Nisaba Godrej
-
సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా
భారతదేశంలో వ్యాపార దిగ్గజాల్లో ఒకటి గోద్రెజ్ గ్రూప్. 2017లో నిసాబా ఆది గోద్రెజ్ కంపెనీ కీలక బాధ్యతలను నెత్తినవేసుకొని పెనుసవాళ్లను స్వీకరిస్తూ విజయబావుటా ఎగరేసిన ధీర. 13.9 బిలియన్ డాలర్లు విలువైన గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్‌ను గ్లోబల్‌గా తీర్చిదిద్దారు. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్(జీసీసీఎల్) ఆవిష్కారం, ప్రపంచవ్యాప్త కంపెనీగా తీర్చిదిద్దడంలో నిసాబా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2007లో ఆమె ప్రారంభించిన ప్రాజెక్ట్ లీప్‌ఫ్రాగ్, జీసీసీఎల్ ఏకీకరణ ద్వారా ఆగ్రోలో సేంద్రీయ వృద్ధికి దారితీసింది. పలు విదేశాల్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులతో ప్రపంచవ్యాప్త కంపెనీగా మారింది. నెలల చంటిబిడ్డతోనే కుటుంబ వ్యాపారంలోకి ఆమె ప్రవేశం కొంచెం ఆలస్యంగా వచ్చినప్పటికీ, పని పట్ల మక్కువతో, నిబద్దతతో సవాళ్లను ధీటుగా ఎదుర్కొని, వ్యాపార విస్తరణలో నిసాబా తనను తాను నిరూపించుకున్నారు. ఎదురైనా ప్రతీ ఛాలెంజ్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఈ క్రమంలో కుమారుడు జన్మించిన ఒక నెలలోనే , తరచుగా పసిబిడ్డను ఆఫీసుకుని వెళ్లి మరీ పనిని తిరిగి ప్రారంభించారు. నిసాబా గోద్రెజ్ ఇండస్ట్రీస్, దాని సోదర కంపెనీల కోసం కార్పొరేట్ వ్యూహాన్ని కూడా నిసాబా నిర్వహిస్తారు. గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ Re 1 మస్కిటో రెపెల్లెంట్, హిట్ యాంటీ-రోచ్ జెల్ వంటి కొన్ని వినూత్నమైన , ప్రసిద్ధ ఉత్పత్తులను ఆమె పర్యవేక్షణలో వచ్చినవే. అలాగే అధునా భబానీ ఓష్ భబానీకి చెందిన సెలూన్ చైన్ BBluntలో 30 శాతం పెట్టుబడి పెట్టడంతో జీసీపీఎల్ సెలూన్ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్రాండ్ పేరుతో ప్రత్యేకమైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను కూడా విడుదల చేశారు. సోషల్ సర్వీసులోనూ సామాజిక సేవలో కూడా నిసాబా ముందే ఉన్నారు. జీసీపీఎల్ , గోద్రెజ్ అగ్రోవెట్ టీచ్ ఫర్ ఇండియా బోర్డులలో ప్రాతినిధ్యం ఉన్న ఆమె తక్కువ-ఆదాయ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నారు .కళాశాల గ్రాడ్యుయేట్లు పని చేసే నిపుణులను రెండు సంవత్సరాల పాటు పూర్తి సమయం ఉపాధ్యాయులుగా నియమిస్తోంది. అలాగే గోద్రెజ్ గ్రూప్ 'గుడ్ & గ్రీన్' CSR చొరవను కూడా నడుపుతున్నారు . గోద్రెజ్ ఫ్యామిలీ కౌన్సిల్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. నిసాబా గోద్రెజ్ ఎవరు? గోద్రెజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రెజ్ చిన్న కుమార్తె నిసాబా. నిసాబా సోదరి తాన్యా దుబాష్ వ్యాపారంలో ముఖ్యమైన సభ్యులు.1978లో జన్మించిన నిసాబా తన బాల్యాన్ని ముంబైలో తన తోబుట్టువులు తాన్యా దుబాష్ , పిరోజ్షా ఆది గోద్రెజ్‌లతో గడిపారు. నిసాబా 2000లో వార్టన్ స్కూల్, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పొందిన తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పట్టా పొందారు. నిసాబా 2013లో ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతాను వివాహమాడారు. ఈ జంటకు జోరాన్, ఐడాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాగా 1.6 బిలియన్ల (సుమారు రూ. 