పసిడి పరుగుకు బ్రేక్‌! | Global gold prices fall on stronger dollar | Sakshi
Sakshi News home page

పసిడి పరుగుకు బ్రేక్‌!

Published Mon, Apr 3 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

పసిడి పరుగుకు బ్రేక్‌!

పసిడి పరుగుకు బ్రేక్‌!

అంతర్జాతీయంగా మార్చి 31 శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి పరుగుకు కొంత బ్రేక్‌ పడింది.

డాలర్‌ బలోపేతం, లాభాల స్వీకరణ...
న్యూయార్క్‌/ముంబై: అంతర్జాతీయంగా మార్చి 31 శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి పరుగుకు కొంత బ్రేక్‌ పడింది. డాలర్‌ ఇండెక్స్‌ వారంలో 99.59 స్థాయి నుంచి తిరిగి 100.42 స్థాయికి చేరడం, గడచిన నెల రోజుల్లో ఔన్స్‌ కు దాదాపు 50 డాలర్ల పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించటం దీనికి ప్రధాన కారణం. న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్చంజ్‌– నైమెక్స్‌లో పసిడి ధర ఔన్స్‌ (31.1గ్రా) వారం వారీగా కేవలం 3 డాలర్లు పెరిగి 1,247 డాలర్లకు చేరింది. మార్చి 15న అమెరికా ఫెడ్‌– ఫండ్‌ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్‌ బలహీనత– బంగారం బలోపేతం అయిన విషయం తెలిసిందే.

కేవలం మూడు వారాల్లో పసిడి 30 డాలర్లకుపైగా పెరిగింది.  డాలర్‌ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్‌ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశీయంగా డౌన్‌..
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం ధర 10 గ్రాములకు 31వ తేదీతో ముగిసిన వారంలో రూ.330 తగ్గి రూ.28,463కి చేరింది. అంతక్రితం రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.400 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.120 తగ్గి రూ.28,775కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,625కి దిగింది. అంతక్రితం రెండు వారాల్లో స్పాట్‌ మార్కెట్‌లో ధర దాదాపు రూ.500 పెరిగింది. ఇక వెండి పెరుగుదల కొనసాగుతోంది. వారంలో కేజీ ధర రూ. 705 పెరిగి రూ.42,365కు పెరిగింది. అంతక్రితం గడచిన రెండు వారాల్లో ధర రూ.550కి పైగా ఎగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement