
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని పరిశ్రమల సంఘం ఫిక్కి సూచించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని హితవు పలికింది. గత 11 ఏళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించినప్పటికీ వాటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో రూ.11,400 కోట్ల మేర స్కామ్ బయటపడిన నేపథ్యంలో ఫిక్కి ఈ మేరకు తన అభిప్రాయాలను వ్యక్తీకరించింది.
‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల బలహీన పనితీరు కారణంగా ప్రభుత్వ ఆర్థిక వనరులపై నిరంతరం ఒత్తిళ్లు ఉంటున్నాయి. వాటిని ప్రైవేటీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీనివల్ల ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయి. వాటిని అభివృద్ధి పథకాలకు ఖర్చు చేయవచ్చు’’ అని ఫిక్కి ప్రెసిడెంట్ రాషేష్ షా పేర్కొన్నారు. క్రియాశీల బ్యాంకింగ్ తక్షణావసరమైన నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులు ఆధిపత్యం చేస్తుండడాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు.
‘‘సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం భారత్ స్థిరమైన అధిక వృద్ధి రేటును నమోదు చేయాల్సి ఉంది. బలమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక రంగం సాయం లేకుండా ఇది సాధ్యం కాదు’’అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ బ్యాంకింగ్ రంగంలో 70 శాతం వాటా కలిగిన పీఎస్‌బీలు అధిక ఎన్‌పీఏల సమస్యను ఎదుర్కోవడాన్ని షా ప్రస్తావించారు.
వారిని పక్కన పెట్టాలి: ఏఐబీఈఏ
పీఎన్‌బీలో స్కామ్‌పై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులను, మొత్తం యాజమాన్యాన్ని ఆ బాధ్యతల నుంచి పక్కన పెట్టాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది. కేవలం కిందిస్థాయి ఉద్యోగుల పాత్రే ఇందులో ఉందన్న భావన కలుగుతోందని పేర్కొంది.‘‘కింది స్థాయిలో తప్పులు చేసే వారిని సమర్థించడం లేదు. కానీ, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే బాధ్యులనే అభిప్రాయం కలుగుతోంది.
ఒక బ్యాంకు, ఒక శాఖ, ఇద్దరు ఉద్యోగులకే ఈ మోసాన్ని పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, భారీ స్థాయి మోసాలను సులభ విధానంలో చేయడం అసాధ్యం. ఓ శాఖ ఉద్యోగి రూ.11,400 కోట్ల మేర ఎల్‌వోయూలను ఆరు, ఏడేళ్ల కాలంలో వేరే వారికి తెలియకుండా జారీ చేయడం సాధ్యం కాదు’’ అని ఏఐబీఈఏ జన రల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నా రు. టెక్నాలజీ, పర్యవేక్షణ, ఆడిట్, అంతర్గత నియంత్రణ, ఆర్‌బీఐ పాత్రపై ఈ స్కామ్ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తినట్టు ఏఐబీఈఏ పేర్కొంది.
ఆడిటర్ల నియామకం కఠినతరం
పీఎన్‌బీ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్టాట్యుటరీ ఆడిటర్ల నియామక నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవకతవకలను ముందుగా గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సాయపడుతుందని భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులే ఏటా ఆడిటర్లను నియమించుకుంటున్నాయి. అయితే, పీఎన్‌బీలో భారీ మోసం ఆల స్యంగా వెలుగు చూడడంతో ఎందుకు ఇన్నాళ్లు గుర్తించలేకపోయారని ఆడిటింగ్ వ్యవస్థపై ప్రశ్నలకు లేవనెత్తింది.
‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థల(సీపీఎస్‌ఈ)కు ఆడిటర్ల నియామకంలో భేదం ఉంది. ప్రభుత్వరంగ కంపెనీ అయితే ఓ ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్‌ను కాగ్ నియమిస్తుంది. ఆడిటర్ తన నివేదికను కాగ్‌కు సమర్పించడం జరుగుతుంది. సీపీఎస్‌ఈలో ఆ స్థాయి స్కామ్ ఎందుకు చోటు చేసుకోలేదు. కంపెనీలకు, బ్యాంకులకు ఆడిటర్ల పనితీరులో ఎంతో అంతరం ఉంది’’అని ఓ అధికారి పేర్కొన్నారు.