9,600 కోట్లు) ఏకీకృత ఆదాయాన్ని కలిగి ఉన్న గోద్రెజ్‌లో నిసాబా సంస్థ అతి పిన్న వయసులోనే చైర్మన్ కావడం ఒక విశేషమైతే కంపెనీ బోర్డులో అత్యధికంగా ఐదుగురు మహిళా డైరెక్టర్లుండటం విశేషం. అంతేకాదు మహిళలకు సౌకర్యవంతమైన పని వేళలు, ఇంటినుండి పని చేసే అవకాశాలు, మిడ్మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాన్ని విడిచిపెట్టిన మహిళలు తిరిగి రావడానికి సహాయపడే ప్రోగ్రామ్‌ను అందించడం ద్వారా గోద్రెజ్ మహిళలకు ఉద్యోగాల్లో మరింత ప్రోత్సహిస్తుంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం గోద్రెజ్ నికర విలువ దాదాపు రూ. 1.1 లక్షల కోట్లు . బాలీవుడ్ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా 6 సంవత్సరాల వయస్సులో, నిసా 1986లో బాలీవుడ్ చిత్రం "జాన్బాజ్"లో ప్రారంభ సన్నివేశంలో N.A.G అక్షరాలతో ఉన్న గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించారు. -
గోద్రెజ్ కుర్చీ
తండ్రి కూర్చున్న కుర్చీ కాదు. తండ్రికున్న కుర్చీలలో ఒకటి. కూర్చోబోతున్నారు నిసాబా. ఎండీగా.. సీఈవోగా..! కుర్చీ అంత స్ట్రాంగ్ ఈ కూతురు. నైపుణ్యం.. వ్యాపార వ్యూహం.. ఉమన్ ఫ్రెండ్లీ..ఇంకా ఉన్నాయి ప్రత్యేకతలు. కుర్చీకి వాల్యూ ఇచ్చేవీ తెచ్చేవీ! గోద్రెజ్ కంపెనీకి కొత్త ఎండీగా నిసాబా రావడానికి, నిసాబా గోద్రెజ్ రావడానికి మధ్య మనం కనబరిచే ఆసక్తిలో వ్యత్యాసం ఉంటుంది. ‘నిసాబా’ బయటి అమ్మాయి అయి ఉండి అంత పెద్ద కంపెనీకి ఎండీ అయిందంటే ‘వ్వావ్’ అనేస్తాం. ‘నిసాబా గోద్రెజ్’ గోద్రెజ్ వాళ్లింటి అమ్మాయి కనుక ఏమంత అనిపించకపోవచ్చు. సొంత కంపెనీకి ఎండీ కావడం ఏం గొప్ప అని నోరు చప్పరించేస్తాం. తండ్రి వెనక ఉంటాడు. కూతురు నడిపించేస్తుంది. అంతే కదా అని! గోద్రెజ్ గ్రూపు ఛైర్మన్ ఆదీ గోద్రెజ్ ఆమె తండ్రి అని, గోద్రెజ్ ఆమె తండ్రి కంపెనీ అని పక్కన పెడితే.. బిజినెస్ ఉమన్‌గా నిసాబా ప్రత్యేకతలు నిసాబాకు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు గోద్రెజ్‌కు ఆమెను కష్టించి పని చేసే వారసురాలిగా నిలబెట్టేవి మాత్రమే కాదు, కంపెనీని నిలబెట్టేవి కూడా. 123 ఏళ్ల ఘన చరిత్ర గల ఆ గ్రూపులోని ఒక కంపెనీ అయిన ‘గోద్రెజ్ కన్సూ్యమర్స్ ప్రాడక్ట్ లిమిటెడ్’ (జి.సి.పి.ఎల్.) పగ్గాలను నిసాబా జూలై1 నుంచి చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె అదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్. ఇప్పుడిక ఎండీ., సీఈవో అవుతారు. 20 వేల కోట్ల రూపాయల గోద్రెజŒ మహాసామ్రాజ్యానికి అధిపతి అయిన ఆదీ గోద్రెజ్ సంతానంలోని ముగ్గురిలో చిన్నకూతురు నిసాబా. తనకు ఒక అక్క. తన తర్వాత తమ్ముడు. లాభాలు ఉంటే కంపెనీ నిలుస్తుంది. కంపెనీ మనది అన్న భావన కలిగిస్తే ఉద్యోగులు నిలుస్తారు. ఉద్యోగులే కంపెనీకి లాభం అనే అత్యున్నత స్థాయికి గోద్రెజ్‌ను తీసుకెళ్లారు నిసాబా! ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా ఆమె సారథ్యంలో ఈ మూడేళ్ల కాలంలోనూ జి.సి.పి.ఎల్. లాభాలలో కొనసాగుతూ వస్తోంది. స్పష్టత, అవిశ్రాంత శ్రమ, పట్టుదల, దయామయ దృక్పథం ఈ నాలుగు చక్రాల మీద బండిని సాఫీగా, వేగంగా నడిపించారు. ‘టీచ్ ఫర్ ఇండియా’ సంస్థలో బోర్డు సభ్యురాలు కూడా అయిన నిసాబాకు ‘లేకపోవడం’ ఎలా ఉంటుందో తెలుసు. ముఖ్యంగా చదువు అందుబాటులో లేకపోవడం. టీచ్ ఫర్ ఇండియా ‘టీచ్ ఫర్ ఆల్’ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో భాగం. అభాగ్యులు, అనాథలు అయిన పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తుంటాయి ఈ సంస్థలు. గోద్రెజ్‌లో తన సిబ్బంది పిల్లల చదువు గురించి అందుకే ఆమె పదే పదే అడిగి తెలుసుకుంటుంటారు. పిల్లలు కోరుకుంటున్న చదువులకు మన ఆర్థిక పరిస్థితి అవరోధం కాకూడదని వారికి చెబుతుంటారు. ఫీజులకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తుంటారు! యు.ఎస్.లో బియస్సీ, ఎంబీఏ చేసి వచ్చారు నిసాబా. గోద్రెజ్లోకి వచ్చాక బిజినెస్‌కి తనే ఒక సిలబస్ అయ్యారు! ప్రతి విభాగంలోనూ వినూత్నత, ప్రతి నిర్ణయం వెనుకా ఒక వ్యూహం. మొదట ఆమె 2008లో ‘గోద్రెజ్ ఆగ్రోవెట్’లోకి ఒక డైరెక్టర్‌గా వచ్చారు. పశుపోషణ, వ్యవసాయ సంబంధ సంస్థ అది. ఆమె వచ్చాకే ఆమె వ్యాపార నైపుణ్యాలతో ఆగ్రోవెట్ లాభాల్లోకి మలుపు తిరిగింది. చురుకైన ఆమె ఆలోచనా విధానాలే కంపెనీ లాభాలకు మూలధనం అయ్యాయి. 2014లో నిసాబా గోద్రెజ్ ‘హెచ్ఆర్ అండ్ ఇన్నొవేషన్’ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకు, అంకితభావానికీ, అదే సమయంలో తల్లిగా ఆమె నెరవేరుస్తున్న బాధ్యతకు ఒక నిదర్శనంగా ఆ సంఘటన గురించి ఉద్యోగులు నేటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఏడాది జూలై చివరిలో ప్రసూతి సెలవు పూర్తి కాకుండానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌కి వచ్చేశారు నిసాబా! చేతుల్లో నెల రోజుల బిడ్డ. ఆ ఒక్కరోజు మీటింగుకే కాదు, తన ప్రసూతి సెలవుల్ని పక్కన పడేసి బిడ్డతోనే రోజువారీ విధులకు కూడా హాజరయ్యారు. సంస్థలోని మహిళా ఉద్యోగులు కూడా ఆమెకు కుటుంబ సభ్యులే. వారికి సౌకర్యవంతమైన పని గంటల్ని ఏర్పాటు చేయిస్తారు. ఇంటినుంచి పని చేసుకోడానికి అనుమతిస్తారు. పని ఒత్తిడి లేకుండా చూస్తారు. అంటే.. ఒత్తిడి లేకుండా పని చేసుకునే వాతావరణాన్ని కల్పించడం. వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలోనే ఉద్యోగం మానేసి వెళ్లిన మహిళా సిబ్బందిని కూడా వారి పని సామర్థ్యాలను గుర్తుపెట్టుకుని మరీ నిసాబా వెనక్కు పిలిపించుకుని మళ్లీ ఉద్యోగం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫోర్బ్ మ్యాగజీన్ ఈ విషయంలోనే (ఉమెన్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్) నిసాబాను కీర్తించింది. లిస్టెడ్ కంపెనీల బోర్డు డైరెక్టర్లలో మహిళలు ఎక్కువమంది ఉండటం కూడా నిసాబా నేతృత్వంలోని జి.సి.పి.ఎల్.తోనే మొదలైంది. గోద్రెజ్ కన్సూ్యమర్స్ ప్రాడక్ట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా నిసాబా. జూలై 1 నుంచి ఇదే కంపెనీకి ఎండి., సీఈవోగా భాధ్యతలు చేపట్టబోతున్నారు. -
వారసురాలి చేతికి గోద్రెజ్
♦ కన్జూమర్ ప్రొడక్ట్స్ పగ్గాలు నిసాబాకు ♦ ఈ నెల 10న బాధ్యతల స్వీకరణ న్యూఢిల్లీ: మరో దిగ్గజ పారిశ్రామిక సంస్థ పగ్గాలు చేతులు మారుతున్నాయి. భారతదేశ వ్యాపార సంస్కృతిలో పెనవేసుకుపోయిన వినియోగ వస్తువుల దిగ్గజం గోద్రెజ్ గ్రూప్... తన కన్జూమర్ ఉత్పత్తుల విభాగ పగ్గాలను నిసాబా గోద్రెజ్‌కు అప్పగించనుంది. గ్రూపులో కీలక సంస్థయిన గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్) చైర్‌పర్సన్‌గా ఆది గోద్రెజ్ కుమార్తె నిసాబా ఈ నెల 10న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె ప్రస్తుతం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. దాదాపు 17 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆది గోద్రెజ్ (75) ఇకపై గౌరవ చైర్మన్‌గా మాత్రం వ్యవహరిస్తారు. 