కాకినాడలో జీఎంఆర్ పోర్టు!
రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్
2,094 ఎకరాలు కేటాయింపు
ఆరు నెలల్లో ప్రజాభిప్రాయ సేకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రైల్వే రంగాల్లో సేవలందిస్తున్న జీఎంఆర్ గ్రూపు తాజాగా ఓడ రేవుల వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందుకోసం జీఎంఆర్‌కు ఉన్న పోర్ట్ ఆధారిత సెజ్‌లో 2,094 ఎకరాలు కేటాయించారు. జీఎంఆర్ 10,500 ఎకరాల్లో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్(కెసెజ్) పేరుతో మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న కాకినాడ రేవుకు సుమారు 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రేవు రానుంది. తుని నియోజకవర్గం తొండంగి మండలం కోన ఏరియాలో ఈ రేవును ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి తెలిపారు.
అన్ని అధికారిక అనుమతులు వచ్చిన తర్వాత మూడేళ్లలోగా ఈ కొత్త పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అయితే, ఎన్ని బెర్తులతో పోర్టు నిర్మించాలన్నది దానిపై ఇంక ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ప్రాథమిక అధ్యయనం పూర్తయ్యిందన్నారు. మరో నెలరోజుల్లో ప్రాజెక్టు రూపు రేఖలపై ఒక స్పష్టత వస్తుందని జీఎంఆర్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు.
రాష్ట్ర విభజనతో కీలకంగా కాకినాడ
రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీఎంఆర్ పోర్టు నిర్మాణం దృష్టిసారిస్తోంది. గత బడ్జెట్‌లో అరుణ్‌జైట్లీ కాకినాడను హార్డ్‌వేర్ హబ్‌గా ప్రకటించడం, ఇప్పటికే కాకినాడ-విశాఖ పెట్రోకెమికల్ హబ్‌గా వేగంగా వృద్ధి చెందడానికి తోడు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) అభివృద్ధి చేస్తుండటంతో పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీనికితోడు కాకినాడ, నెల్లూరు మధ్యలో మరో పోర్టు కూడా లేకపోవడం కలిసొచ్చే అంశం.
విశాఖలోని రెండు పోర్టులు, కాకినాడ పోర్టు, నెల్లూరు కృష్ణపట్నం పోర్టులు పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో కాకినాడ ప్రాంతంలో మరో కొత్త పోర్టుకు డిమాండ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్క్ రానుండటంతో కార్గో హ్యాండ్లింగ్‌పైనే అధికంగా దృష్టిసారిస్తున్నామని జీఎంఆర్ అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా కంటైనర్ కార్గోతో పాటు వివిధ ఎగుమతులు దిగుమతులకు అనుకూలంగా ఈ పోర్టును అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.