వారసురాలి చేతికి గోద్రెజ్
♦ కన్జూమర్ ప్రొడక్ట్స్ పగ్గాలు నిసాబాకు
♦ ఈ నెల 10న బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: మరో దిగ్గజ పారిశ్రామిక సంస్థ పగ్గాలు చేతులు మారుతున్నాయి. భారతదేశ వ్యాపార సంస్కృతిలో పెనవేసుకుపోయిన వినియోగ వస్తువుల దిగ్గజం గోద్రెజ్ గ్రూప్... తన కన్జూమర్ ఉత్పత్తుల విభాగ పగ్గాలను నిసాబా గోద్రెజ్‌కు అప్పగించనుంది. గ్రూపులో కీలక సంస్థయిన గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్) చైర్‌పర్సన్‌గా ఆది గోద్రెజ్ కుమార్తె నిసాబా ఈ నెల 10న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె ప్రస్తుతం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
దాదాపు 17 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆది గోద్రెజ్ (75) ఇకపై గౌరవ చైర్మన్‌గా మాత్రం వ్యవహరిస్తారు. 39 ఏళ్ల వయసున్న నిసాబా... దేశీయంగా ఈ స్థాయి సంస్థ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలు కానున్నారు. ఆది గోద్రెజ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె తాన్యా దుబాష్ గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉండగా... చిన్న కుమార్తె నిసాబా ప్రస్తుతం కీలక పదవి చేపట్టబోతున్నారు.
వారిద్దరికన్నా చిన్నయిన కుమారుడు పిరోజ్‌షా గోద్రెజ్... గోద్రెజ్ ప్రోపర్టీస్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘కంపెనీ మూలాలు పటిష్టంగా ఉన్నాయి. కొత్త చైర్‌పర్సన్‌కు అధికారాలు బదలాయించటానికి ఇదే సరైన సమయం. తను కంపెనీని మరింత వృద్ధిలోకి తీసుకొస్తుంది‘ అని ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. కన్జూమర్ గూడ్స్, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు తదితర రంగాల్లో గోద్రెజ్ గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తోంది.
దశాబ్దకాలంగా కంపెనీలో కీలక పాత్ర...
ది వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో గ్రాడ్యుయేషన్ చేసిన నిసాబా.. అటుపైన హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదివారు. గడిచిన దశాబ్దకాలంగా జీసీపీఎల్ వ్యూహాల్లో నిసాబా కీలకపాత్ర పోషిస్తున్నారు. 2011 నుంచి జీసీపీఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు. ఇటు దేశీయంగా కొత్త ఆవిష్కరణలు, కన్సాలిడేషన్‌తో ఎదుగుతూనే అటు అంతర్జాతీయంగా వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులతో గ్రూప్‌ను వృద్ధి పథంలో నడిపేందుకు 2007లో ఆవిష్కరించిన ప్రాజెక్ట్ లీప్ ఫ్రాగ్ రూపకర్త నిసాబానే. ఈ వ్యవధిలో జీసీపీఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20 రెట్లు ఎగసి రూ.3,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరిగింది.
ప్రస్తుతం గ్రూప్ ఆదాయాల్లో సగభాగానికిపైగా విదేశీ మార్కెట్ల నుంచే వస్తోంది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీసీపీఎల్ మొత్తం ఆదాయం రూ. 8,753 కోట్ల నుంచి రూ. 9,608 కోట్లకు పెరిగింది. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి ప్రాజెక్టులకు నిసాబానే సారథ్యం వహిస్తున్నారు. గతంలో గోద్రెజ్ ఆగ్రోవెట్‌ను విజయవంతంగా లాభాల్లోకి మళ్లించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్పేష్ మెహతాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు.
ఒక షేర్‌కు మరో షేర్ బోనస్
గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. ఒక్కో షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను, ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నది. కంపెనీ నికర లాభం 3 రెట్లు (కన్సాలిడేటెడ్) పెరిగి రూ.390 కోట్లకు చేరింది. అన్ని కేటగిరీల్లో అమ్మకాల వృద్ధి జోరుగా ఉండడమే దీనికి కారణం. అంతక్రితం ఏడాది క్యూ4లో నికర లాభం రూ.125 కోట్లు. ఆదాయం రూ.2,204 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.2,480 కోట్లకు పెరిగింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,956ను తాకిన ఈ షేర్ చివరకు 10% లాభంతో రూ.1,929 వద్ద ముగిసింది.