సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. పోటాపోటీగా విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి దిగుతున్నాయి. మరోవైపు పలు పార్టీల్లోని అసంతృప్తి వాదులు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కదని భావిస్తున్న నేతలు ఇప్పటి నుంచే పార్టీలు జంప్ అవుతున్నారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో రగులుతున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నారు. ఆయన కోడలు, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలతో తీగల కృష్ణారెడ్డి, అనితా రెడ్డిలు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు మంగళవారం వార్తలు వెలువడ్డాయి.
చదవండి: మా నాన్న మంచోడు కాదు.. ముత్తిరెడ్డికి కూతురు షాక్
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి
టీడీపీ నుంచి ప్రస్థానం
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో (ఇప్పటి బీఆర్‌ఎస్) చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు.
అయితే సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా తీగల కృష్ణారెడ్డి అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే కారు దిగడం ఖాయమని ఎప్పుడో హెచ్చరించినా బీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడం, సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తూ వస్తున్నారు.
దీంతో అప్పట్లోనే ఆయన పార్టీ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ గూటికి చేరిపోవడంతో.. అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment