
న్యూఢిల్లీ: టర్కీ కరెన్సీ సంక్షోభ ప్రభావాలు యూరప్‌నకు కూడా విస్తరించవచ్చన్న ఆందోళన నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించే పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ధరల్లో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తుండటంతో పసిడి పుంజుకోవచ్చని బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బరూచ్ పేర్కొన్నారు. యూరోతో పోలిస్తే గడిచిన వారంలో పుత్తడి ధర 1.4 శాతం పెరగడం ఈ అంచనాలకు బలమిస్తున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
అమెరికాతో విభేదాల నేపథ్యంలో టర్కీ కరెన్సీ లీరా మారకం విలువ గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు, టర్కీ సంక్షోభానిది ప్రపంచ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపేంత స్థాయి కాదని, అమెరికా డాలర్‌తో పసిడికి తీవ్ర పోటీ కొనసాగుతుందని మరికొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి 12 నెలల కనిష్ట స్థాయి దగ్గరే పసిడి రేట్లు తిరుగాడుతున్నందున టెక్నికల్‌గా ఇంకా డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నట్లు పలువురు విశ్లేషకులు తెలిపారు.
మొత్తానికి 1,205 –1,200 డాలర్ల(ఔన్సు ధర) రేటు కీలకమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇంతకన్నా తగ్గితే పసిడి ఔన్సు (31.1 గ్రాములు) రేటు 1,180 డాలర్లకి క్షీణించవచ్చని, ఒకవేళ పెరిగితే 1,220–1,227 డాలర్ల స్థాయి కీలకంగా మారుతుందని.. దాన్ని అధిగమించిన పక్షంలో స్వల్పకాలంలో 1,250 దాకా ర్యాలీకి అవకాశం ఉందని వివరించాయి. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజీలో పసిడి ధర ఔన్సుకు స్వల్పంగా క్షీణించి.. 1,211.20 డాలర్ల వద్ద క్లోజయ్యింది.
దేశీయంగా పెరిగిన పుత్తడి..
అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్ ఉన్నా.. దేశీయంగా మాత్రం పండుగల సీజన్ నేపథ్యంలో స్థానిక జ్యుయలర్ల కొనుగోళ్ల మద్దతుతో పసిడి రేట్లు వారాం తంలో పెరిగాయి. న్యూఢిల్లీలో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 150 పెరిగి రూ. 30,520 వద్ద ముగిసింది. ఆభరణాల బంగారం కూడా అంతే పెరుగుదలతో రూ. 30,550 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment