గోద్రెజ్‌ కుర్చీ | Nisaba Godrej Will Become CEO For Godrej Company | Sakshi
Sakshi News home page

గోద్రెజ్‌ కుర్చీ

Published Mon, Jun 29 2020 12:05 AM | Last Updated on Mon, Jun 29 2020 4:45 AM

Nisaba Godrej Will Become CEO For Godrej Company - Sakshi

తండ్రి కూర్చున్న కుర్చీ కాదు. తండ్రికున్న కుర్చీలలో ఒకటి. కూర్చోబోతున్నారు నిసాబా.  ఎండీగా.. సీఈవోగా..! కుర్చీ అంత స్ట్రాంగ్‌ ఈ కూతురు. నైపుణ్యం.. వ్యాపార వ్యూహం.. ఉమన్‌ ఫ్రెండ్లీ..ఇంకా ఉన్నాయి ప్రత్యేకతలు. కుర్చీకి వాల్యూ ఇచ్చేవీ తెచ్చేవీ!

గోద్రెజ్‌ కంపెనీకి కొత్త ఎండీగా నిసాబా రావడానికి, నిసాబా గోద్రెజ్‌ రావడానికి మధ్య మనం కనబరిచే ఆసక్తిలో వ్యత్యాసం ఉంటుంది. ‘నిసాబా’ బయటి అమ్మాయి అయి ఉండి అంత పెద్ద కంపెనీకి ఎండీ అయిందంటే ‘వ్వావ్‌’ అనేస్తాం. ‘నిసాబా గోద్రెజ్‌’ గోద్రెజ్‌ వాళ్లింటి అమ్మాయి కనుక ఏమంత అనిపించకపోవచ్చు. సొంత కంపెనీకి ఎండీ కావడం ఏం గొప్ప అని నోరు చప్పరించేస్తాం. తండ్రి వెనక ఉంటాడు. కూతురు నడిపించేస్తుంది. అంతే కదా అని! గోద్రెజ్‌ గ్రూపు ఛైర్మన్‌ ఆదీ గోద్రెజ్‌ ఆమె తండ్రి అని, గోద్రెజ్‌ ఆమె తండ్రి కంపెనీ అని పక్కన పెడితే.. బిజినెస్‌ ఉమన్‌గా నిసాబా ప్రత్యేకతలు నిసాబాకు ఉన్నాయి.

ఆ ప్రత్యేకతలు గోద్రెజ్‌కు ఆమెను కష్టించి పని చేసే వారసురాలిగా నిలబెట్టేవి మాత్రమే కాదు, కంపెనీని నిలబెట్టేవి కూడా. 123 ఏళ్ల ఘన చరిత్ర గల ఆ గ్రూపులోని ఒక కంపెనీ అయిన ‘గోద్రెజ్‌ కన్సూ్యమర్స్‌ ప్రాడక్ట్‌ లిమిటెడ్‌’ (జి.సి.పి.ఎల్‌.) పగ్గాలను నిసాబా జూలై1 నుంచి చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె అదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌. ఇప్పుడిక ఎండీ., సీఈవో అవుతారు. 20 వేల కోట్ల రూపాయల గోద్రెజŒ  మహాసామ్రాజ్యానికి అధిపతి అయిన ఆదీ గోద్రెజ్‌  సంతానంలోని ముగ్గురిలో చిన్నకూతురు నిసాబా. తనకు ఒక అక్క. తన తర్వాత తమ్ముడు.

లాభాలు ఉంటే కంపెనీ నిలుస్తుంది. కంపెనీ మనది అన్న భావన కలిగిస్తే ఉద్యోగులు నిలుస్తారు. ఉద్యోగులే కంపెనీకి లాభం అనే అత్యున్నత స్థాయికి గోద్రెజ్‌ను తీసుకెళ్లారు నిసాబా! ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌గా ఆమె సారథ్యంలో ఈ మూడేళ్ల కాలంలోనూ జి.సి.పి.ఎల్‌. లాభాలలో కొనసాగుతూ వస్తోంది. స్పష్టత, అవిశ్రాంత శ్రమ, పట్టుదల, దయామయ దృక్పథం ఈ నాలుగు చక్రాల మీద బండిని సాఫీగా, వేగంగా నడిపించారు. ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ సంస్థలో బోర్డు సభ్యురాలు కూడా అయిన నిసాబాకు ‘లేకపోవడం’ ఎలా ఉంటుందో తెలుసు. ముఖ్యంగా చదువు అందుబాటులో లేకపోవడం. టీచ్‌ ఫర్‌ ఇండియా ‘టీచ్‌ ఫర్‌ ఆల్‌’ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో భాగం.