39 ఏళ్ల వయసున్న నిసాబా... దేశీయంగా ఈ స్థాయి సంస్థ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలు కానున్నారు. ఆది గోద్రెజ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె తాన్యా దుబాష్ గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉండగా... చిన్న కుమార్తె నిసాబా ప్రస్తుతం కీలక పదవి చేపట్టబోతున్నారు. వారిద్దరికన్నా చిన్నయిన కుమారుడు పిరోజ్షా గోద్రెజ్... గోద్రెజ్ ప్రోపర్టీస్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘కంపెనీ మూలాలు పటిష్టంగా ఉన్నాయి. కొత్త చైర్‌పర్సన్‌కు అధికారాలు బదలాయించటానికి ఇదే సరైన సమయం. తను కంపెనీని మరింత వృద్ధిలోకి తీసుకొస్తుంది‘ అని ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. కన్జూమర్ గూడ్స్, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు తదితర రంగాల్లో గోద్రెజ్ గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తోంది. దశాబ్దకాలంగా కంపెనీలో కీలక పాత్ర... ది వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో గ్రాడ్యుయేషన్ చేసిన నిసాబా.. అటుపైన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివారు. గడిచిన దశాబ్దకాలంగా జీసీపీఎల్ వ్యూహాల్లో నిసాబా కీలకపాత్ర పోషిస్తున్నారు. 2011 నుంచి జీసీపీఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు. ఇటు దేశీయంగా కొత్త ఆవిష్కరణలు, కన్సాలిడేషన్‌తో ఎదుగుతూనే అటు అంతర్జాతీయంగా వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులతో గ్రూప్‌ను వృద్ధి పథంలో నడిపేందుకు 2007లో ఆవిష్కరించిన ప్రాజెక్ట్ లీప్ ఫ్రాగ్ రూపకర్త నిసాబానే. ఈ వ్యవధిలో జీసీపీఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20 రెట్లు ఎగసి రూ.3,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్ ఆదాయాల్లో సగభాగానికిపైగా విదేశీ మార్కెట్ల నుంచే వస్తోంది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీసీపీఎల్ మొత్తం ఆదాయం రూ. 8,753 కోట్ల నుంచి రూ. 9,608 కోట్లకు పెరిగింది. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి ప్రాజెక్టులకు నిసాబానే సారథ్యం వహిస్తున్నారు. గతంలో గోద్రెజ్ ఆగ్రోవెట్‌ను విజయవంతంగా లాభాల్లోకి మళ్లించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్పేష్ మెహతాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. ఒక షేర్‌కు మరో షేర్ బోనస్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. ఒక్కో షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను, ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నది. కంపెనీ నికర లాభం 3 రెట్లు (కన్సాలిడేటెడ్) పెరిగి రూ.390 కోట్లకు చేరింది. అన్ని కేటగిరీల్లో అమ్మకాల వృద్ధి జోరుగా ఉండడమే దీనికి కారణం. అంతక్రితం ఏడాది క్యూ4లో నికర లాభం రూ.125 కోట్లు. ఆదాయం రూ.2,204 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.2,480 కోట్లకు పెరిగింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,956ను తాకిన ఈ షేర్ చివరకు 10% లాభంతో రూ.1,929 వద్ద ముగిసింది.