ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు | Teegala Krishna Reddy given hpmies to peoples | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు

Published Sun, Dec 7 2014 11:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు - Sakshi

ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు

బస్వగూడ తండాపై ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు

ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. మరోవైపు ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్కు వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు.. వీటికి అర కిలో మీటర్ దూరంలోనే ఉంది మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన బస్వగూడ తండా. ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం ఉన్న మహేశ్వరం మండలంలోని ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే బస్వగూడ తండా ఉన్నా ఈ గ్రామానికి కనీసం బస్సు, బడి, రహదారి, స్వచ్ఛమైన తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి.

ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా తండాకు వచ్చారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. తమ్ముడూ.. చెల్లీ.. తాతా.. అవ్వా.. పెద్దమ్మా అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ తండా అంతా కలియతిరిగారు.  సమస్యలను సావధానంగా విన్నారు. తండాను దత్తతను తీసుకుని గిరిజనులకు అండగా నిలుస్తానని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
 
ఎమ్మెల్యే హామీలు
తుక్కుగూడ నుంచి బస్వగూడ తండా వరకు బీటీ రోడ్డు వేయిస్తా
ఫలక్‌నుమా డిపో నుంచి రెండు ట్రిప్పులు బస్సు నడిపిస్తా
తండాకు కృష్ణా నీరు అందిస్తా
తండాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తా. అండర్ గ్రౌండ్  డ్రైనేజీ ఔట్‌లెట్ ను ఏర్పాటు చేయిస్తా
తండాలో ప్రాథమిక పాఠశాల తీసుకొచ్చేందుకు కృషి చేస్తా.
ఎమ్మెల్యే:నీ పేరేంటమ్మా..ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి?
మహిళ: నా పేరు బుజ్జి. మా తండాకు బస్సు రాదు. రోడ్డు సరిగ్గా లేదు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది
ఎమ్మెల్యే: ఇక్కడ రేషన్‌షాపు లేదా?
బుజ్జి: లేదు. మంఖాల్‌కు పోయి తెచ్చుకోవాలే
ఎమ్మెల్యే: నీ పేరు ఏంటమ్మా.. నీ సమస్య ఏమిటి?
వృద్ధురాలు: నా పేరు లక్ష్మమ్మ. రెండు నెలల నుంచి పింఛన్ వస్తలేదు
ఎమ్మెల్యే: ఇక్కడ ఎంత మందికి పింఛన్లు రావడంలేదు?
మహిళలు: చాలా మందికి రావడంలేదు సార్
ఎమ్మెల్యే: వచ్చే నెల నుంచి అందరికీ రూ.వెయ్యి వస్తాయి
ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏం పని చేస్తున్నావ్.. నీ సమస్య?
బూరీ: రోజూ కూలికి పోతా సారు...
ఎమ్మెల్యే: ఎంత ఇస్తున్నారు, ఉపాధి పనులు నడవడం లేదా?
బూరీ : రోజుకి రూ.150 వస్తుంది,ఉపాధి పనులు చేయిస్తలేరు.
ఎమ్మెల్యే: ఇంకా తండాలో ఏమేం సమస్యలు ఉన్నాయమ్మా?
మయూరి: చిన్న పిల్లలు రోజూ కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రైవేట్ స్కూల్‌కి పోతున్నారు. తాగుడుకు బానిసై చిన్న వయస్సులోనే చాలామంది చచ్చిపోయారు. బస్సులు లేక పెద్దలు, పిల్లలు ఇబ్బందిపడుతున్నారు.
ఎమ్మెల్యే:  ప్రభుత్వ పాఠశాల లేదా?
మయూరి: లేదు సారు. అంగన్‌వాడీ ఉంది. బోరు ఉన్నా ట్యాంక్ లేదు. కరెంట్ ఉన్నప్పుడే అరగంట నీళ్లు వస్తాయి.  
ఎమ్మెల్యే: ఏం పని చేస్తావమ్మా.. పిల్లలు ఏం చేస్తారు?
చాందీ: కూలీ దొరికితే చేస్తా.. లేకపోతే ఇంటి దగ్గరే ఉంటా. ఇద్దరు పిల్లలు చదువుకున్నా డ్యూటీ రాలే. ఇంటి జాగ లేదు.
ఎమ్మెల్యే:ఏం బాబు నేనెవరో తెలుసా.. నన్ను గుర్తుపట్టారా .. ఏం చదువుతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు?
కల్యాణ్: తెలుసు సార్. తుక్కుగూడలో చదువుతున్నా. పోలీస్ కావాలనుకుంటున్నా.
ఎమ్మెల్యే: మీ తండాకు మెరుగైన సేవలకు ఏం చేయాలి?
భాస్కర్: నేను డీఎడ్ చదివాను. పాఠశాల లేక చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇక్కడే స్కూల్ ఏర్పాటు చేయాలి.
ఎమ్మెల్యే: నీకు వికలాంగ పింఛన్ వస్తోందా, ఎంత వస్తోంది?
శంకర్: ఇప్పటి వరకు రూ.500 వచ్చింది.
ఎమ్మెల్యే: ఏం పంటలు వేసావు. కరెంట్ సక్రమంగా వస్తుందా?