అభాగ్యులు, అనాథలు అయిన పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తుంటాయి ఈ సంస్థలు. గోద్రెజ్‌లో తన సిబ్బంది పిల్లల చదువు గురించి అందుకే ఆమె పదే పదే అడిగి తెలుసుకుంటుంటారు. పిల్లలు కోరుకుంటున్న చదువులకు మన ఆర్థిక పరిస్థితి అవరోధం కాకూడదని వారికి చెబుతుంటారు. ఫీజులకు వ్యక్తిగతంగా కూడా సహాయం  చేస్తుంటారు! యు.ఎస్‌.లో బియస్సీ, ఎంబీఏ చేసి వచ్చారు నిసాబా. గోద్రెజ్‌లోకి వచ్చాక బిజినెస్‌కి తనే ఒక సిలబస్‌ అయ్యారు! ప్రతి విభాగంలోనూ వినూత్నత, ప్రతి నిర్ణయం వెనుకా ఒక వ్యూహం. మొదట ఆమె 2008లో ‘గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌’లోకి ఒక డైరెక్టర్‌గా వచ్చారు. పశుపోషణ, వ్యవసాయ సంబంధ సంస్థ అది. ఆమె వచ్చాకే ఆమె వ్యాపార నైపుణ్యాలతో ఆగ్రోవెట్‌ లాభాల్లోకి మలుపు తిరిగింది. చురుకైన ఆమె ఆలోచనా విధానాలే కంపెనీ లాభాలకు మూలధనం అయ్యాయి. 

2014లో నిసాబా గోద్రెజ్‌ ‘హెచ్‌ఆర్‌ అండ్‌ ఇన్నొవేషన్‌’ విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకు, అంకితభావానికీ, అదే సమయంలో తల్లిగా ఆమె నెరవేరుస్తున్న బాధ్యతకు ఒక నిదర్శనంగా ఆ సంఘటన గురించి ఉద్యోగులు నేటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఏడాది జూలై చివరిలో ప్రసూతి సెలవు పూర్తి కాకుండానే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్‌కి వచ్చేశారు నిసాబా! చేతుల్లో నెల రోజుల బిడ్డ. ఆ ఒక్కరోజు మీటింగుకే కాదు, తన ప్రసూతి సెలవుల్ని పక్కన పడేసి బిడ్డతోనే రోజువారీ విధులకు కూడా హాజరయ్యారు.

సంస్థలోని మహిళా ఉద్యోగులు కూడా ఆమెకు  కుటుంబ సభ్యులే. వారికి సౌకర్యవంతమైన పని గంటల్ని ఏర్పాటు చేయిస్తారు. ఇంటినుంచి పని చేసుకోడానికి అనుమతిస్తారు. పని ఒత్తిడి లేకుండా చూస్తారు. అంటే.. ఒత్తిడి లేకుండా పని చేసుకునే వాతావరణాన్ని కల్పించడం. వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలోనే ఉద్యోగం మానేసి వెళ్లిన మహిళా సిబ్బందిని కూడా వారి పని సామర్థ్యాలను గుర్తుపెట్టుకుని మరీ  నిసాబా వెనక్కు పిలిపించుకుని మళ్లీ ఉద్యోగం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫోర్బ్‌ మ్యాగజీన్‌ ఈ విషయంలోనే (ఉమెన్‌ ఫ్రెండ్లీ వర్క్‌ ప్లేస్‌) నిసాబాను కీర్తించింది. లిస్టెడ్‌ కంపెనీల బోర్డు డైరెక్టర్‌లలో మహిళలు ఎక్కువమంది ఉండటం కూడా నిసాబా నేతృత్వంలోని జి.సి.పి.ఎల్‌.తోనే మొదలైంది. 
గోద్రెజ్‌ కన్సూ్యమర్స్‌ ప్రాడక్ట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా నిసాబా. జూలై 1 నుంచి ఇదే కంపెనీకి ఎండి., సీఈవోగా భాధ్యతలు చేపట్టబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement