భోగాపురంపై వాలుతున్న గద్దలు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇప్పుడందరి దృష్టి భోగాపురంపైనే పడింది. విమానాశ్రయం, పోర్ట్, ఫుడ్‌ఫార్క్, హార్డ్‌వేర్ పార్క్ తదితర ప్రభుత్వ ప్రకటనలతో అక్కడ భూమ్ ఏర్పడింది. దీంతో పెద్దలు ఆక్రమణలకు తెరతీశారు. భూమిని చేతిలోకి తెచ్చుకుంటే భవిష్యత్‌లో కోట్లకు పడగెత్తొచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ మండలం నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణల ఫిర్యాదులొస్తున్నాయి. ఒక దానిపై దృష్టిపెట్టేలోపు మరోచోట ఆక్రమణలు వెలుగు చూస్తున్నాయి. దీంతో చర్యలు తీసుకోవడానికి అధికారులకు ఊపిరి సలపడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తే అక్కడి భూములకు ఎంత గిరాకీ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు బలం, అధికారం అండ ఉన్న పలువురు ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూముల పై కన్నేసి పాగా వేస్తున్నారు. చెరువులు, వాగులు, గెడ్డలు, శ్మశానభూములు ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోతున్నాయి.
పస్తుతం గూడెపువలస, ఎ.రావివలస, ముంజేరు, దల్లిపేట, రావాడ, సవరవిల్లి, బెరైడ్డిపాలెం, దిబ్బలపాలెం, తూడెం తదితర గ్రామాలలో భూములు ఆక్రమణకు గురవుతున్నట్టు ఆయా గ్రామస్తుల నుంచి ఫిర్యాదు ఎక్కువగా వస్తున్నాయి. ఒకరి భూములను మరొకరు విక్రయించేస్తుండడంతో న్యాయపరమైన వివాదాలు ఎక్కువయ్యాయి. ఏ మండలంలోని లేని విధంగా ఇక్కడి భూములపై న్యాయస్థానాల్లో అధికరంగా కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సెటిల్‌మెంట్ గ్యాంగులు రంగ ప్రవేశం చేశాయి. ఆక్రమిత భూముల వివాదాలు పరిష్కరిం చడానికి పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి. వారి మాట వినకపోతే ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఆ గ్యాంగ్‌లు వెనుకాడడం లేదని తెలుస్తోంది.
రియల్టర్లు చెక్కర్లు కొడుతూ భోగాపురం మండలంలో ఎక్కడెక్కడ ఖాళీ, వ్యవసాయ భూములున్నాయో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం చాలా ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఇప్పుడు రియల్టర్ల కార్లు పరుగులు తీస్తున్నాయి. స్థానిక నాయకులు, మధ్యవర్తుల సాయంతో బేరసారాలు సాగిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఎకరా రూ.35లక్షల నుంచి రూ.కోటి పలకడంతో రైతులు కూడా తమ భూములను విక్రయించేందుకే ఆసక్తి చూపుతున్నారు. సాగు చేసినా గిట్టుబాటు లేదని, విక్రయిస్తే ఆ వచ్చే సొమ్ము వడ్డీతోనైనా బతకొచ్చనే అభిప్రాయంతో స్థానికుల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాలా వరకూ భూములు రియల్టర్ల పరమయ్యాయి. మరికొన్ని బేరసారాల్లో ఉన్నాయి.
మున్ముందు వ్యవసాయ భూమి కన్పించడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎ.రావివలస,పోలిపల్లి, సవరవిల్లి, రాజాపులోవ, గుడివాడ, భోగాపురం, రావాడ, రెడ్డికంచేరు, చేపలకంచేరు, బెరైడ్డిపాలెం, దల్లిపేట, గూడెపువలస తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం రియల్‌భూమ్ ఎక్కువగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, అటు ప్రభుత్వ భూములు, ఇటు వ్యవసాయ భూములు కరిగిపోతుండడంతో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తారకరామ ప్రాజెక్టు ఆయకట్టు తగ్గిపోయే అవకాశం ఉంది. వ్యవసాయేతర భూములగా మారిపోవడం వల్ల ఇక్కడికి తారకరామ ద్వారా సాగునీరు వచ్చినా భవిష్యత్‌లో సద్వినియోగమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. చెప్పాలంటే ప్రమాదకర పరిస్థితి ఎదురు కానుంది.