‌లో తొలిసారిగా సోయా రసంతోనూ యాక్సెసరీస్ రూపొందించినట్లు తెలియజేశారు. కింగ్ కాయిల్ సైతం సహజ సిద్ధ రబ్బరు, ముడి పదార్థాలతో పరుపులను తయారు చేస్తోంది. ఎక్లిప్స్ ఒక అడుగు ముందుకేసి పేటెంట్ కలిగిన అలర్జీ ఫ్రీ పరుపులను విక్రయిస్తోంది. పరుపుల తయారీలో భారత్‌లో అతిపెద్ద కంపెనీ అయిన కర్లాన్ ఆదాయంలో రూ.లక్షకు మించి ఖరీదున్న సూపర్ ప్రీమియం ఉత్పత్తుల వాటా 10 శాతానికి పైగా ఉంది. రెండేళ్ల క్రితం ఇది 5 శాతానికే పరిమితం. దీన్నిబట్టి ఇక్కడి మార్కెట్ పెరుగుతున్న వేగం అర్థం చేసుకోవచ్చు. అన్ని కంపెనీలు కస్టమర్లు కోరిన రంగులు, సైజుల్లో పరుపులను తయారు చేసి ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement