స్టాక్‌మార్కెట్లో ఎంతో అధ్యయనం చేసామనుకునేవాళ్లకు సైతం క్రమం తప్పకుండా లాభాలు పొందడం సాధ్యం కాదనేది మార్కెట్ పండితుల మాట. ఇది ఒకరకంగా వాస్తవం కూడా! ఒక అధ్యయనం ప్రకారం 100 మంది షేర్లలో పెట్టుబడులు పెడితే కేవలం 5 శాతం మంది మాత్రమే క్రమం తప్పని సంపాదన ఆర్జిస్తారు. మిగిలిన వాళ్లు క్రమంగా నష్టాలతో ముగిస్తారు. మార్కెట్లో పెట్టుబడికి అందరికీ సమానావకాశలున్నా, కొందరికే ఆర్జన సాధ్యం కావడం, మిగిలినవాళ్లు నష్టాలతో ముగిసిపోవడం జరుగుతుంది.. ఎందుకని? అనేది సగటు ఇన్వెస్టర్‌కు అర్ధంకాదు. దీనికి సమాధానం తెలియాలంటే అసలు ముందుగా ఈక్విటీల ప్రదర్శన ఎలా ఉంటుంది, ఎలా ఇందులో రాబడులు ఉత్పన్నం అవుతాయో గమనించాలి.
ఈక్విటీ మార్కెట్ రిటర్న్స్ సాధారణంగా కార్పొరేట్ ఎర్నింగ్స్‌పై ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగితే సదరు షేరు ధర పెరగడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. స్వల్పకాలానికి మార్కెట్‌ను సెంటిమెంట్లు నడిపిస్తుంటాయి. కార్పొరేట్ ఎర్నింగ్స్ మూడు నెలలకు ఒకసారి వస్తాయి. కానీ షేరు ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. కేవలం ఎర్నింగ్స్ మీద ఆధారపడేవైతే షేర్ల ధరలు మూడు నెలలకొకమారే ధరలు మారాల్సిఉంటుంది. కానీ సెంటిమెంట్ కారణంగా ప్రతిరోజూ మార్కెట్లో ధరలు మారుతుంటాయి. దీంతో ఒక ఇన్వెస్టర్ లాభాలు గడిస్తే, మరొకరు నష్టాలు చూస్తుంటారు.
బఫెట్ బాట..
ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన పెట్టుబడుల వివరాలు ఏవీ గోప్యంగా ఉంచరు. ఆయన వేటిలో పెట్టుబడులు పెట్టారో బహిర్గతం చేస్తూనే ఉంటారు. కానీ ఆయన పోర్టుఫోలియో అనుకరించినవాళ్లలో చాలా కొంతమంది మాత్రమే లాభాలు పొందుతారు. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో టెక్నికలవిశ్లేషణ, రిసెర్చ్ కాన్న సెంటిమెంట్‌ను ఒడిసిపట్టడం కీలకమని తెలుస్తోంది. అందుకే సక్సెసయిన ఇన్వెస్టర్లు ఎక్కువగా సెంటిమెంట్‌ను ఫాలోకావడంపై ఎక్కువ ఫోకస్ పెట్టమని చెపుతుంటారు.
అదే కారణం..
మనిషిలో ఉండే ఆశ మరియు భయం.. మార్కెట్లో సెంటిమెంట్‌ను శాసిస్తుంటాయి! ఆస్తి నష్టంతో వచ్చే భయాన్ని దాదాపు చావు భయంతో సమానంగా మనిషి మెదడు పరిగణిస్తుందని మానసిక నిపుణులు విశ్లేషించారు. అందుకే మార్కెట్లో నష్టం వస్తుందన్న భయాన్ని మనిషి తొందరగా ఫీలవుతాడు. అందుకే స్వల్ప ఒడిదుడుకులకు కూడా భయపడి లాంగ్‌టర్మ్ మాట మరిచి ముందే అమ్ముకొని బయటపడేందుకు ఎదురు చూస్తుంటాడు. ఇదే ప్రధానంగా నష్టాలకు కారణమవుతుంటుంది. కొంతమంది మాత్రమే ఒక పెట్టుబడి పెట్టి అది తగిన ఫలాలు ఇచ్చేవరకు దీర్ఘకాలం వేచిచూస్తారు. బఫెట్ సైతం ఇదే విధంగా లాభాలు పొందారు. కానీ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది మాత్రం రిసెర్చ్, విశ్లేషణకు అధికప్రాధాన్యమిచ్చి సెంటిమెంట్ ప్రాధాన్యతను మర్చిపోతుంటారు. కానీ నిజానికి మన పెట్టుబడిపై లాభనష్టాలను ఎక్కువ శాతం డిసైడ్ చేసేది సెంటిమెంటే! కాబట్టి మార్కెట్ మూడ్‌ను గమనించి ఆపై టెక్నికల్ విశ్లేషణ చేసుకొని పెట్టుబడులు పెట్టి, లాంగ్‌టర్మ్ వేచిచూస్తే ఈక్విటీల్లో సంపాదించే ఆ 5 శాతం మందిలో మీరు కూడా చేరతారని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment