Hardware Park
-
నాదర్గుల్లో ఉద్రిక్త పరిస్థితులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం నాదర్గుల్లో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం తలపెట్టిన హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటు కోసం భూములను స్వాధీనం చేసుకునేందుకు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టీఎస్ఐఐసీ) అధికారులు వచ్చారు. అయితే అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమను చంపిన తర్వాతే భూములు తీసుకోవాలంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు
బస్వగూడ తండాపై ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. మరోవైపు ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్కు వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు.. వీటికి అర కిలో మీటర్ దూరంలోనే ఉంది మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన బస్వగూడ తండా. ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం ఉన్న మహేశ్వరం మండలంలోని ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే బస్వగూడ తండా ఉన్నా ఈ గ్రామానికి కనీసం బస్సు, బడి, రహదారి, స్వచ్ఛమైన తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా తండాకు వచ్చారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. తమ్ముడూ.. చెల్లీ.. తాతా.. అవ్వా.. పెద్దమ్మా అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ తండా అంతా కలియతిరిగారు. సమస్యలను సావధానంగా విన్నారు. తండాను దత్తతను తీసుకుని గిరిజనులకు అండగా నిలుస్తానని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే హామీలు తుక్కుగూడ నుంచి బస్వగూడ తండా వరకు బీటీ రోడ్డు వేయిస్తా ఫలక్‌నుమా డిపో నుంచి రెండు ట్రిప్పులు బస్సు నడిపిస్తా తండాకు కృష్ణా నీరు అందిస్తా తండాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఔట్లెట్ ను ఏర్పాటు చేయిస్తా తండాలో ప్రాథమిక పాఠశాల తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ఎమ్మెల్యే:నీ పేరేంటమ్మా..ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? మహిళ: నా పేరు బుజ్జి. మా తండాకు బస్సు రాదు. రోడ్డు సరిగ్గా లేదు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే: ఇక్కడ రేషన్‌షాపు లేదా? బుజ్జి: లేదు. మంఖాల్‌కు పోయి తెచ్చుకోవాలే ఎమ్మెల్యే: నీ పేరు ఏంటమ్మా.. నీ సమస్య ఏమిటి? వృద్ధురాలు: నా పేరు లక్ష్మమ్మ. రెండు నెలల నుంచి పింఛన్ వస్తలేదు ఎమ్మెల్యే: ఇక్కడ ఎంత మందికి పింఛన్లు రావడంలేదు? మహిళలు: చాలా మందికి రావడంలేదు సార్ ఎమ్మెల్యే: వచ్చే నెల నుంచి అందరికీ రూ.వెయ్యి వస్తాయి ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏం పని చేస్తున్నావ్.. నీ సమస్య? బూరీ: రోజూ కూలికి పోతా సారు... ఎమ్మెల్యే: ఎంత ఇస్తున్నారు, ఉపాధి పనులు నడవడం లేదా? బూరీ : రోజుకి రూ.150 వస్తుంది,ఉపాధి పనులు చేయిస్తలేరు. ఎమ్మెల్యే: ఇంకా తండాలో ఏమేం సమస్యలు ఉన్నాయమ్మా? మయూరి: చిన్న పిల్లలు రోజూ కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రైవేట్ స్కూల్‌కి పోతున్నారు. తాగుడుకు బానిసై చిన్న వయస్సులోనే చాలామంది చచ్చిపోయారు. బస్సులు లేక పెద్దలు, పిల్లలు ఇబ్బందిపడుతున్నారు. ఎమ్మెల్యే: ప్రభుత్వ పాఠశాల లేదా? మయూరి: లేదు సారు. అంగన్వాడీ ఉంది. బోరు ఉన్నా ట్యాంక్ లేదు. కరెంట్ ఉన్నప్పుడే అరగంట నీళ్లు వస్తాయి. ఎమ్మెల్యే: ఏం పని చేస్తావమ్మా.. పిల్లలు ఏం చేస్తారు? చాందీ: కూలీ దొరికితే చేస్తా.. లేకపోతే ఇంటి దగ్గరే ఉంటా. ఇద్దరు పిల్లలు చదువుకున్నా డ్యూటీ రాలే. ఇంటి జాగ లేదు. ఎమ్మెల్యే:ఏం బాబు నేనెవరో తెలుసా.. నన్ను గుర్తుపట్టారా .. ఏం చదువుతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు? కల్యాణ్: తెలుసు సార్. తుక్కుగూడలో చదువుతున్నా. పోలీస్ కావాలనుకుంటున్నా. ఎమ్మెల్యే: మీ తండాకు మెరుగైన సేవలకు ఏం చేయాలి? భాస్కర్: నేను డీఎడ్ చదివాను. పాఠశాల లేక చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇక్కడే స్కూల్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే: నీకు వికలాంగ పింఛన్ వస్తోందా, ఎంత వస్తోంది? శంకర్: ఇప్పటి వరకు రూ.500 వచ్చింది. ఎమ్మెల్యే: ఏం పంటలు వేసావు. కరెంట్ సక్రమంగా వస్తుందా? రైతు కోఠియా: వరి వేశాను. ఇప్పుడు కూరగాయలు వేద్దామనుకుంటున్నా. కరెంట్ సక్కగా రావడంలేదు. ఇచ్చే ఆరుగంటలు ఒకేసారి ఇవ్వాలి. ఎమ్మెల్యే: ఎయిర్‌పోర్టు దగ్గరే ఉన్నా మీ తండా అభివృద్ధి కాలేదు. ఏం చేస్తే బాగుపడుతుంది? శ్రీనివాస్‌నాయక్: తండాలో ఎక్సైజ్ కేసులు తొలగించి, విద్యా సౌకర్యంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి. ఎమ్మెల్యే: ఏం చదువుతున్నావు బాబు. నీ సమస్య ఏమిటి? విద్యార్థి: నా పేరు చలపతి. తుక్కుగూడలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. వర్షం పడితే రోడ్డు బురదగా మారి స్కూల్‌కు పోలేకపోతున్నాం. రోడ్డు, బస్సు సమస్య తీర్చాలి. ఎమ్మెల్యే: ఏమమ్మా .. డ్వాక్రా రుణాలు వస్తున్నాయా? సాలీ: ఇస్తలేరు సార్. ఇళ్లు, భూమి ఉన్నోళ్లకు రేషన్ బియ్యం కూడా కట్ చేస్తమంటుండ్రు సార్ .. ఎట్లా బతకాలి. ఎమ్మెల్యే: తప్పుడు ప్రచారం నమ్మొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం ఇప్పించే బాధ్యత నాది. హస్లీ: మా తండాకు బస్సు లేదు సార్. రోజూ పిల్లలు సదువుకోవడానికి రానుపోను 7 కిలోమీటర్లు నడుస్తుండ్రు. ఎమ్మెల్యే: రెండు నెలల్లో ఆర్టీసీ బస్సును వేయిస్తా. విజయ: సార్ నాకు వితంతువు పింఛన్, రేషన్ బియ్యం వస్తలేవు? ఎమ్మెల్యే: వచ్చేనెల నుంచి రూ.1500 పింఛన్ వస్తుంది. బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోలకు పెంచాం. లలిత: సార్ నాభర్త ఇటీవల చనిపోయిండు. పిల్లలను చదివించలేకపోతున్నా. ఎలాంటి ఆధారం లేదు. ఎమ్మెల్యే: మీ పిల్లలను ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో వేసి చదివిస్తా. అవసరమనుకుంటే ఒకరిని దత్తత తీసుకొని చదవిస్తా. వచ్చే నెల నుంచి రూ.1000 పింఛన్ వచ్చేలా అధికారులతో మాట్లాడతా. ఎమ్మెల్యే: ఎం పెద్దాయనా పింఛన్ వస్తోందా? బాషా: రెండు నెలల నుంచి వస్తలేదు. ఎమ్మెల్యే: పాపా నీ పేరేంటి.. అంగన్వాడీ కేంద్రంలో రోజూ భోజనంతోపాటు గుడ్డు, పాలు ఇస్తున్నారా? జ్యోత్స్నప్రియ: ఇస్తున్నారు సార్. అంగన్వాడీ కార్యకర్త: సార్ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. కానీ మాకు కనీస వేతనాలు లేవు. ఎమ్మెల్యే: ప్రభుత్వం కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తుంది. అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారు? గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారా? అంగన్వాడీ సూపర్వైజర్ సరోజ: మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారు. రోజు 15 మంది వస్తారు. గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నాం సార్. ఎమ్మెల్యే: ఏఎన్ఎం గారూ.. తండాలో సూదులు, మందులు ఇస్తున్నారా? ఏఎన్ఎం: ప్రతి శనివారం వచ్చి వ్యాక్సిన్లు, మం దులు ఇస్తున్నాం సార్. ఎమ్మెల్యే: ఏం ఎస్ఐ గారూ.. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎస్ఐ నర్సింగ్ రాథోడ్: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. తండాలో గుడుంబా కేసులు ఎక్కువగా వస్తాయి. ఇటీవల అందరూ సారా తయారీని నిషేధించారు. మదన్మోహన్ (ఎంపీటీసీ): తండావాసులు సారా తయారీని నిషేధించారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. తండాలో డ్రైనేజీ ఔట్లెట్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే: సారా తయారీ నిషేధించడం అభినందనీయం. డ్రైనేజీ ఔట్ లెట్ ఏర్పాటు చేస్తా. రవి నాయక్: తండావాసులకు ఇళ్ల స్థలాలివ్వాలి. స్మశానవాటికకు ప్రభుత్వం నుంచి స్థలం ఇవ్వాలి. ఎమ్మెల్యే: తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుంది. ప్రభుత్వ స్థలం ఉంటే స్మశానవాటికకు కేటాయించేందుకు కృషి చేస్తా. సామెల్ రాజ్ (వార్డు సభ్యుడు): తండా అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలి. ఎమ్మెల్యే: తప్పకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. తుక్కుగూడ నుంచి బస్వగూడ వరకు బీటీ నిర్మాణానికి రూ. 26 లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు పిలిపించి పనులు ప్రారంభిస్తాం. రోడ్డు పూర్తి కాగానే ఆర్టీసీ బస్సు నడిపిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. -
