‘సిక్కాలు’ కావాలి: టీసీఎస్ ఏజీఎంలో డిమాండ్
ముంబై: టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ నుంచి బోనస్ షేర్లను కోరుతూ ‘మాకు సిక్కాలు కావాలంటూ’ శుక్రవారంనాడిక్కడ జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో షేర్‌హోల్డర్లు డిమాండ్ చేశారు. సిక్కా అంటే నాణెం అని అర్థం. అలాగే టీసీఎస్ ప్రత్యర్థి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ పేరు కూడా విశాల్ సిక్కా. ఈ రెండూ కలిపి ధ్వనించేలా షేర్‌హోల్డర్ల నుంచి వచ్చిన డిమాండ్‌కు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ బదులిస్తూ బోర్డు ఈ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. కంపెనీ నగదు నిల్వలతో పోలిస్తే మూలధనం తక్కువగా వున్నందున పలువురు షేర్‌హోల్డర్లు బోనస్ షేర్లు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఐటీ పరిశ్రమలో యూనియన్ల ఏర్పాటును అనుమతించడం వల్ల తమ కంపెనీపై ప్రభావం ఏదీ పడదని మరో ప్రశ్నకు మిస్త్రీ బదులిచ్చారు.