పసిడికి అమెరికా ‘వృద్ధి’ కళ్లెం!
♦ ఒకే వారంలో 38 డాలర్లు పతనం
♦ ఐదు వారాల నుంచీ ఇదే ధోరణి...
♦ అమెరికా సానుకూల
♦ జాబ్ డేటా తాజా డౌన్‌కు నేపథ్యం
అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరందుకుంటోందని, అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1% – 1.25%) పెంపు పరంపర కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో, ఇన్వెస్టర్లు బంగారం నుంచి భారీగా తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) 7వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 38 డాలర్లు పడిపోయి కీలక మద్దతు అయిన 1,242 డాలర్ల నుంచి రెండవ మద్దతు స్థాయి 1,211 డాలర్లకు పడిపోయింది.
అమెరికా వృద్ధి అంచనాల నేపథ్యంలో సమీప కాలంలో దిగువ స్థాయివైపు పయనానికే అవకాశం ఉందన్నది అంచనా. ఐదు వారాల నుంచీ పసిడి ధర పడిపోతూ వచ్చింది. ఐదు సార్లు వెనక్కు తిరిగిన 1,242 డాలర్ల మద్దతునూ తాజాగా పసిడి కోల్పోవడంతో పసిడి పతనం కొనసాగుతుందన్నది విశ్లేషణ. మార్చి 15 తరువాత ఈ స్థాయికి పసిడి రావడం ఇదే తొలిసారి. అంచనాలకు మించి అమెరికా జూన్ ఉపాధి కల్పనా గణాంకాలు (2,22,000) వెలువడ్డం తాజా పతనం నేపథ్యం. గడచిన వారంలో డాలర్ ఇండెక్స్ కూడా వారం వారీగా బలపడి 96 స్థాయిల పైన (ముగింపు 0.40 అధికంగా 95.78) తిరగడం గమనార్హం.
దేశంలోనూ రూ.655 పతనం...
మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు జూలై 7వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ధోరణిని కొనసాగించింది. ధర రూ. 655 పడిపోయి, రూ.27,784కు చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.535 తగ్గి, రూ.28,235కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర భారీగా రూ.2,170 పడిపోయి రూ.36,910కి చేరింది.