న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.430 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో వచ్చిన నికర లాభం రూ.352 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధి చెందిందని జీసీపీఎల్ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.2,057 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.2,666 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ నిసాబా గోద్రేజ్ తెలిపారు. ఇబిటా 18 శాతం వృద్ధి చెందిందన్నారు. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1 మధ్యంతర డివిడెండ్ (వంద శాతం) ఇవ్వనున్నామని తెలిపారు.
11 శాతం పెరిగిన ‘భారత’ ఆదాయం
మొత్తం వ్యయాలు రూ.2,057 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,120 కోట్లకు పెరిగాయని నిసాబా వివరించారు. ప్రకటనలు, ప్రచార వ్యయాలు 18 శాతం పెరిగి రూ.226 కోట్లకు చేరాయని తెలిపారు. భారత కార్యకలాపాల ఆదాయం రూ.1,280 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,425 కోట్లకు, ఆఫ్రికా ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.599 కోట్లకు పెరిగాయని వివరించారు.
అయితే ఇండోనేసియా కార్యకలాపాల ఆదాయం 8 శాతం తగ్గి రూ.364 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జీసీపీఎల్ షేర్ స్వల్పంగా పెరిగి రూ.1,061 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment