బంజారాహిల్స్(హైదరాబాద్ సిటీ): పెద్ద ఎత్తున టర్కీ నోట్లను మార్పిడి చేసేందుకు యత్నించిన ఏడుగురు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. థ్రిల్లర్ స్టోరీని తలపించేలా వీరి అరెస్టు జరిగింది. పోలీసుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి..
కేపీహెచ్‌బీకి చెందిన ఉషారాణి అనే మహిళ తన వద్ద ఉన్న రూ.5 కోట్ల విలువైన టర్కీ నోట్లను మార్పిడి చేసేందుకు కొంతమంది యువకులను సంప్రదించింది. ఒక్కో టర్కీ నోటు విలువ రూ. 5 లక్షలు ఉంటుందని, వీటిని మార్చితే కమీషన్ పద్ధతిలో డబ్బులు ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మిద్దెల నవీన్‌కుమార్, మట్కూరి శంకర్‌రావు, మణికొండ వెంకట్‌రావు, జల్లెపల్లి వెంకట గోపాలకృష్ణ, దాసరి రాంబాబు, లక్కోజి దత్త ప్రసన్నగురు, శివప్రసాద్, బగ్గం శివప్రసాదరావు తదితరులు టర్కీ నోట్లను మార్చేందుకు రంగంలోకి దిగారు. ఈ నెల 10న కారులో టర్కీ నోట్లను తీసుకుని వారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీ మీదుగా వెళ్తుండగా అప్పటికే సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించారు.
నోట్ల మార్పిడికి వచ్చింది ఎవరంటే..
టర్కీ నోట్లను తీసుకోవడానికి వచ్చానంటూ రెండురోజుల నుంచి ఓ వ్యక్తి వీరితో సెల్‌ఫోన్‌లో సంప్రదింపులు జరిపాడు. నోట్ల మార్పిడి కోసం బంజారాహిల్స్ రోడ్డులోని హార్లీ డేవిడ్‌సన్ షోరూం వద్ద ఉన్నట్లు చెప్పగా అక్కడ వచ్చి అతన్ని వారు కారు ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వచింది నోట్లు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి కాదని పోలీస్ కానిస్టేబుల్ అని తెలుసుకోవడంతో వారు బిత్తరపోయారు. ఆ కానిస్టేబుల్ చితకబాదుతూ కారులో తీసుకెళ్లారు. కారులో కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి గట్టిగా అరవడంతో.. కిడ్నాప్ చేస్తున్నారేమోనని అనుమానం వచ్చి ట్రాఫిక్ పోలీసులు వెంబడించారు. అమృతా బార్ వద్ద కారుకు అడ్డంగా బైక్ నిలుపడంతో నోట్ల మార్పిడి గుట్టు రట్టయింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని 100 టర్కీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉషారాణి, ఫిరోజ్ అనే ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలోఉన్నారని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment