టెట్రా ప్యాక్‌లో నన్నారి, బిల్వ షర్బత్
⇔ సేంద్రియ బెల్లంతో త్రిఫల షర్బత్
⇔ గిరిజన సహకార సంస్థ సరికొత్త ప్రయోగం
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. కొన్నాళ్లుగా ఔషధ గుణాలున్న నన్నారి, బిల్వల(మారేడు)తో తయారు చేసి బాటిళ్ల రూపంలో విక్రయిస్తున్న షర్బత్‌లను నీటిలో కలుపుకుని తాగాల్సి వస్తోంది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా టెట్రా ప్యాక్‌ల్లో తయారుచేస్తోంది. 100 మిల్లీలీటర్ల ఈ టెట్రా ప్యాకెట్‌కు రూ. 12 ధరను నిర్ణయించింది. మరో పక్షం రోజుల్లో మార్కెట్లోకి విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం నన్నారి, బిల్వ షర్బత్‌లను బాటిళ్లలో నింపే ప్రక్రియ చిత్తూరు, రాజమండ్రిల్లోని తమ సొంత యూనిట్లలో జీసీసీ చేపడుతోంది. సరికొత్త షర్బత్ టెట్రా ప్యాక్‌లను చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో తయారు చేయించనుంది. వీటిని విమాన, రైలు ప్రయాణికులకు, సరఫరా చేయడానికి వీలుగా ఎయిర్ ఇండియా, రైల్వే శాఖలతో ఒప్పందం చేసుకోవాలని జీసీసీ ప్రయత్నిస్తోంది. మార్కెట్లో నన్నారి, బిల్వ షర్బత్‌లకు డిమాండ్ ఉంది. గత సంవత్సరం మూడు లక్షల బాటిళ్ల నన్నారి, లక్ష బాటిళ్ల బిల్వ షర్బత్‌లను జీసీసీ విక్రయించింది.
కొత్తగా త్రిఫల షర్బత్
నన్నారి, బిల్వలతో పాటు కొత్తగా త్రిఫల షర్బత్‌ను కూడా రానున్న మూడునెలల్లో మార్కెట్లోకి తెచ్చే యోచనలో జీసీసీ ఉంది. ఇప్పటివరకు జీసీసీ త్రిఫల చూర్ణం, రసం తయారు చేస్తోంది. త్రిఫల షర్బత్‌లో పంచదారకు బదులు సేంద్రియ(ఆర్గానిక్) బెల్లాన్ని వాడనున్నారు. దీంతో ఇది ఆర్గానిక్ ఉత్పత్తిగా గుర్తింపు పొందనుంది.
మా షర్బత్‌లకు భారీ డిమాండ్
‘ఔషధ, మూలికా గుణాలున్న షర్బత్‌లను జీసీసీ మాత్రమే తయారు చేస్తోంది. వీటి రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మేం ఉత్పత్తి చేస్తున్న నన్నారి, బిల్వ షర్బత్‌లకు ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పటిదాకా జీసీసీ నుంచి రెడీ టూ ఈట్/డ్రింక్ ఉత్పత్తులు లేవు. తొలిసారిగా నన్నారి, బిల్వ షర్బత్‌లను టెట్రా ప్యాక్‌ల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. అలాగే త్వరలో త్రిఫల షర్బత్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం. – రవిప్రకాష్, జీసీసీ ఎండీ