
యుధ్ద భయాలతో గోల్డ్ రష్..!
► వారంలో 37 డాలర్లు పెరుగుదల
► మళ్లీ డాలర్ ఇండెక్స్ నేల చూపు
► పసిడిది బుల్‌ట్రెండే అంటున్న నిపుణులు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయంగా అమెరికా – ఉత్తర కొరియా మాటల ‘యుద్ధం’ పసిడిపై ప్రభావం చూపుతోంది. తక్షణ తమ పెట్టుబడుల రక్షణకు ఇన్వెస్టర్లు పసిడిని సాధనంగా ఎంచుకుంటున్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి సైతం డబ్బు పసిడికి వైపునకు తరలుతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఆగస్టు 4వ తేదీతో ముగిసిన వారంలో వారం వారీగా 11 డాలర్లు తగ్గి, 1,258 డాలర్లకు చేరిన ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర తాజాగా ముగిసిన వారంలో (ఆగస్టు 11) మళ్లీ ఒక్కసారిగా ఊపందుకుని 37 డాలర్ల లాభంతో 1,295 డాలర్ల వద్ద ముగిసింది.
ఒక దశలో 1,297 డాలర్లను సైతం దాటింది. భౌగోళిక ఉద్రిక్తతలతోపాటు, డాలర్ ఇండెక్స్ వారీ వారీగా 93.37 డాలర్ల నుంచి 92.99 డాలర్లకు తగ్గడమూ పసిడికి లాభంగా మారింది. అమెరికా వృద్ధి ధోరణులు, ఫెడ్ ఫండ్ రేటు పెంపుపై సైతం అనిశ్చితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పసిడిది బులిష్ ధోరణేననీ, తగ్గినప్పుడల్లా అది కొనుగోళ్లకు అవకాశమనీ నిపుణులు చెబుతున్నారు. పసిడికి 1,240 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందనీ, అటు తర్వాత 1,204 వద్ద మరో మద్దతు లభిస్తుందని వివరిస్తున్నారు.
ఇక పై స్థాయిలో కీలక 1,275 డాలర్లు దాటింది కాబట్టి, తరువాత నిరోధం 1,300 డాలర్లని వారి విశ్లేషణ. ఇదీ దాటితో 1,345 డాలర్ల వద్ద మరో నిరోధం ఉందని టెక్నికల్స్ పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే, మరో నెల రోజుల్లో పసిడి 1,390డాలర్లకు చేరుతుందని ఫండమెంటల్స్ వైపు నుంచి అంచనాలూ ఉన్నాయి. 1,204 వరకూ పడిపోయిన పసిడి తిరిగి నెలతిరక్కుండానే 100 డాలర్లు ఎగయడం గమనార్హం.
దేశంలోనూ పరుగే...: అంతర్జాతీయంగా పసిడి పరుగు ధోరణి దేశీయంగానూ స్పష్టంగా కనిపించింది. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ వారం వారీగా భారీగా 63.75 (రూ.1.71) నుంచి 64.05కు బలహీనపడ్డమూ దేశీయంగా పసిడి పరుగుకు కొంత కారణమైంది. ఈ నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో భారీగా రూ.897 పెరిగి రూ.29,203కి చేరింది. ఇక దేశీయ డిమాండ్ తోడు కావడంతో ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.520 ఎగసి రూ.29,210కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పెరిగి రూ. 29,060కు చేరింది. వెండి కేజీ ధర కూడా భారీగా 1,160 పెరిగి రూ. 39,110కి చేరింది.