
సాక్షి,ముంబై : బులియన్ మార్కెట్‌లో పసిడి పరుగుకు అడ్డే లేదు. అమెరికా-ఇరాన్ ట్రేడ్ వార్ ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షిత పెట్టుబడిగా భావించి పుత్తడి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం కూడా పుంజుకున్న బంగారం రూ. 200 ఎగిసి 10 గ్రా. రూ.34,470 పలుకుతోంది. స్థానిక ఆభరణాల కొనుగోళ్లు, అంతర్జాతీయంగా సానుకూల ధోరణి దేశీయ మార్కెట్లలో ధరలను పెంచిందని ఎనలిస్టులుచెబుతున్నారు. వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కిలో వెండి ధర రూ.110 పుంజుకుని 39, 200 పలుకుతోంది. నాణేల తయారీదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో వెండి ధరలు నింగికే చూస్తున్నాయి.
గ్లోబల్‌గా కూడా ఔన్స్ గోల్డ్ ధర 1430 డాలర్లు వద్ద ఉంది. వెండి ఔన్స్ ధర 16 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధరలు రూ .200 పెరిగి 10 గ్రాములకు వరుసగా రూ .34,470, రూ .34,300 కు చేరుకున్నాయి. సావరిన్బంగారం కూడా ఎనిమిది గ్రాములకు రూ .100 పెరిగి రూ .26,900 కు చేరుకుంది. ఆర్థిక అనిశ్చితి, ట్రేడ్ వార్ అందోళనల మధ్య డాలర్ సూచీ గణనీయంగా తగ్గడం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం బంగారం కొనుగోలుకు తోడ్పడి ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు.