
న్యూఢిల్లీ: మెరుగుపడిన అంతర్జాతీయ డిమాండ్.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. జీఎస్‌టీ రిఫండ్ ప్రక్రియ సరళీకరణ వెరసి నవంబర్‌లో భారత్ ఎగుమతుల్లో 30.55 శాతం భారీ వృద్ధి నమోదయ్యింది. విలువ రూపంలో ఎగుమతులు 26.19 బిలియన్ డాలర్లు. 2016 నవంబర్‌లో భారత్ ఎగుమతుల విలువ 20.06 బిలియన్ డాలర్లు.
నిరుత్సాహం నుంచి ఉత్సాహం...
2016 అక్టోబర్ నెలతో పోల్చితే, 2017 అక్టోబర్‌లో ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా 1.12 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. అంతక్రితం నెల సెప్టెంబర్‌లో ఆరు నెలల గరిష్టస్థాయిలో వృద్ధి నమోదయినా, వెంటనే (అక్టోబర్) క్షీణత నమోదుకావడం అందరినీ నిరాశపరిచింది. అయితే నవంబర్‌లో మంచి వృద్ధి తీరు పట్ల సంబంధిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
దిగుమతులదీ ఎగువబాటే...: కాగా భారత్ దిగుమతులు కూడా నవంబర్‌లో 19.61 శాతం పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెలువరించిన గణాంకాలు వెల్లడించాయి. విలువ రూపంలో 40 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే నెలలో ఈ విలువ 33.46 బిలియన్ డాలర్లు. దీనితో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 13.82 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
►రత్నాలు – ఆభరణాలు (33 శాతం) ఇంజనీరింగ్ గూడ్స్(44 శాతం), ఆర్గానిక్, ఆర్గానిక్‌యేతర రసాయనాలు (54 శాతం), ఫార్మా ప్రొడక్టులు (13 శాతం) ఎగుమతుల్లో చక్కటి వృద్ధి రేటు నమోదయ్యింది.
►బంగారం దిగుమతులు 26% తగ్గి 3.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
►చమురు దిగుమతులు 39.14 శాతం పెరిగాయి. విలువ రూపంలో 9.55 బిలియన్ డాలర్లు. చమురుయేతర దిగుమతులు 14.57 శాతం పెరిగి 30.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
► చైనా, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతులు పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే, ఎగుమతులు 12 శాతం పెరిగి 196.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 22 శాతం ఎగసి 296 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.