భోగాపురంపై వాలుతున్న గద్దలు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇప్పుడందరి దృష్టి భోగాపురంపైనే పడింది. విమానాశ్రయం, పోర్ట్, ఫుడ్‌ఫార్క్, హార్డ్‌వేర్ పార్క్ తదితర ప్రభుత్వ ప్రకటనలతో అక్కడ భూమ్ ఏర్పడింది. దీంతో పెద్దలు ఆక్రమణలకు తెరతీశారు. భూమిని చేతిలోకి తెచ్చుకుంటే భవిష్యత్‌లో కోట్లకు పడగెత్తొచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ మండలం నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణల ఫిర్యాదులొస్తున్నాయి. ఒక దానిపై దృష్టిపెట్టేలోపు మరోచోట ఆక్రమణలు వెలుగు చూస్తున్నాయి. దీంతో చర్యలు తీసుకోవడానికి అధికారులకు ఊపిరి సలపడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తే అక్కడి భూములకు ఎంత గిరాకీ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు బలం, అధికారం అండ ఉన్న పలువురు ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూముల పై కన్నేసి పాగా వేస్తున్నారు. చెరువులు, వాగులు, గెడ్డలు, శ్మశానభూములు ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోతున్నాయి. పస్తుతం గూడెపువలస, ఎ.రావివలస, ముంజేరు, దల్లిపేట, రావాడ, సవరవిల్లి, బెరైడ్డిపాలెం, దిబ్బలపాలెం, తూడెం తదితర గ్రామాలలో భూములు ఆక్రమణకు గురవుతున్నట్టు ఆయా గ్రామస్తుల నుంచి ఫిర్యాదు ఎక్కువగా వస్తున్నాయి. ఒకరి భూములను మరొకరు విక్రయించేస్తుండడంతో న్యాయపరమైన వివాదాలు ఎక్కువయ్యాయి. ఏ మండలంలోని లేని విధంగా ఇక్కడి భూములపై న్యాయస్థానాల్లో అధికరంగా కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సెటిల్మెంట్ గ్యాంగులు రంగ ప్రవేశం చేశాయి. ఆక్రమిత భూముల వివాదాలు పరిష్కరిం చడానికి పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి. వారి మాట వినకపోతే ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఆ గ్యాంగ్‌లు వెనుకాడడం లేదని తెలుస్తోంది. రియల్టర్లు చెక్కర్లు కొడుతూ భోగాపురం మండలంలో ఎక్కడెక్కడ ఖాళీ, వ్యవసాయ భూములున్నాయో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం చాలా ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఇప్పుడు రియల్టర్ల కార్లు పరుగులు తీస్తున్నాయి. స్థానిక నాయకులు, మధ్యవర్తుల సాయంతో బేరసారాలు సాగిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఎకరా రూ.35లక్షల నుంచి రూ.కోటి పలకడంతో రైతులు కూడా తమ భూములను విక్రయించేందుకే ఆసక్తి చూపుతున్నారు. సాగు చేసినా గిట్టుబాటు లేదని, విక్రయిస్తే ఆ వచ్చే సొమ్ము వడ్డీతోనైనా బతకొచ్చనే అభిప్రాయంతో స్థానికుల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాలా వరకూ భూములు రియల్టర్ల పరమయ్యాయి. మరికొన్ని బేరసారాల్లో ఉన్నాయి. మున్ముందు వ్యవసాయ భూమి కన్పించడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎ.రావివలస,పోలిపల్లి, సవరవిల్లి, రాజాపులోవ, గుడివాడ, భోగాపురం, రావాడ, రెడ్డికంచేరు, చేపలకంచేరు, బెరైడ్డిపాలెం, దల్లిపేట, గూడెపువలస తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం రియల్‌భూమ్ ఎక్కువగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, అటు ప్రభుత్వ భూములు, ఇటు వ్యవసాయ భూములు కరిగిపోతుండడంతో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తారకరామ ప్రాజెక్టు ఆయకట్టు తగ్గిపోయే అవకాశం ఉంది. వ్యవసాయేతర భూములగా మారిపోవడం వల్ల ఇక్కడికి తారకరామ ద్వారా సాగునీరు వచ్చినా భవిష్యత్‌లో సద్వినియోగమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. చెప్పాలంటే ప్రమాదకర పరిస్థితి ఎదురు కానుంది. -
కేసీఆర్ పాలనపై వ్యతిరేకత..
మహేశ్వరం: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యాబ్సీటి, హార్డ్‌వేర్ పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు, పలు కంపెనీలను తీసుకొచ్చింది టీడీపీనే అని పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇమాంగూడ శ్రీశైలం రహదారిపైన సామ సంజీవరెడ్డి గార్డెన్లో టీడీపీ నియోజకవర్గ విసృ్తత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రథమంగా లేఖ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని అభివర్ణించారు. సమగ్ర సర్వే పేరుతో స్థానికేతరులను భయపేట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు జీ 4 పరిపాలన ఇస్తానని హామీ ఇచ్చి గెలుపొందాక కే 4 (కేసీఆర్ కుటుంబం... కేసీఆర్, కేటీఆర్, కవిత, హరిష్‌రావు) పాలన అందిస్తున్నాడని ఆరోపించారు. మూడు నెలల పాలనలో పలువురు రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నాక కూడా సీఎం కేసీఆర్ స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా టీ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ త్వరలో జరిగే జీఎచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో కేసీఆర్ ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ..కేసీఆర్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఆకర్ష్‌లకు ఎవరు లొంగరన్నారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి తప్పారని అన్నారు. 2019లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వ రం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బతికున్నంత కాలం టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు కన్నతల్లిలాంటి టీడీపీని వీడొద్దని సూచించారు. అంతకుముందు ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీలు, నగర పంచాయతీ వార్డు సభ్యు లు, సర్పంచ్‌లకు ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు లేక వెలవెల ఇమాంగూడలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తలు లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. మహేశ్వరం , కందుకూరు నుండి నాయకులు, కార్యకర్తలు అశించినంతగా హజరుకాలేదు. సరూర్‌నగర్ డివి జన్, ఆర్కేపురం నుండి జనాలను తీసుకొచ్చారు. టీఆర్ఎస్లో చేరే టీడీపీ నాయకులు, కార్యర్తలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ముఖ్యనేతలు ప్రసంగిస్తున్నప్పుడు కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. దీంతో నేతలు ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో మాల్కజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, సరూర్‌నగర్ జెడ్పీటీసీ జె. నరేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధానకార్యదర్శి ఎడ్మ మోహన్‌రెడ్డి, సర్పంచ్ లు జె.లక్ష్మయ్య, డి. సుధాకర్, ఆనందం, మంద కవిత, ముత్యం, పోచయ్య, సాలీ, యాదమ్మ , పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, కృష్ణ, యాదగిరి, కందుకూరు, సరూర్‌నగర్ మండలాల అధ్యక్షులు పి. ఆనంద్, తీగల అమర్నాథ్రెడ్డి, నాయకులు జయేందర్, లక్ష్మినర్సింహ్మరెడ్డి, సత్యనారాయణ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడలో జీఎంఆర్ పోర్టు!
రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ 2,094 ఎకరాలు కేటాయింపు ఆరు నెలల్లో ప్రజాభిప్రాయ సేకరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రైల్వే రంగాల్లో సేవలందిస్తున్న జీఎంఆర్ గ్రూపు తాజాగా ఓడ రేవుల వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందుకోసం జీఎంఆర్‌కు ఉన్న పోర్ట్ ఆధారిత సెజ్‌లో 2,094 ఎకరాలు కేటాయించారు. జీఎంఆర్ 10,500 ఎకరాల్లో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్(కెసెజ్) పేరుతో మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కాకినాడ రేవుకు సుమారు 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రేవు రానుంది. తుని నియోజకవర్గం తొండంగి మండలం కోన ఏరియాలో ఈ రేవును ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి తెలిపారు. అన్ని అధికారిక అనుమతులు వచ్చిన తర్వాత మూడేళ్లలోగా ఈ కొత్త పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అయితే, ఎన్ని బెర్తులతో పోర్టు నిర్మించాలన్నది దానిపై ఇంక ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ప్రాథమిక అధ్యయనం పూర్తయ్యిందన్నారు. మరో నెలరోజుల్లో ప్రాజెక్టు రూపు రేఖలపై ఒక స్పష్టత వస్తుందని జీఎంఆర్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు. రాష్ట్ర విభజనతో కీలకంగా కాకినాడ రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీఎంఆర్ పోర్టు నిర్మాణం దృష్టిసారిస్తోంది. గత బడ్జెట్లో అరుణ్‌జైట్లీ కాకినాడను హార్డ్‌వేర్ హబ్‌గా ప్రకటించడం, ఇప్పటికే కాకినాడ-విశాఖ పెట్రోకెమికల్ హబ్‌గా వేగంగా వృద్ధి చెందడానికి తోడు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అభివృద్ధి చేస్తుండటంతో పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీనికితోడు కాకినాడ, నెల్లూరు మధ్యలో మరో పోర్టు కూడా లేకపోవడం కలిసొచ్చే అంశం. విశాఖలోని రెండు పోర్టులు, కాకినాడ పోర్టు, నెల్లూరు కృష్ణపట్నం పోర్టులు పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో కాకినాడ ప్రాంతంలో మరో కొత్త పోర్టుకు డిమాండ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్క్ రానుండటంతో కార్గో హ్యాండ్లింగ్పైనే అధికంగా దృష్టిసారిస్తున్నామని జీఎంఆర్ అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా కంటైనర్ కార్గోతో పాటు వివిధ ఎగుమతులు దిగుమతులకు అనుకూలంగా ఈ పోర్టును అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. -
ఇన్నేళ్లకు స‘పోర్టు’
- కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టులకు కేంద్ర బడ్జెట్లో చోటు - హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ - కార్మికులకు ఉపాధితో పాటు ఎగుమతులు పెరుగుతాయని పోర్టు వర్గాల హర్షం కాకినాడ క్రైం : ఇన్నేళ్లకు కాకినాడ పోర్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర సాధారణ బడ్జెట్లో కాకినాడ పోర్టు అభివృద్ధికి స్థానం కల్పించింది. పోర్టులో హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో డీప్‌వాటర్, యాంకరేజ్ పోర్టులు న్నాయి. వందేళ్లపైగా చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం, మొక్కజొన్న వంటి వి, అత్యాధునిక వసతులతో ఏర్పాటైన డీప్ వా టర్ పోర్టు నుంచి క్రూడాయిల్, వంట నూనె, బొగ్గు, ఎరువులు, గ్రానైట్ రాళ్లు ఎగుమతవుతున్నాయి. యాంకరేజ్ పోర్టులో నెలకు సుమారు 10 ఓడల్లో, డీప్‌వాటర్ పోర్టులో రమారమి రో జుకు పది ఓడల్లో ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుండడంతో భారీ స్థాయి లో విదేశీ మారకద్రవ్యం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో యాంకరేజ్ పో ర్టు దాదాపు నిర్వీర్యమైపోయింది. కనీసం జట్టీలు కూడా లేక, రోడ్లు సక్రమంగా లేక ఎగుమతి దిగుమతులకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. వందేళ్ల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బీడు పాళీలు, పొగాకు కూడా ఎగుమతయ్యేవి. సౌకర్యాలు లేకపోవడంతో చాలా సరుకులు ముంబై, విశాఖపట్నం ఓడ రేవులకు తరలిపోవడంతో పోర్టుపై ఆధారపడిన వేల మంది కూలీల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రస్తుత కేంద్రం కాకినాడ పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించడంతో వేల మందికి ఉపాధితో పాటు భారీస్థాయిలో వ్యాపారం జరిగే అ వకాశం ఉందని పోర్టు వర్గాలు పేర్కొంటున్నా యి. కాకినాడ పోర్టులో హార్డ్‌వేర్ పార్కు అభివృ ద్ధి చేయడమే కాక త్వరలోనే కస్టమ్స్ కమిషరేట్ కూడా ఇక్కడికి మారనుంది. కాకినాడ పోర్టును అనుసంధానం చేస్తూ విశాఖ- చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొం దించడంతో కాకినాడ పోర్టుకు మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కేంద్రం సుముఖంగా ఉండడంతో పోర్టు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వ్యాపారులంటున్నారు.