భారీగా ఎగిసిన బంగారం ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో శుక్రవారం మార్కెట్‌లో భారీగా ఎగిసిన బంగారం ధరలు, ఒక్కరోజుల్లో ఢమాలమన్నాయి. స్థానిక జువెలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు, బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో శనివారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.820 కిందకి పడిపోయి రూ.30,530గా నమోదైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా పడిపోవడం ఇదే తొలిసారి. నిన్నటి బులియన్ మార్కెట్‌లో ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 990 రూపాయల మేర పెరిగి రూ.31,350గా నమోదైన సంగతి తెలిసిందే.
గ్లోబల్‌గా కూడా ఏడాది గరిష్టానికి ఎగిసిన బంగారం ధరలు 0.19 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,346 డాలర్లగా నమోదయ్యాయి. సిల్వర్ ధరలు 0.91 శాతం తగ్గుముఖం పట్టాయి. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 820 రూపాయల చొప్పున రూ.30,530, రూ.30,380గా నమోదయ్యాయి. మరోవైపు సిల్వర్ ధరలు దేశీయ మార్కెట్‌లో ఫ్లాట్‌గా ఉన్నాయి. కేజీకి రూ.42వేలుగా నమోదయ్యాయి.