టెల్కోల రాబడులకు గండే
ముంబై: వాట్స్‌యాప్, ట్విట్టర్, గూగుల్, స్కైప్ వంటి ఓవర్-ద-టాప్(ఓటీటీ) ఆపరేటర్ల కారణంగా అంతర్జాతీయ టెలికం కంపెనీల రాబడులకు గండి పడుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ శుక్రవారం హెచ్చరించింది. వాట్స్‌యాప్‌ను ఇటీవలే ఫేస్‌బుక్ కొనుగోలు చేయడం తెలిసిందే. వాయిస్ కాల్స్ రంగంలోకి రావాలని ఫేస్‌బుక్, తదితర ఓటీటీలు ప్రయత్నాలు చేస్తుండడం అంతర్జాతీయ టెలికం కంపెనీలపై తీవ్రంగానే ప్రభావం పడుతుందని ఫిచ్ పేర్కొంది. అయితే సమీప భవిష్యత్తులో భారత టెలికం కంపెనీలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.
ఫిచ్ వెల్లడించిన వివరాల ప్రకారం...,
వాట్స్‌యాప్, ట్విట్టర్, గూగుల్, స్కైప్ వంటి ఓవర్-ద-టాప్(ఓటీటీ) సంస్థలు టెలికాం ఆపరేటర్ల కంటే చౌకగా మెసేజ్, వాయిస్ సర్వీసులందజేస్తున్నాయి. ఇక డేటా వినియోగం పెరిగినంతగా ఆ రంగం నుంచి రాబడులు పెరగలేదు. ఇతర సర్వీసులతో పోల్చితే టెలికం కంపెనీలకు డేటా సర్వీసుల్లో మార్జిన్లు తక్కువగా ఉంటాయి. మరోవైపు ఇతర సంప్రదాయ సర్వీసుల నుంచి వచ్చే ఆదాయం ఈ కంపెనీలకు తగ్గుతుంది.
భారత్, ఇండోనేషియా, శ్రీలంక దేశాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాయిస్, టెక్స్‌ట్ సర్వీసుల ధరలు తక్కువగా ఉండడం, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం కూడా తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ దేశాల్లోని టెలికం కంపెనీలపై ప్రభావం పెద్దగా ఉండదు.
కాల్స్, టెక్స్ ట్, డేటాలన్నింటికి కలిపి ఒకే టారిఫ్‌ను నిర్ణయించడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కె ప్రయత్నాలు చేయవచ్చు.
ఇక భారత్ విషయానికొస్తే, భారీ పెట్టుబడులు ఉన్న రిలయన్స్ జియో సంస్థ వాయిస్, డేటా రంగాల్లోకి వస్తుండటంతో దేశీయ టెలికాం కంపెనీలకు ఇబ్బంది తప్పదు. ఈ కంపెనీ అత్యంత చౌక టారిఫ్‌లను అందించే అవకాశాలున్నాయి.