రైతు కోఠియా: వరి వేశాను. ఇప్పుడు కూరగాయలు వేద్దామనుకుంటున్నా. కరెంట్ సక్కగా రావడంలేదు. ఇచ్చే ఆరుగంటలు ఒకేసారి ఇవ్వాలి.
ఎమ్మెల్యే: ఎయిర్‌పోర్టు దగ్గరే ఉన్నా మీ తండా అభివృద్ధి కాలేదు. ఏం చేస్తే బాగుపడుతుంది?
శ్రీనివాస్‌నాయక్: తండాలో ఎక్సైజ్ కేసులు తొలగించి, విద్యా సౌకర్యంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి.
ఎమ్మెల్యే: ఏం చదువుతున్నావు బాబు. నీ సమస్య ఏమిటి?
విద్యార్థి: నా పేరు చలపతి. తుక్కుగూడలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. వర్షం పడితే రోడ్డు బురదగా మారి స్కూల్‌కు పోలేకపోతున్నాం. రోడ్డు, బస్సు సమస్య తీర్చాలి.
ఎమ్మెల్యే: ఏమమ్మా .. డ్వాక్రా రుణాలు వస్తున్నాయా?
సాలీ: ఇస్తలేరు సార్. ఇళ్లు, భూమి ఉన్నోళ్లకు రేషన్ బియ్యం కూడా కట్ చేస్తమంటుండ్రు సార్ .. ఎట్లా బతకాలి.
ఎమ్మెల్యే: తప్పుడు ప్రచారం నమ్మొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం ఇప్పించే బాధ్యత నాది.
హస్లీ:  మా తండాకు బస్సు లేదు సార్. రోజూ పిల్లలు సదువుకోవడానికి రానుపోను 7 కిలోమీటర్లు నడుస్తుండ్రు.  
ఎమ్మెల్యే: రెండు నెలల్లో ఆర్టీసీ బస్సును వేయిస్తా.  
విజయ: సార్ నాకు వితంతువు పింఛన్, రేషన్ బియ్యం వస్తలేవు?
ఎమ్మెల్యే: వచ్చేనెల నుంచి రూ.1500 పింఛన్ వస్తుంది. బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోలకు పెంచాం.
లలిత: సార్ నాభర్త ఇటీవల చనిపోయిండు. పిల్లలను చదివించలేకపోతున్నా. ఎలాంటి ఆధారం లేదు.
ఎమ్మెల్యే:  మీ పిల్లలను ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో వేసి చదివిస్తా. అవసరమనుకుంటే ఒకరిని దత్తత తీసుకొని చదవిస్తా. వచ్చే నెల నుంచి రూ.1000 పింఛన్ వచ్చేలా అధికారులతో మాట్లాడతా.
ఎమ్మెల్యే: ఎం పెద్దాయనా పింఛన్ వస్తోందా?
బాషా: రెండు నెలల నుంచి వస్తలేదు.
ఎమ్మెల్యే: పాపా నీ పేరేంటి.. అంగన్‌వాడీ కేంద్రంలో రోజూ భోజనంతోపాటు గుడ్డు, పాలు ఇస్తున్నారా?
జ్యోత్స్నప్రియ: ఇస్తున్నారు సార్.
అంగన్‌వాడీ కార్యకర్త: సార్ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. కానీ మాకు కనీస వేతనాలు లేవు.  
ఎమ్మెల్యే: ప్రభుత్వం కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తుంది. అంగన్‌వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారు? గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారా?
అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సరోజ: మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారు. రోజు 15 మంది వస్తారు. గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నాం సార్.
ఎమ్మెల్యే: ఏఎన్‌ఎం గారూ.. తండాలో సూదులు, మందులు ఇస్తున్నారా?
ఏఎన్‌ఎం: ప్రతి శనివారం వచ్చి వ్యాక్సిన్లు, మం దులు ఇస్తున్నాం సార్.
ఎమ్మెల్యే: ఏం ఎస్‌ఐ గారూ.. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది?
ఎస్‌ఐ నర్సింగ్ రాథోడ్: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. తండాలో గుడుంబా కేసులు ఎక్కువగా వస్తాయి. ఇటీవల అందరూ సారా తయారీని నిషేధించారు.
మదన్‌మోహన్ (ఎంపీటీసీ): తండావాసులు సారా తయారీని నిషేధించారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. తండాలో డ్రైనేజీ ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలి.
ఎమ్మెల్యే: సారా తయారీ నిషేధించడం అభినందనీయం. డ్రైనేజీ ఔట్ లెట్ ఏర్పాటు చేస్తా.  
రవి నాయక్: తండావాసులకు ఇళ్ల స్థలాలివ్వాలి. స్మశానవాటికకు ప్రభుత్వం నుంచి స్థలం ఇవ్వాలి.
ఎమ్మెల్యే: తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ కట్టిస్తుంది. ప్రభుత్వ స్థలం ఉంటే స్మశానవాటికకు కేటాయించేందుకు కృషి చేస్తా.  
సామెల్ రాజ్ (వార్డు సభ్యుడు): తండా అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలి.  
ఎమ్మెల్యే: తప్పకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. తుక్కుగూడ నుంచి బస్వగూడ వరకు బీటీ నిర్మాణానికి రూ. 26 లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు పిలిపించి పనులు ప్రారంభిస్తాం. రోడ్డు పూర్తి కాగానే ఆర్టీసీ బస్సు నడిపిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement