భారత్‌లో పసిడి డిమాండ్ కళకళ!
సెప్టెంబర్ క్వార్టర్‌లో 13% అప్
* 268 టన్నులుగా పేర్కొన్న డబ్ల్యూజీసీ నివేదిక
* ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం పెరుగుదల
ముంబై: భారత్‌లో పసిడి డిమాండ్ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగింది. ఈ పరిమాణాన్ని 268 టన్నులుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. త్రైమాసికం ప్రారంభంలో ధరలు తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణమని గోల్డ్ డిమాండ్ ధోరణులపై విడుదల చేసిన ఒక నివేదికలో డబ్ల్యూజీసీ పేర్కొంది.
పెళ్లిళ్లు, పండుగల సీజన్ కూడా డిమాండ్ పెరగడానికి కారణం. గత ఏడాది క్యూ3లో భారత్ పసిడి డిమాండ్ 238 టన్నులు. కాగా ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ మూడవ త్రైమాసికంలో 7.3 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. పరిమాణంలో చూస్తే... ఇది 1,121 టన్నులు. గత ఏడాది 1,042 టన్నులు. డబ్ల్యూజీసీ భారత్ విభాగం మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరం తెలిపిన నివేదిక అంశాల్లో ముఖ్యమైనవి...
* గతేడాది ఇదే కాలంలో భారత్ పసిడి డిమాండ్ 238 టన్నులు. విలువ రూపంలో.. డిమాండ్ 5.8% వృద్ధితోరూ.59,480 కోట్ల నుంచి రూ. 62,939 కోట్లకు ఎగసింది.
* ఒక్క ఆభరణాల విషయంలో డిమాండ్ 15 శాతం పెరిగి 211 టన్నులుగా నమోదయ్యింది. విలువ 7.7% పెరిగి రూ.49,558 కోట్లుగా నమోదయ్యింది. ఒక్క త్రైమాసికాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే... ఆభరణాలకు భారీ డిమాండ్ 2008 క్యూ3లో చోటుచేసుకుంది. అప్పట్లో ఈ డిమాండ్ 213 టన్నులు. అటు తర్వాత ఈ స్థాయి డిమాండ్ ఇదే తొలిసారి. ఆభరణాలకు పసిడి డిమాండ్ భారీగానే ఉన్న విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
* సెప్టెంబర్ త్రైమాసికంలో పెట్టుబడుల డిమాండ్ 6 శాతం వృద్ధితో 57 టన్నులుగా ఉంది. అయితే విలువల్లో మాత్రం అసలు వృద్ధి నమోదుకాకపోగా - 0.8 శాతం క్షీణించింది. రూ.13,484 కోట్ల నుంచి రూ.13,381 కోట్లకు పడింది.
* ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో దిగుమతులు 24 శాతం వృద్ధితో 243 టన్నుల నుంచి 301 టన్నులకు పెరిగింది.
* దసరా, ధన్‌తెరాస్, దీపావళి పండుగల నేపథ్యంలో నాల్గవ త్రైమాసికంలోనూ డిమాండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి ఏడాదికి డిమాండ్ 850-950 టన్నులు ఉండొచ్చు. గత ఏడాది డిమాండ్ 811 టన్నులు.
మనదే మొదటి స్థానం...
డిమాండ్ విషయంలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. చైనా రెండవ స్థానంలో ఉంది. ముగిసిన త్రైమాసికంలో ఈ దేశంలో డిమాండ్ 212 టన్నుల నుంచి 239 టన్నులకు ఎగసింది. మూడవ స్థానంలో ఉన్న అమెరికాలో డిమాండ్ 36 టన్నుల నుంచి 59 టన్నులు ఎగసింది.
జర్మనీ (25 టన్నుల నుంచి 33 టన్నులకు), థాయ్‌లాండ్ (23 టన్నులు) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్త 1,121 టన్నుల డిమాండ్‌లో ఆభరణాలు, నాణేలు, కడ్డీలుసహా వినియోగ డిమాండ్ మొత్తం 14 శాతం పెరుగుదలతో 816 టన్నుల నుంచి 927 టన్నులకు ఎగసింది. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వరుసగా 19వ త్రైమాసికంలో నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. వీటి నుంచి ఈ త్రైమాసికంలో డిమాండ్ 175 టన్నులుగా ఉంది.