ఆటుపోట్లున్నా.. పెట్టుబడుల వెల్లువ! | Foreign investors may face new tax bill on CLO risk-retention compliance | Sakshi
Sakshi News home page

ఆటుపోట్లున్నా.. పెట్టుబడుల వెల్లువ!

Published Thu, Apr 21 2016 1:06 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఆటుపోట్లున్నా.. పెట్టుబడుల వెల్లువ! - Sakshi

ఆటుపోట్లున్నా.. పెట్టుబడుల వెల్లువ!

స్టాక్ మార్కెట్లలో జోరుగా  ఇన్వెస్ట్ చేస్తున్న భారతీయులు
ఇదే సమయంలో అమ్ముతున్న విదేశీ ఇన్వెస్టర్లు
రికార్డు స్థాయికి చేరిన ఈక్విటీ పెట్టుబడులు
ఈ ఏడాది మరింత పెరుగుతాయంటున్న నిపుణులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నా.. దేశీయ చిన్న మదుపుదారులు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. మార్కెట్లు పడుతున్నా నిర్భయంగా ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015-16 సంవత్సరంలో వివిధ ఆటుపోట్ల మధ్య స్టాక్ సూచీలు సుమారు 10 శాతం నష్టపోయినా  దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 70,812 కోట్లు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టారు. కానీ ఇదే సమయంలో విదేశీ సంస్థాగత మదుపుదారులు రూ. 14,171 కోట్లు విలువైన ఈక్విటీలను విక్రయించడం గమనార్హం.

ఎఫ్‌ఐఐలు ఇలా అమ్ముతున్నా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తుండటం మారుతున్న ట్రెండ్‌కి ఇది నిదర్శనమని డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ జవేరి తెలిపారు. గతేడాది (2014-15) ఈక్విటీలు మంచి లాభాలు అందించడంతో రికార్డు స్థాయిలో రూ. 86,816 కోట్లు ఇన్వెస్ట్ చేశారని, కానీ ఇప్పుడు ఒడిదుడుకుల్లో కూడా ఈ స్థాయిల్లో ఇన్వెస్ట్ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు.

 2014-15లో సగటున ప్రతి నెలా రూ. 7,550 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే గతేడాది రూ. 6,250 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అన్నిటికంటే ప్రధానమైన అంశం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా మ్యూచువల్ ఫండ్ 53 లక్షల ఖాతాలు ప్రారంభం కావడం విశేషం. దీంతో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య 4.7 కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక శాతం చిన్న పట్ణణాల నుంచే ఉన్నట్లు  అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) గణాంకాలు తెలియచేస్తున్నాయి. వడ్డీరేట్లు తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ఈక్విటీ ఫండ్స్‌పై అవగాహన పెరుగుతుండటంతో రానున్న కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ, సీఈవో నిమేష్ షా పేర్కొన్నారు. 2008లో రెండు లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల విలువ ఇప్పుడు సుమారు నాలుగు లక్షల కోట్లకు చేరిందన్నారు.

లక్ష కోట్ల క్లబ్‌లో ఆరు సంస్థలు
గతంలో మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలకు లక్ష కోట్ల మార్కు అనేది ఒక కలగా ఉండేది. దీన్ని తొలిసారిగా 2008లో రిలయన్స్ ఎంఎఫ్ అందుకుంది. కానీ ఆ తర్వాత మార్కెట్ పతనంతో వెనుకబడిపోయింది. అయితే గత రెండేళ్ల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుండటంతో ఇప్పుడు ఏకంగా 6 ఫండ్ హౌజ్‌లు ఈ మార్కును అందుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 42 ఫండ్ హౌజ్‌లు ఉండగా ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ

 (రూ. 1.76 లక్షల కోట్లు), ఐసీఐసీఐ (రూ. 1.76 లక్షల కోట్లు), రిలయన్స్ (రూ. 1.59 లక్షల కోట్లు), బిర్లాసన్‌లైఫ్ (రూ. 1.36 లక్షల కోట్లు), ఎస్‌బీఐ (రూ. 1.07 లక్షల కోట్లు), యూటీఐ (రూ. 1.06 లక్షల కోట్లు)లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ ఈ మార్కును అధిగమించాయి.  ఇదే విధమైన వృద్ధిరేటు ఉంటే ఈ ఏడాది రెండు లక్షల కోట్ల మార్కును అధిగమించగలమన్న ధీమాను పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. తొలిసారిగా నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అందుకోవడంపై ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎండీ సీఈవో దినేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 42 మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్న ఆస్తుల విలువలో 14% వృద్ధి నమోదయ్యింది. 2014-15లో రూ. 11,94,619 కోట్లుగా ఉన్న ఆస్తుల విలువ ఈ ఏడాది రూ. 1,63,940 కోట్లు పెరిగి రూ. 13,58,559 కోట్ల రికార్డు స్థాయికి చేరాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement