సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేయతలపెట్టిన ట్రిపుల్ ఐటీకి ప్రైవేటు భాగస్వామిగా జీఎంఆర్ కన్సార్టియంను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపిక కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో దేశవ్యాప్తంగా 20 కేంద్ర ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించగా.. అందులో ఒకటి కాకినాడలో ఏర్పాటు కానుంది.
ఇందుకు కేంద్రం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం నిధులు సమకూర్చుతాయి. ప్రైవేటు భాగస్వామి 15 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. జీఎంఆర్(కాకినాడ)సెజ్, గోదావరి ఇన్‌స్టిట్యూట్, అశోకా బిల్డ్‌కాన్.. ఈ మూడు సంస్థలు కలిసి కన్సార్టియంగా ఏర్పడి దరఖాస్తు చేశాయి. దీనితోపాటు వచ్చిన ఇతర దరఖాస్తులను ఎంపిక కమిటీ పరిశీలించిన అనంతరం జీఎంఆర్ కన్సార్టియంను సిఫారసు చేసింది.