
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి పరుగు వరుసగా నాల్గవ వారంలోనూ కొనసాగింది. శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ ధర (31.1గ్రా) ఆరు డాలర్లు లాభపడి 1,232 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,240 డాలర్లను కూడా చూసింది. మూడు నెలల గరిష్ట స్థాయి ఇది. అమెరికా ఈక్విటీ మార్కెట్ల పతనం, బాండ్ ఈల్డ్స్ నష్టాలు దీనికి నేపథ్యం. మొత్తంమీద ఆరు నెలలుగా పడుతూ వచ్చిన పసిడి, 1,160 డాలర్ల వరకూ పతనమైనా, వెంటనే రికవరీతో 1,185–1,210 శ్రేణిలో పటిష్ట కన్సాలిడేటెడ్ ధోరణి ప్రదర్శించింది. 1,200 డాలర్లు పసిడి ‘స్వీట్ స్టాప్’గా విశ్లేషకులు పేర్కొన్నారు.
ఆ లోపునకు ధర పడిపోతే ఉత్పత్తిదారులకు నష్టం వచ్చే పరిస్థితుల్లో అవి మూతపడతాయని, తిరిగి పసిడికి డిమాండ్ పెరిగి వెంటనే 1,200 డాలర్లపైకి పసిడి ఎగయడం ఖాయమని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా–సౌదీ అరేబియాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలూ, కంపెనీల ఫలితాలు ప్రత్యేకించి టెక్నాలజీ సంస్థల గణాంకాలు అంచనాలకు తగినట్లుగా లేకపోవడంమ పసిడి లాభాలకు తోడయ్యాయి. ‘‘ఈక్విటీలు మరింత కిందకు జారితే, పసిడి మున్ముందు మరింతపైకి లేవడం ఖాయం. ఇన్వెస్టర్లు ప్రస్తుతం తమ ఇన్వెస్ట్‌మెంట్లకు పసిడినే ఎంచుకోవడం జరుగుతుంది’’ అని సిటీ ఇండెక్స్‌లో టెక్నికల్ అనలిస్ట్ రజాక్‌జాదా పేర్కొన్నారు.
కొంచెం జాగ్రత్త అవసరం...
అయితే ప్రస్తుత స్థాయి వద్ద కొంత జాగరూకత అవసరమని ఇన్వెస్టర్లకు బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బ్రూచ్ సూచించారు. ప్రస్తుత స్థాయి కీలక నిరోధంగా ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వృద్ధి పటిష్టత, డిసెంబర్‌లో ఈఏడాదిలో నాల్గవసారి ఫెడ్‌రేటు పెంపు అవకాశాలు, డాలర్ ఇండెక్స్ పటిష్ట స్థాయిలో ఉండడం (శుక్రవారం 96.13 వద్ద ముగింపు) వంటి అంశాలను ప్రస్తావించారు.
దేశంలో సానుకూలత
కాగా పసిడి ధరకు దేశంలో మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగా ధర పెరగడం సంగతి ఒకవైపయితే, డాలర్ మారకంలో రూపాయి విలువ మారకం బలహీనత మరోవైపు దీనికి దోహదపడుతున్న అంశాలు.