
దావోస్ : గూగుల్, ఫేస్‌బుక్‌లపై బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి వినూత్న ఒరవడులకు అవరోధమని, సోషల్ మీడియా కంపెనీలు ప్రజాస్వామ్యానికి చేటని ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఓ సదస్సును ఉద్దేశించి సొరోస్ మాట్లాడుతూ అమెరికన్ ఐటీ దిగ్గజాలకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రజల ఆలోచనాసరళి, ప్రవర్తనలపై వారికి తెలియకుండానే సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల రాజకీయాలపై, ప్రజాస్వామ్య పనితీరుపై ఇవి దుష్ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా జోక్యంతో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు పోషించిన పాత్రపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సొరోస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సోషల్ మీడియా కంపెనీలు అవి అందించే సేవలకు యూజర్లను ఉద్దేశపూర్వకంగా కట్టిపడేస్తున్నాయని అన్నారు. ఈ పరిణామాలు యుక్తవయసు వారికి తీవ్ర హానికరమని ఆయన హెచ్చరించారు.