యాపిల్కు షాకిచ్చిన కేంద్రం?
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్న ఆపిల్ కు భారీ షాక్ తగిలింది. యాపిల్ స్టోర్లు, రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకం అనే రెండు ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన యాపిల్ కు కేంద్రప్రభుత్వం అడ్డుకట్టవేసింది. యాపిల్ స్టోర్లను నెలకొల్పేందుకు ఆపిల్ పెట్టుకున్న దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది. ఆపిల్ అనుకున్న ప్లాన్ ఇండియాలో అమలు చేయడానికి నిబంధనలు అనుమతించవని ఖరాఖండిగా చెప్పేసిందని పేర్కొంది.
యాపిల్ రీఫర్బిష్డ్ ఫోన్లను (వినియోగ ఫోన్లు) దిగుమతి చేసుకుని విక్రయాలకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రాండెడ్ రిటైల్ స్టోర్లు తెరుచుకోవడానికి స్థానికంగా ఉన్న నిబంధనల్లో సడలింపు ఉండదని తేల్చి చెప్పింది. 30శాతం లోకల్ సోర్సింగ్ ఉండాలన్న నిబంధననుంచి వెనక్కితగ్గేది లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ నిబంధననుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా యాపిల్ కోరిందని తెలిపారు. భారత్ లో ఉద్యోగల కల్పన కోసం ఉద్దేశించిన ఈ నిబంధన సడలింపు కుదరదని జైట్లీ తేల్చి పారేశారు.
మరోవైపు యాపిల్ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్' వార్తా సంస్థ తెలియజేసింది. ఇలా కేంద్రం నుంచి అనుకోని షాక్ తగలడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్టయింది. పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయితే ఆపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని కొంతమంది నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు.
అయితే యాపిల్ కు ఇటీవలే భారత్ లో రిటైల్ స్టోర్లు ఏర్పాటుచేసుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి అనుమతులు లభించాయి.ఎఫ్ డీఐ నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రీటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అనుమతి కల్పించింది. కానీ మూడింట ఒక వంతు కాంపోనెంట్స్ భారత్ కు చెందినవే ఉండాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం చెప్పింది. స్థానిక ఉద్యోగవకాశాలను, పరిశ్రమను అభివృద్ధి చేయడమే ఈ నిబంధ ఉద్దేశమని స్పష్టం చేసింది.
కాగా పడిపోతున్న యాపిల్ అమ్మకాలను పునరుద్ధరించుకునే చర్యలో భాగంగా సీఈవో టిమ్ కుక్ ఇటీవలే భారత్ లో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలు ప్రభుత్వ సీనియర్ అధికారులను, టెక్ నిపుణులను కలిశారు. ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి, సిద్ధి వినాయక టెంపుల్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.